Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాను ఘాటుగా విమర్శించిన చైనా
బీజింగ్ : యురోపియన్ నేతలపై నిఘా పెట్టినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా ఇంటెలిజెన్స్ పద్ధతులను చైనా తీవ్రంగా విమర్శించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ గురువారం మాట్లాడుతూ, రహస్యాలు దొంగిలించడంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ అమెరికా అని వ్యాఖ్యానించారు. విస్తృతమైన సాంకేతికతలను ఉపయోగించి తన మిత్రపక్షాలపైనే నిఘాకు దిగడం సంతోషకరమని వ్యంగంగా వ్యాఖ్యానించారు. అమెరికా అమలు చేసే విస్తారమైన ప్రపంచ రహస్య నెట్వర్క్లో ఈ తాజా అధ్యాయం చాలా చిన్నదేనని అన్నారు. ఇందుకు అమెరికాను బాధ్యులను చేయాల్సిన అవసరం అంతర్జాతీయ సమాజానికి వుందని అన్నారు. సాంకేతికతపై అమెరికా గుత్తాధిపత్యాన్ని మరింత సంఘటితం చేసేందుకు ఈ 'క్లీన్ నెట్వర్క్' ఒక ఎత్తుగడ అని వాంగ్ పేర్కొన్నారు. ఒకపక్క మిత్రదేశాలతో సహా యావత్ ప్రపంచంపై నిఘా పెట్టడం, రహస్య ఆపరేషన్స్ చేపట్టడంతో పాటు మరోపక్క ఇతర దేశాలపై, వాణిజ్య సంస్థలపై నిర్హేతుకంగా అణచివేత చర్యలకు దిగడం వంటివి చేస్తోందని, పైగా ఇదంతా జాతీయ భద్రత పేరుతో సాగిస్తోందని వాంగ్ విమర్శించారు. అమెరికా కపట నాటకాన్ని ఇది తెలియచేస్తోందన్నారు. డెన్మార్క్ ఇంటెలిజెన్స్ వర్గాల సాయంతో మిత్రపక్షాలపై అమెరికా నిఘాకు దిగిందని వచ్చిన వార్తలపై వివరణ ఇవ్వాలంటూ సోమవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్ డిమాండ్ చేశారు. మిత్రపక్షాల్లో ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు.