Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా-రష్యా కట్టడిపైనే చర్చ
- ఆహ్వానితుల హోదాలో ఆన్లైన్ ద్వారా పాల్గొననున్న మోడీ
లండన్ : వాయువ్య ఇంగ్లండ్‌లోని కార్నివాల్లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జి-7 దేశాల అగ్ర నేతలు సమావేశం కానున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకోవడం, వాణిజ్యం, వాతావరణ మార్పులు వంటివి అజెండాలో ఉన్నప్పటికీ, చైనా, రష్యాలను ఆర్థికంగా ఎలా దెబ్బతీయాలన్నదానిపైనే జి-7 దేశాల నేతలు ప్రధానంగా కేంద్రీకరించనున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బ్రిటన్, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల అధినేతలు పాల్గొంటారు. అలాగే యూరోపియన్ యూనియన్ కమిషన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు కూడా పాల్గొంటారు. ప్రపంచంలో సంపన్న దేశాలుగా పేరొందిన ఈ జి-7 కూటమి అసమానతలు, అన్యాయంతో కూడిన ప్రస్తుత ప్రపంచ క్రమాన్ని ప్రపంచంపై ఇంకా రుద్దాలని చూస్తున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా తమ భౌగోళిక రాజకీయ వ్యూహంలో చేపట్టాల్సిన మార్పుల గురించి జి-7 నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఆహ్వానితులుగా భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా దేశాలను ఆహ్వానించారు. ఆహ్వానితులుగా హాజరయ్యే దేశాల నేతలకు ప్రధాన చర్చల బల్ల ముందు కూర్చొనే అవకాశం ఉండదు. వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యం, డిజిటల్ పరివర్తన వంటి అంశాలపై ఉపన్యాసాలు చేసేందుకు మాత్రం అవకాశం ఇస్తారు. ధనిక దేశాలు చేసే నిర్ణయాలకు విస్తృత సమ్మతి ఉన్నట్లు చెప్పుకునేందుకు వీరు ఉపయోగపడతారు. అయినా దీనిలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. భౌతికంగా హాజరుకావాలని మొదట భావించినా, దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితి రీత్యా ప్రధాని మోడీ బ్రిటన్ ప్రయాణం రద్దయినట్లు గత నెలలో విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఈ సమావేశంలో మోడీ పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది.