Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలెం : ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ముఖ్యంగా యువకుల్లో మయోకార్డిటిస్ (గుండెల్లో మంట) సమస్యలను ఎదుర్కొంటున్నారని ఇజ్రాయిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో డిసెంబర్ 2020 నుండి మే 2021 మధ్య కాలంలో 50 లక్షలమందికి పైగా ఈ వ్యాక్సిన్ తీసుకోగా, 275 గుండెల్లో మంట కేసులు నమోదయ్యాయని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కేసులపై నిపుణులతో కూడిన మూడు బృందాలు అధ్యయనం చేపట్టినట్లు తెలిపింది. ఈ కేసుల్లో చాలా తక్కువ మంది నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందగా, 95 శాతం కేసులు తేలికపాటివేనని పేర్కొంది. ముఖ్యంగా ఫైజర్ రెండో డోసు తీసుకున్న వారిలో 16 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన పురుషుల్లో ఈ సమస్య ఎదురైనట్లు ఆ బృందం తెలిపింది. 16 నుండి 19 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన యువకుల్లో ఈ సమస్య అధికంగా ఏర్పడిందని పరిశోధన తెలిపింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో మయోకార్డిటిస్ కనిపించినట్లు తెలిసిందని, అయితే వ్యాక్సిన్‌కు, దీనికి మధ్య సంబంధం ఉన్నట్లు స్పష్టంగా తెలియడం లేదని ఫైజర్ తెలిపింది. దీనిపై సమీక్ష జరుపుతామని, ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని వ్యాక్సిన్ సేఫ్టీ డిపార్ట్మెంట్తో నిరంతరం సమావేశమవుతున్నామని తెలిపింది. ఊహించిన దానికంటే ఎక్కువ కేసులు లేవని, అయితే ఈ ప్రతికూల అంశాలపై అవగాహన కల్పించాల్సి వుందని భావిస్తున్నట్లు కొందరు సిడిసి పర్యవేక్షణ సంస్థ పేర్కొంది. కాగా, ఫైÛజర్, మోడెర్నా అభివద్ధిపరచిన వ్యాక్సిన్లతో పాటు ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్లకు, మయోకార్డిటిస్‌కు మధ్య సంబంధంపై అధ్యయనం చేయాలని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గత నెలలో ఆదేశించిన సంగతి తెలిసిందే. 12 నుండి 15 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ వేయాలా వద్దా అనే అంశంపై విస్తృత చర్చ జరగుతున్న సమయంలో ఇజ్రాయిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.