Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో 'అసమాన' కార్మిక మార్కెట్
- 20.5 కోట్ల మంది నిరుద్యోగంలోకి.. 2023 వరకు ఉద్యోగ సమస్య తీరనట్లే..
- అదనంగా 10.8 కోట్ల మంది పేదరికంలోకి.. : ఐఎల్వో నివేదిక
జెనీవా: కరోనా మహమ్మారి ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించడంతో పాటు ''అసమానమైన'' ప్రపంచ కార్మిక మార్కెట్ సంక్షోభాన్ని తీసుకువచ్చిందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) పేర్కొంది. కోవిడ్-19 ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నదంటూ కరోనా నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను వివరిస్తూ.. 164 పేజీల 'వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ అవుట్ లుక్: ట్రెండ్స్ 2021' పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆందోళన కలిగించే అనేక విషయాలను వెల్లడించింది. ఐఎల్వో నివేదిక ప్రకారం.. కరోనా మహమ్మారి కారణంగా అన్ని దేశాలు ఉపాధి, జాతీయ ఆదాయంలో గణనీయమైన క్షీణతను నమోదుచేశాయి. ఇది ఇప్పటికే ఉన్న అసమానతలను మరింత తీవ్రతరం చేసింది.
కరోనా మహమ్మారి సృష్టించిన ఈ పరిస్థితుల కారణంగా కార్మికులు, వ్యవస్థలపై సుదీర్ఘకాలం పాటు ప్రభావం ఉంటుంది. 2022లో 20.5 కోట్ల మంది నిరుద్యోగులయ్యే అవకాశముందని ఐఎల్వో అధ్యయనం అంచనా వేసింది. ఇందులో అధికంగా అనధికారిక రంగానికి చెందిన వారు ఉంటారనీ, మహిళలు, యువకుల పరిస్థితులు దారుణంగా ఉండనున్నాయని పేర్కొంది. మహిళల ఉపాధి 2020లో పురుషుల (3.9శాతం) కంటే ఎక్కువగా (5 శాతం) పడిపోయింది. అదే ఏడాది యువతకు ఉపాధి అవకాశాలు 8.7 శాతం తగ్గిపోగా.. మధ్య ఆదాయ దేశాల్లో ఈ నష్టం అధికంగా ఉంది. 2019లోని నిరుద్యోగిత 18.7 కోట్లను అధిగమించనుంది. అలాగే, 2019 ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం అదనంగా 10.8 కోట్ల మంది కార్మికులను కరోనా మహమ్మారి 'పేదలు'గా మార్చింది. దీని కారణంగా పేదరిక నిర్మూలన దిశగా ఐదేండ్లు సాధించిన అభివృద్ధి నష్టపోయినట్టయిందని వెల్లడించింది. అయితే, నిర్ధిష్టమైన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తు పరిస్థితులపై (సామాజిక, ఉపాధి పరిస్థితులు) ఏండ్ల తరబడి కరోనా ప్రభావం ఉంటుందని ఐఎల్వో నివేదిక హెచ్చరించింది.
అలాగే, రాబోయే కాలంపై కరోనా ప్రభావం అధికంగా ఉంటుందనీ, కనీసం 2023 వరకు ఉద్యోగ కల్పన (వృద్ధి) తగినంతగా ఉండదని ఐఎల్వో నివేదిక పేర్కొంది. దీని కారణంగా నష్టాలు తప్పవని స్పష్టం చేసింది. కరోనా నుంచి కోలుకోవడం కేవలం ఆరోగ్యపరమైన అంశం మాత్రమే కాదనీ.. దానితో ఆర్థిక, సామాజిక అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపింది. వీటిని కరోనా తీవ్రంగా దెబ్బతీసిందని స్పష్టం చేసింది. కోవిడ్-19 ప్రభావంతో 2020లో ప్రపంచవ్యాప్తంగా 8.8 శాతం పనిగంటలు లేకుండా పోయాయి. ఇది 25.5 కోట్ల మంది కార్మికుల ఏడాది పనికాలంతో సమానమని తెలిపింది. ఈ 2021 ఏడాది ప్రథమార్థంలో లాటిన్ అమెరికా, కరేబియన్, ఐరోపా, మధ్య ఆసియాలు అత్యంత ప్రభావానికి గురయ్యాయి. ఆయా ప్రాంతాల్లో తొలి త్రైమాసికంలో 8 శాతం, రెండో త్రైమాసికంలో 6 శాతం పనిగంటలకు నష్టం వాటిల్లింది. ఈ ఏడాది చివరినాటికి నిరుద్యోగిత రికవరీ అవుతుందని పలు అంచనాలు చెబుతున్నా.. ఇది అన్నిచోట్ల ఒకేలా ఉండదు. దీనికి ప్రధాన కారణంగా వ్యాక్సిన్ అసమానతలే కారణమని స్పష్టమవుతోంది. అలాగే, 2020 రెండో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 45 దేశాలలో 4,520 వ్యాపారాలపై జరిపిన సర్వేలో 80 శాతం సూక్ష్మ సంస్థలు, 70 శాతం చిన్న సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి అని నివేదిక తెలిపింది.