Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుతిన్‌తో భేటీ నేపథ్యంలో బైడెన్ హామీ
వాషింగ్టన్ : రష్యాకి వ్యతిరేకంగా యురోపియన్ మిత్రపక్షాలకు అమెరికా బాసటగా నిలబడుతుందని అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ముఖాముఖి సమావేశానికి ముందుగా ఈ హామీ వెలువడింది. బుధవారం బైడెన్ యూరప్‌కు బయలుదేరుతున్నారు. జి-7, నాటో శిఖారగ్ర సదస్సులకు హాజరవడంతో పాటు, 16వతేదీన పుతిన్‌తో భేటీ కానున్నారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు, మానవ హక్కుల సమస్యలు, హ్యాకింగ్ ఆరోపణలతో గతంలో ఎన్నడూలేని రీతిలో ఇరు దేశాల మధ్య తీవ్ర సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది.ప్రజాతంత్ర పొత్తులను అమెరికా పెంచుతుందని బైడెన్ ఇచ్చిన హామీని శనివారం నాటి సంపాదకీయంలో వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. యురోపియన్ భద్రతకు ఎదురవుతున్న రష్యా సవాళ్ళను పరిష్కరించేందుకు తామందరం ఐక్యంగా నిలబడతామని బైడెన్ పేర్కొన్నారు. తమ ప్రయోజనాల నుండి వేరు చేసి చూడలేనివి ప్రజాస్వామ్య విలువలని, వాటిని పరిరక్షించుకుంటామని అందులో ఎలాంటి సందేహం లేదని బైడెన్ అన్నారు.