Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుల్సా ఊచకోత మాయని మచ్చ
- బైడెన్ వ్యాఖ్యలు
వాషింగ్టన్ : శ్వేతజాతి దుర్హంకార ఉగ్రవాదమే అమెరికాకు పెనుముప్పుగా తయారైందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. 1921లో తుల్సా ఊచకోత జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తుల్సాలోని గ్రీన్వుడ్ కల్చరల్ సెంటర్‌ను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ, శ్వేత జాతి ఆధిపత్యవాదాన్ని ఎదుర్కొనేందుకు వినూత్న చర్యలు చేపడతామని, మైనార్టీలు సొంతంగా నడిపే వ్యాపారాలకు ఫెడరల్ సాయాన్ని పెంచుతామని ప్రకటించారు. దేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయంగా తుల్సా ఘటన నిలుస్తుందని అన్నారు. నల్లజాతీయులను ఊచకోత కోసిన ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా మిగిలి వున్న ముగ్గురిని బైడెన్ కలుసుకున్నారు. ఓక్లహామాలోని ఈ ప్రాంతాన్ని సందర్శించిన మొదటి అధ్యక్షుడిని తానేనని బైడెన్ చెప్పారు. ఈ చీకటి సంఘటన చుట్టూ అలుముకున్న మౌనాన్ని తుడిచిపెట్టేందుకు తాను ప్రయత్నిస్తున్నానన్నారు. నల్ల జాతీయుడైన డిక్ రౌలాండ్పై శ్వేత జాతి మహిళ చేసిన అత్యాచారం ఆరోపణతో మొత్తంగా ఈ విధ్వంసకాండ ప్రారంభమైంది. ఆనాటి ఘటనలో మరణించిన వారి సంఖ్య సరిగా తెలియనప్పటికీ 300కి పైనే వుండవచ్చని అంచనా. ''ఇవి అల్లర్లు కాదు, ఊచకోత'' అని బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ సంఘటనను ఇరు పక్షాల మధ్య అల్లర్లుగా ఇప్పటివరకు వున్న అభిప్రాయాన్ని తోసిపుచ్చుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. నల్ల జాతీయులు సంపదను సృష్టించేందుకు చేసే యత్నాలకు తాము సాయం చేస్తామని ప్రకటించారు. నల్ల జాతివారి వ్యాపారాలకు ఫెడరల్ కాంట్రాక్టులను 50శాతానికి పెంచారు. ఆనాడు ధ్వంసమైన గ్రీన్వుడ్ ప్రాంతంలో రోడ్లు, పాఠశాలలు పునర్నిర్మించేందుకు 1000కోట్ల డాలర్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు బైడెన్ ప్రకటించారు. వివిధ రాష్ట్రాల్లో నూతన ఓటింగ్ చట్టాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఇన్చార్జిగా నియమిస్తున్ననట్లు చెప్పారు.