Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబరు 12, 19 తేదీల్లో మధ్యంతర ఎన్నికలు
ఖాట్మండు : నేపాల్ పార్లమెంట్‌ను ఆ దేశ అధ్యక్షురాలు వైద్య దేవి భండారి రద్దు చేశారు. నవంబరు 12, 19 తేదీల్లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ప్రధాని కెపి శర్మ ఓలి, ప్రతిపక్ష కూటమి రెండూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేవని నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం గడువులోగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఉందని ప్రధాని ఓలి, ప్రతిపక్ష నేత షేర్ బహదూర్ దేవా నిరూపించుకోలేకపోయారని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత పార్లమెంట్ రద్దు ప్రకటన వెలువడింది. అర్ధరాత్రి అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించిన అనంతరం 275 మంది సభ్యులు గల ప్రతినిధుల సభను రద్దు చేయాల్సిందిగా ప్రధాని ఓలి అధ్యక్షురాలికి సిఫార్సు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది డిసెంబరు 20న భండారీ పార్లమెంట్‌ను రద్దు చేసినా, ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు మళ్లీ ఏర్పాటు చేసింది. మొదటి దశ పోలింగ్‌ను నవంబరు 12న, రెండో దశ పోలింగ్‌ను నవంబరు 19న నిర్వహించాలని మంత్రివర్గం సిఫార్సు చేసింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్లో 136మంది సభ్యుల మద్దతు ఉండాలి. ఇక్కడ ఓలి, దేవాలకు మద్దతిస్తున్నవారి పేర్లు రెండు జాబితాల్లోనూ ఉంటున్నాయని మీడియా వార్తలు తెలిపాయి. ఇరువురు నేతలు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని విడివిడిగా అధ్యక్షురాలికి లేఖలు సమర్పించారు. తనకు 153మంది సభ్యుల మద్దతు ఉందని తొలుత ఓలి పేర్కొన్నారు. ఆ మరుసటి రోజు, సభా వేదికపై మెజారిటీ నిరూపణకు అవసరమైన బలం లేదని పేర్కొంటూ పార్లమెంట్ రద్దుకు సిఫార్సు చేశారు.