Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్న నేపథ్యంలో తిరిగి పుంజుకునేందుకు బహుళ జాతి సంస్థల(ఎంఎన్సీ)పై కనీసం 15 శాతం కార్పొరేట్ పన్ను ఉండాలన్న అమెరికా ప్రతిపాదనను జీ-7 దేశాల ఆర్థిక మంత్రులు ఆమోదించారు. రెండు రోజుల సమావేశంలో భాగంగా బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా దేశాలకు చెందిన ఆర్థిక మంత్రులు శుక్ర, శనివారాల్లో సమావేశమయ్యారు. గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ కనీసంగా 15 శాతం ఉండాలన్న ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని ఈ భేటీ అనంతరం జి-7 తుది ప్రకటనలో పేర్కొంది. కోవిడ్-19తో వైద్య, ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న పేద, ప్రభావిత దేశాలకు మద్దతును కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలిపింది. ఈ భేటీకి బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి రిషి సునాక్ అధ్యక్షత వహించారు. ప్రపంచ పన్ను వ్యవస్థను సంస్కరించేందుకు కుదుర్చుకున్న చారిత్రక ఒప్పందం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ డిజిటల్ యుగానికి అనుగుణంగా వ్యవస్థను మార్చేందుకు జీ7 సానుకూలత వ్యక్తం చేసిందన్నారు. ఈనెల 11న ఇంగ్లాండ్‌లోని కార్న్‌వాల్‌లో జీ7 నేతల శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకున్నది.
కనీస కార్పొరేట్ పన్ను ప్రతిపాదనకు జీ-7 ఆమోదంపై అమరికా ట్రెజరీ కార్యదర్శి జనేట్ యల్లేన్ స్పందిస్తూ.. ఇది అపూర్వమైనదని, కార్పొరేట్ ట్యాక్సేషన్‌లో ఉన్న పోటీకి ముగింపు పలుకుతుందని అన్నారు. అతిపెద్ద, అధిక లాభాలు పొందుతున్న బహుళజాతి సంస్థలు వాటి ప్రధాన కార్యాలయాలు ఉన్నచోటనే కాకుండా.. కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశాల్లో కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుందని బ్రిటన్ ట్రెజరీ పేర్కొంది. కాగా, జీ-7 నిర్ణయాన్ని ఫేస్బుక్ గ్లోబల్ ఎఫైర్స్ ఉపాధ్యక్షుడు నిక్ క్లెగ్ స్వాగతించారు. అంతర్జాతీయ పన్ను సంస్కరణల ప్రక్రియ విజయవంతం కావాలని ఆశిస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు.