Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోగుల దుస్తుల వాసనను బట్టి 90 శాతం కేసుల గుర్తింపు
లక్షణాలు లేని వారిని కూడా గుర్తిస్తున్న కుక్కలు : లండన్ స్కూల్ ఆఫ్
ట్రాపికల్ మెడిసన్ పరిశోధకుల వెల్లడి
- తక్కువ సమయంలో ఎక్కువ పరీక్షలు చేయొచ్చని సూచన
ఇన్నాళ్లు బాంబులను కనిపెట్టే శునకాలను, దొంగల జాడను గుర్తించే కుక్కలను చూసుంటాం. అయితే, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కూడా పసిగట్టే కుక్కలు వచ్చేశారు. ఎలాంటి కిట్ లు, పరీక్షల అవసరం లేకుండానే వైరస్ రోగులను సులభంగా గుర్తించే పనిని తమ శునకాలు చేస్తున్నట్టు లండన్ పరిశోధకులు చెబుతున్నారు. దీనికోసం వాటికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ వివరాలను శాస్త్రీయ పత్రిక 'ప్రీ-ప్రింట్' సోమవారం ప్రచురించింది.
90 శాతం కేసులను..
కరోనా రోగులతో పాటు సాధారణ వ్యక్తులు వేసుకున్న బట్టలు, సాక్సుల వాసనను కుక్కలకు చూపించామని లండన్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసన్ పరిశోధకులు తెలిపారు. అప్పటికే ఈ విషయంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఆ శునకాలు.. 90 శాతం కరోనా కేసులను గుర్తించాయని చెప్పారు. ఇందులో కొందరికి లక్షణాలు లేవనీ, అయినప్పటికీ రోగులను కుక్కలు సులభంగా గుర్తించాయన్నారు. మనిషి చెమట వాసనలో గల తేడాలను గుర్తించే స్వభావం కుక్కల్లో ఉండటం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఈ శునకాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయొచ్చని వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మాల్స్ తదితర రద్దీ ప్రదేశాల్లో ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు. కాగా, ఇప్పటికే క్యాన్సర్ నిర్ధారణ కోసం పలు దేశాల్లో శునకాలను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ట్యూమర్స్, క్యాన్సర్ పసిగట్టేందుకు శునకాలు వాడేవారు. ఆ తర్వాత డయాబెటిస్, పార్కిన్ సిన్, మూర్ఛ, ఆందోళన, నార్కోలెప్సీ, మలేరియా, ఎపిలెప్సి, మైగ్రేన్ వ్యాధుల నిర్ధారణకు కూడా వాడుతున్నారు. కాగా, కరోనా రోగుల చెమట వాసనను కుక్కలు గుర్తుపట్టగలవని ఇదివరకే తేలడం విదితమే.
గ్రాహక శక్తి అదుర్స్
కుక్కలు మాత్రమే వాసనను పసిగడతాయి అనుకుంటే పొరపాటే. పాములు, సొరచేపలు, ఎలుగుబంటి, ఏనుగులకు కూడా ప్రత్యేక గ్రహకాలు ఉన్నాయి. దీంతో ఈ జంతువులు కూడా వాసన పసిగట్టడంలో ముందున్నాయి.
నాలుకతోనే..
వాసన పసిగట్టడంలో పాములది విభిన్న శైలి. మిగతా జీవుల్లా పాములు ముక్కుతో వాసనను గుర్తించవు. వాటి నాలుక సాయంతో అవి ఈ పని చేస్తాయి. పాములు ఎక్కువగా నాలుకను లోపలకు, బయటకు ఆడించేది కూడా ఈ కారణంచేతనే. ఇవి నాలుకకున్న సెన్సర్ల (గ్రాహకాలు) సాయంతో గాలిలోని రుచిని తెలుసుకుంటాయి. దీనికోసం వాటి నోటిలో ప్రత్యేక నిర్మాణాలుంటాయి. వాటితో అవి కేవలం ఆహారాన్నే కాదు.. ఎదురుకాబోయే ప్రమాదాలను కూడా పసిగడతాయి.
చుక్క నెత్తురు పడినా..
సొర చేపలు (షార్క్‌లు) నీటిలోనే ఉంటూ వాసన పసిగట్టగలవు. మరే జలచరానికి ఇలాంటి ప్రత్యేక శక్తి లేదు. సముద్రం నీటిలో చిన్న రక్తపు చుక్క వేసినా.. షార్క్‌లు కిలోమీటర్ల దూరం నుంచే వాసన పసిగట్టగలవు. ఈ కారణంతోనే ఎంతో మంది చనిపోయారు కూడా. అందుకే సముద్ర డైవర్లు నీటిలో ఉన్నపుడు గాయాలు కాకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు.
కిలోమీటర్ల దూరంలో ఉన్నా..
ఎలుగుబంట్లకు వాసన పసిగట్టగలిగే శక్తి మిగతా జీవుల కంటే చాలా ఎక్కువ. ఇవి మనుషులకంటే 2,100 రెట్లు ఎక్కువగా వాసనను గుర్తించగలవు. దాదాపు 30 కిలోమీటర్ల దూరం నుంచే అవి ఆహారాన్ని, ఇతర జీవులు, మిగతా ఎలుగుబంట్ల (తప్పిపోయిన తమ పిల్లలతో సహా) వాసననూ గుర్తిస్తాయి. ధ్రువపు ఎలుగుబంట్లైతే ఏకంగా 100 మైళ్ల దూరం నుంచే వాసనను గుర్తిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ధ్రువాల్లో గాలి చాలా స్వచ్ఛంగా ఉండటమే దీనికి కారణం.
ఆహారం ఎక్కడున్నా..
ఏనుగులు వాసన పట్టడంలో ముందుంటాయి. వాటి తొండాల్లో ఎక్కువ సంఖ్యలో ఉండే గ్రాహకాల సాయంతో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి జాడనూ ఏనుగులు సులభంగా కనుక్కోగలవు. ఒక మైలు దూరం నుంచే గడ్డి వాసనను, పండ్లు, ఇతర ఆహారాన్ని కూడా పసిగట్టగలవు.
- స్రవంతి