Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ ప్రకటించిన ప్రతిపక్ష నేత లాపిడ్
శ్రీ మరో పది రోజుల్లో ప్రమాణ స్వీకారం
శ్రీ కొత్త అధ్యక్షుడిగా హెగోర్జ్ ఎన్నిక
జెరూసలెం : ఇజ్రాయిల్లో పచ్చి మితవాద, అవినీతికర నెతన్యాహు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రతిపక్షాలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిపక్ష నేత యాయిర్ లాపిడ్ నేతృత్వంలోని మధ్యేవాద యేష్ అటిడ్, నఫ్తాలి బెనెత్ సారథ్యం లోని యామినా తో సహా ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు కలసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయిం చాయి. ఈ మేరకు వీటి మధ్య చివరి నిమిషంలో ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి మొదటి రెండేళ్లు మితవాద పార్టీ నేత బెనెత్ సారథ్యం వహిస్తారు. మిగతా రెండేళ్లు మధ్యే వాద పార్టీ నేత లాపిడ్ ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇజ్రాయిల్ చరిత్రలోనే మొదటిసారిగా 21శాతం అరబ్ మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించే ఒక అరబ్ పార్టీ (యునైటెడ్ అరబ్ లిస్ట్ ) సంకీర్ణ ప్రభుత్వంలో చేరనున్నది. ఈ మేరకు సంకీర్ణ భాగస్వాముల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు ఇచ్చిన గడువు బధవారం అర్ధరాత్రితో ముగియనుండగా, దానికి 35నిముషలు ముందు ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమంటూ ప్రతిపక్ష నేత యాయిర్ లాపిడ్ దేశాధ్యక్షుడు రీవెన్ రివ్లిన్కు ఒక ఇ-మెయిల్ పంపారు. ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగించిన యత్నాల్లో విజయం సాధించామని చెప్పడానికి సంతోషిస్తున్నామని లాపిడ్ అందులో పేర్కొన్నారు. ఆ సమయంలో ఇజ్రాయిల్ సాకర్ కప్ ఫైనల్కు హాజరైన అధ్యక్షుడు ఫోన్లో లాపిడ్కు అభినందనలు తెలిపారు. గడువులోగా కొత్త ప్రభుత్వం ఏర్పడని పక్షంలో ఇజ్రాయిల్ మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు గత రెండేళ్ళలో నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. నాల్గవ సారి కూడా ఎవరికీ మెజార్టీ లభించలేదు.నిర్దిష్ట గడువులోగా నెతన్యాహు ప్రభుత్వ ఏర్పాటులో విఫలమయ్యారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు యత్నించాల్సిందిగా ప్రతిపక్ష నేత లాపిడ్కు అవకాశమిచ్చారు. ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ఈ సంకీర్ణ కూటమికి పార్లమెంట్లో మెజారిటీ చాలా స్వల్పంగా వుంది.