Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాగతించిన ప్రపంచ దేశాలు
- శిథిలాల తొలగింపులో పాలస్తీనియన్లు
- బయటపడిన మరో అయిదు మృతదేహాలు
జెరూసలెం : గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయిల్, హమస్ అంగీకరించాయి. ఈ మేరకు గురువారం ఇజ్రాయిల్ కేబినెట్ ఆమోదం తెలియచేయగా, హమస్ సీనియర్ అధికారి దీనిని ధ్రువీకరించారు. ఇది పరస్పర ఆమోదయోగ్యమైన, ఏకకాల ఒప్పందంగా పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుండి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. గాజాలో 11 రోజుల పాటు హింస చెలరేగిన తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయంగా కూడా ఈ ఒప్పందాన్ని అందరూ స్వాగతించారు. ఇప్పటివరకు ఈ హింసలో 232మంది పాలస్తీనియన్లు, 12మంది ఇజ్రాయిలీలు మరణి ంచారు. 2014 తర్వాత ఇంత స్థాయిలో హింస పెచ్చరిల్లడం ఇదే. ''వాస్తవికంగా నెలకొన్న పరిస్థి తులే భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తాయని'' ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఈజిప్ట్ చొరవతో కుదిరిన ఈ బేషరతు ఒప్పందాన్ని ఏకగ్రీవంగా తమ మం త్రివర్గం ఆమోదించిందని నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పాలస్తీనా గ్రూపులు హమాస్, ఇస్లామిక్ జిహాద్‌లు కూడా ధృవీకరిస్తూ ప్రకటన జారీ చేశాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించారు. గాజాకు మానవతా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒప్పందం కుదిరేలా మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాV్‌ాను బైడెన్ ప్రశంసించారు. కాల్పుల విరమణ కుదిరిన నేపథ్యంలో గాజా, ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి సంతోషం వ్యక్తం చేశారు. గాజాలో పరిస్థితులు దారుణంగా వున్నాయి. ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. వైద్య సరఫరాలు తగ్గిపోతున్నాయి, ఏకైక కొవిడ్ పరీక్షా కేంద్రం కూడా ధ్వంసమైంది. ఇప్పుడు కాల్పుల విరమణ జరిగిన నేపథ్యంలో సరిహద్దులు తెరిస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ సరఫరాలను పంపాల్సి వుంది. గాజా సొరంగం నుండి ఐదు మృతదేహాలను వెలికితీశారు. మరో పదిమందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఇజ్రాయిల్ దాడుల్లో ఈ సొరంగం దెబ్బతింది. 51పాఠశాలలు నేలమట్టమయ్యాయి. ఇప్పటికీ 66వేల మందికి పైగా ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆరు ఆస్పత్రులు, 11 ప్రాథమిక కేంద్రాలు ధ్వంసమయ్యాయి. గాజాలో విద్యుత్ నెట్వర్క్ కూడా బాగా దెబ్బతింది. దీంతో రోజుకు 20 నుండి 21గంటల పాటు విద్యుత్ సరఫరా వుండడం లేదు. దీనివల్ల నీరు, పారిశుధ్యం సరఫరాలకు కూడా అంతరాయం కలుగుతోంది. లక్షలాదిమందికి సురక్షిత తాగునీరు కరువైంది. కాల్పుల విరమణ తర్వాత హమాస్ రాకెట్ దాడులకు దిగితే పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయని నెతన్యాహు హెచ్చరించారు. కాగా ఇజ్రాయిల్ ఆక్రమణ ప్రారంభమైనప్పటి నుండి పాలస్తీనా ముఖచిత్రం ఎలా మారుతూ వచ్చిందో ప్రపంచానికి తెలియచేయాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ వ్యాఖ్యానించారు.
గాజాకు 70లక్షల డాలర్ల సాయం అవసరం
గత పది రోజులుగా గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో ఇజ్రాయిల్ సాగించిన దాడులతో అక్కడ ఆరోగ్య అత్యయిక పరిస్థితి నెలకొందని, ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వచ్చే ఆరు మాసాల్లో 70 లక్షల డాలర్లు అవసరమవుతాయని, ఈ సాయాన్ని తక్షణమే అందించాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) గురువారం అంతర్జాతీయ సమాజానికి అప్పీలు చేసింది. ఈ నిధులతో రాబోయే కాలంలో సమగ్రమైన రీతిలో పరిస్థితులను ఎదుర్కొనడానికి వీలవుతుందని పేర్కొంది.