Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈయూ పార్లమెంటు తీర్మానం
బ్రస్సెల్స్ : చైనా-ఇయు సమగ్ర పెట్టుబడుల ఒప్పందాన్ని (సిఎఐ) స్తంభింపజేస్తూ యురోపియన్ పార్లమెంట్ గురువారం ఒక తీర్మానాన్ని ఆమోదిం చింది. ఈ చర్య వల్ల ఇయు ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందని తెలిసినా కూడా ఇయు ఎందుకిలా వ్యవహరించినట్లు? దీని వెనక ఎవరున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి చైనా, రష్యాలను వేరు చేసి, దాని ఆర్థిక ఎదుగుదలను అడ్డుకోవడానికి ఇటీవల లండన్‌లో జరిగిన జి-7 విదేశాంగ మంత్రుల సమావేశం నిర్ణయించింది. 2028 నాటికి చైనా అమెరికాను దాటి ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని ఐఎంఎఫ్ వంటి సంస్థలు ప్రకటించాయి. దీంతో చైనాను ఆర్థికంగా ఎదగనీయకుండా చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. జి-7 , నాటో కూటముల్లోని సభ్య దేశాలపై మరీ ముఖ్యంగా యూరోపియన్ దేశాలపై అది ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇయు పార్లమెంటు చైనా పెట్టుబడుల ఒప్పందం నిలిపివేత నిర్ణయం తీసుకుంది. చైనాకు వ్యతిరేకంగా యురోపియన్ పార్లమెంట్ తీసుకున్న చర్య నిరాధారమైన, రాజకీయ దురుద్దేశంతోకూడిన కవ్వింపు చర్యగా పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయ బలవంతపు చర్యలను ఇయు విడనాడాలని వారు కోరారు. దీనివల్ల చైనాను బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదగకుండా నిరోధించలే మని, దీని కోసం ఇయు తన ప్రయోజనాలను పణంగా పెట్టడం దురదృష్టకరమని అన్నారు. షిన్జియాంగ్ ప్రాంతంలో మానవ హక్కులను చైనా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ యురోపియన్ యూనియన్ చైనాపై ఆంక్షలు విధించింది. అందుకు ప్రతిగా చైనా ఎదురు ఆంక్షలు విధించింది. దీంతో సమస్య ఉత్పన్నమైంది. ఒప్పందాన్ని ధ్రువీకరించే చర్చలను స్తంభింపచేయాలని యురోపియన్ పార్లమెంట్ నిర్ణయించింది. చైనా ఆంక్షల కారణంగానే ఈ వైఖరి తీసుకున్నామని యురోపియన్ పార్లమెంట్ కార్యాలయం గ్లోబల్ టైమ్స్‌కి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. చైనా-ఇయు సమగ్ర పెట్టుబడుల ఒప్పందంపై ఇరు పక్షాలు ఏడేళ్ళపాటు చర్చలు జరిపాయి. ఇవి 2020 చివరిలో ముగిశాయి. 2022కల్లా ఒప్పందం ధ్రువీకరణ క్రమం పూర్తవాలని భావిస్తున్నట్లు ఇయు ఆనాడు పేర్కొంది. ఈ ఒప్పందం చైనా కంటే ఇయుకే ఎక్కువ ప్రయోజనకరం. యురోపియన్ వాణిజ్య సంస్థలు చైనా మార్కెట్లోకి ప్రవేశించడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. అయితే, ఇయు సభ్య దేశాల్లోనే అభిప్రాయ భేదాలు వున్నందువల్ల ఈ ప్రతిష్టంభనను ఇతర ఇయు సంస్థలు, సభ్య దేశాలు ఆమోదించకపోవచ్చని చైనా నిపుణులు భావిస్తున్నారు.
''తమకు తాము ప్రయోజనం చేకూర్చు కోకుండా ఎదుటివారికి హాని కలిగించేలా'' ఈ చర్య వుందని చైనా అంతర్జాతీయ అధ్యయనాల సంస్థలో యురోపియన్ అధ్యయనాల విభాగానికి చెందిన డైరెక్టర్ హాంగ్జియాన్ వ్యాఖ్యానించారు. దీనివల్ల ఇయుపైనే భ్రావం ఎక్కువగా వుంటుందని అన్నారు. మరో మార్గం లేకపోవడంతో ఆంక్షలు ఎత్తివేయాలంటూ చైనాను బెదిరించడానికి ఈ ఒప్పంపదాన్ని రద్దు చేశారని వ్యాఖ్యానించారు. ''తమకు ఏది వాస్తవంగా ప్రయోజనం చేకూరుస్తుందో ఇయు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎందుకంటే కరోనా తాకిడితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సి వుందని అన్నారు. ఒప్పందాన్ని స్తంభింపచేయడమంటే ఒప్పందాన్ని రద్దు చేయడంతో సమానమని చైనా మాజీ వాణిజ్య అధికారి వెయివెన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాతో విభేదించడానికి బదులుగా కలిసి ముందుకు సాగేలా చర్యలు తీసుకోవడమే కీలకమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రష్యాలో ప్రభుత్వ మార్పు కోరుతూ ఈయూ మరో తీర్మానం
రష్యాలో ప్రభుత్వ మార్పు జరగాలంటూ ఇయు మరో తీర్మానం చేసింది. ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై యురోపియన్ పార్లమెంట్ ఇటీవల ముసాయిదా తీర్మానం రూపొందించింది. అయితే, రష్యా దీనిని కొట్టి పారేసింది. యూరోపియన్ పార్లమెంటును పనికిమాలిన కబుర్ల క్లబ్‌గా అది అభివర్ణించింది. మరోపక్క ఇదొక అర్ధరహితమైన వాదనగా పేర్కొంటూ యూరప్‌లో ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఇటీవలి కాలంలో యురోపియన్ పార్లమెంట్ సభ్యులు వరుసగా రష్యా వ్యతిరేక తీర్మానాలు ఆమోదిస్తున్న క్రమంలో ఇది తాజా తీర్మానం.