Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'చైతన్య దినం'గా పాటించాలని పిలుపు
వాషింగ్టన్: మిన్నెపొలిస్‌లో శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి మోకాళ్ళ క్రింద నలిగి ఊపిరాడక మరణించిన నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మంగళవారం 'చైతన్య దినం'గా పాటించనున్నారు. గతేడాది ఇదే రోజున జరిగిన ఈ దారుణ ఘటన నల్ల జాతీయుల దుస్థితిని ప్రపంచం కళ్ళకు కట్టినట్లు చూపించిందని జార్జి ప్లాయిడ్ మెమోరియల్ సెంటర్ వెబ్సైట్ పేర్కొంది. ఫ్లాయిడ్ మరణించి ఏడాది గడిచినా ఇంకా వాటి ప్రకంపనలు కనిపిస్తూనే వున్నాయి. ఆనాటి ఆ కిరాతక చర్యను 17ఏళ్ళ బాలిక తీసిన వీడియో తర్వాత వైరల్‌గా మారింది. వెనువెంటనే అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు, ఆందోళనలు తలెత్తాయి. చాలావరకు ప్రశాంతంగానే జరిగినా కొన్ని ఆందోళనా కార్యక్రమాల్లో హింస చెలరేగింది. మిన్నెపొలిస్‌లో పోలీసు స్టేషన్‌ను దగ్ధం చేశారు. అక్కడ నేషనల్ గార్డ్ బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని పునరుద్ధరించాయి. లండన్ నుండి లిస్బన్ వరకు ప్రదర్శనకారులు నల్ల జాతీయులకు సంఘీభావం ప్రకటించారు. పోలీసు బలగాల దుశ్చర్యలను ఖండించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే వ్యవస్థాగత వర్ణ వివక్షను సమూలంగా నాశనం చేస్తామని ఆనాటి ఫ్లాయిడ్ అంత్యక్రియలకు హాజరైన బైడెన్ హామీ ఇచ్చారు. కానీ అప్పటి అధ్యక్షుడు ట్రంప్ మాత్రం పోలీసు బలగాలకు మద్దతుగా నిలిచారు. అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బైడెన్, ''వర్ణ సమానత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే'' ఆదేశాలపై సంతకాలు చేశారు. కానీ పోలీసు చట్టంలో జార్జి ఫ్లాయిడ్ జస్టిస్‌ను ఆమోదించేందుకు డెమోక్రాట్లు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సెనెట్‌లో రిపబ్లికన్ల వ్యతిరేకతే అందుకు కారణం. దేశవ్యాప్తంగా స్థానిక, రాష్ట్ర పోలీసు శాఖల్లో కొన్ని సంస్కరణలు తీసుకువచ్చారు. ఈ ఘటనకు కారకుడైన చావిన్‌ను మిన్నెపొలిస్ పోలీసు విభాగం తొలగించింది. ఫ్లాయిడ్‌ను హత్య చేశారంటూ మార్చిలో అభియోగాలు మోపింది. జూన్ 25న శిక్ష విధించాల్సి వుంది. ఈ ఘటనకు సంబంధించి మరో ముగ్గురు పోలీసు అధికారులు ఇంకా విచారణను ఎదుర్కొనాల్సి వుంది.