Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎన్హెచ్ఆర్సీలో ఓటింగ్..
- పాలస్తీనాలో ఇజ్రాయెల్ యుద్ధనేరాలపై అనుకూలంగా 24 దేశాలు
- వ్యతిరేకంగా 9
- 13 దేశాలు గైర్హాజరు
జెనీవా : ఇటీవల ఇజ్రాయెల్‌కు, గాజాలోని హమాస్ మిలటరీకి మద్య జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడినట్టు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం భావిస్తోంది. వీటిని బయటకు తేవాలంటే నిష్పక్షపాత విచారణ జరపాలని ఐరాస మానవ హక్కుల విభాగం చీఫ్ మిషెల్ బాచ్లెట్ చెప్పారు. దీనికి సంబంధించి పాకిస్తాన్, పాలస్తీనా సంయుక్తంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఐరాస ఓటింగ్ చేపట్టగా..ఈ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. గాజా, వెస్ట్‌బ్యాంక్, పాలస్తీనాల్లో ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని, యుద్ధ నేరాలపై నిష్పక్షపాత విచారణ జరగాలని తీర్మానం పేర్కొంది. ఇందుకోసం అంతర్జాతీయ విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని ఐరాస మానవ హక్కుల కమిషన్‌ను తీర్మానం కోరింది. తీర్మానానికి అనుకూలంగా 24 దేశాలు, వ్యతిరేకంగా 9 దేశాలు ఓటేశాయి. భారత్, ఫ్రాన్స్, జపాన్, నేపాల్, బ్రెజిల్, ద.కొరియా..మొత్తం 13దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. బ్రిటన్, జర్మనీ, బల్గేరియా, చెక్ రిపబ్లిక్..దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. ఐరాసలోని మానవ హక్కుల విభాగం ఓ ప్రత్యేక సెషన్ ద్వారా గాజాలోని పరిస్థితులపై చర్చించింది. పాలస్తీనాపై విచక్షణా రహితంగా దాడులకు తెగబడుతున్న ఇజ్రాయిల్, యుద్ధ నేరాలకు పాల్పడుతోందని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా గాజా సంక్షోభానికి దారితీసిన పరిణామాలపై ఐరాస పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఆయా దేశాలు తీర్మానాల్ని ప్రవేశపెట్టాయి. ఈనేపథ్యంలో యుద్ధనేరాల ప్రస్తావన వచ్చింది. మిలటరీ పోస్టులను లక్ష్యంగా చేసుకొని ప్రజా ఆవాసాలపై ఏ దేశమైనా దాడికి దిగితే..దానిని యుద్ధనేరంగా పరిగణిస్తారు.