Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరణాల సంఖ్యపై డబ్ల్యూహెచ్ఓ
- 2020లో కరోనామరణాలు 34లక్షలు : డబ్ల్యూహెచ్ఓ అంచనా
- ఆయా దేశాలు అధికారికంగా వెల్లడించిన మరణాలు 18లక్షలు
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా 90శాతం దేశాలు కరోనా మరణాలపై వాస్తవ సమాచారాన్ని దాస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. అనేక దేశాల్లో మరణాల గణన నిర్దుష్టంగా సాగటం లేదని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2020లో కనీసం 34లక్షల మంది కరోనా బారినపడి మరణించి ఉండొచ్చని అంచనావేసింది. ఆయా దేశాలు అధికారికంగా వెల్లడించిన మరణాలతో (18లక్షలు) పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ అని తెలిపింది. ఈమేరకు డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య గణాంకాల పేరుతో శనివారం ఒక ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. తాజా నివేదిక ప్రకారం, 2020 డిసెంబరు 31నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8.2కోట్లు. మృతుల సంఖ్య 18 లక్షలుగా ఉందని ఆయా దేశాల అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి అంతకంటే కనీసం 16 లక్షల మరణాలు అధికంగా సంభవించి ఉండొచ్చు. చాలా దేశాల్లో కరోనాబారిన పడి ఆస్పత్రుల్లో మరణించినవారిని, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాక మృతి చెందినవారినే లెక్కించారు. వ్యాధి నిర్ధారణ సరిగా జరగకముందే కన్నుమూసినవారిని లెక్కల్లోకి తీసుకోలేదు. కోవిడ్ సంక్షోభం పరోక్షంగా కూడా చాలా మరణాలకు దారితీసింది. వాటినీ గణించలేదు. ఆదాయం, వయస్సు, జాతి తదితర అంశాల ప్రాతిపదికన సమాజంలో అసమానతలు ఉన్నాయని మహమ్మారి ఎత్తిచూపింది. అన్ని దేశాలూ డేటా సేకరణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాల్సిన ఆవశ్యకతను కోవిడ్ నొక్కి చెప్పిందని డబ్ల్యూహెచ్ఓ అధినత టెడ్రోస్ అథనోమ్ చెప్పారు.
86శాతం కేసులు భారత్‌లో
ఆగేయాసియా ప్రాంతంలో ఇప్పటివరకు (1 మే, 2021) 2.31కోట్ల కేసులు నమోదయ్యాయి. ఇందులో 86శాతం కేసులు భారత్‌లో ఉన్నాయి. ప్రపంచంలో మొత్తం కోవిడ్ మరణాల్లో 48శాతం ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల్లో ఉన్నట్టు అంచనావేస్తున్నాం. 33శాతం మరణాలు యూరప్ దేశాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాక్సిన్ పంపిణీలో అసమానతలు నెలకొన్నాయి. అల్పాదాయ దేశాల్లో 1శాతం మంది వ్యాక్సిన్ పొందితే, మధ్యస్థాయి ఆదాయ దేశాల్లో 19శాతం మంది వ్యాక్సిన్ పొందారు. ఎగువ ఆదాయ దేశాల్లో 33శాతం మంది, అధిక ఆదాయ దేశాల్లో 47శాతం మంది వ్యాక్సిన్ పొందారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మే 1నాటికి ప్రపంచవ్యాప్తంగా 100కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని, ఇందులో అత్యధికం ఉత్తర, దక్షిణ అమెరికా (33శాతం), ఈయూ (23శాతం), పసిఫిక్ (22) దేశాల్లో పంపిణీ అయ్యిందని తెలిపింది.