Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా 16కోట్లకు పెరిగిన బాల కార్మికులు
- సమస్యను మరింత పెంచిన కరోనా సంక్షోభం
- అడ్డుకోవాలంటే సామాజిక, సంక్షేమ పథకాల్ని పక్కాగా అమలుజేయాలి : యునిసెఫ్, ఐఎల్ఓ తాజా నివేదికలో వెల్లడి
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా బాలకార్మికుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోందని యునిసెఫ్, అంతర్జాతీయ కార్మిక సమాఖ్య (ఐఎల్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. గత నాలుగేండ్లలో 84లక్షల మంది బాలలు..చదువుకు దూరమై, కార్మికులుగా మారారనీ, బాల కార్మికుల సంఖ్య 16కోట్లకు పెరిగిందనీ యునిసెఫ్, ఐఎల్ఓ తాజా నివేదిక (చైల్డ్ లేబర్ : గ్లోబల్ ఎస్టిమేట్స్ 2020) తెలిపింది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం క్రమంగా బలహీనపడుతోందని నివేదిక హెచ్చరిం చింది. గత 20ఏండ్లలో ఇలాంటి ట్రెండ్ ఇంతకు ముందు ఎన్నడూ నమోదు కాలేదని తెలిపారు. జూన్ 12 బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. దీంట్లో పేర్కొన్న మరికొన్ని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. 2000-2016 మధ్య బాల కార్మికుల సంఖ్య 9.4కోట్లకు తగ్గగా, ఆ తర్వాత సంవత్సరాల్లో అనూహ్యంగా పెరగటం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థలో 5-11 ఏండ్ల బాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. 5-17 ఏండ్ల మధ్య బాలలు అత్యంత ప్రమాదకర పరిశ్ర మల్లో , పని ప్రదేశాల్లో పనిచేస్తున్నట్టు అధ్యయనంలో తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న బాల కార్మికుల సంఖ్య 2016 తర్వాత 65లక్షల నుంచి 79లక్షలకు పెరిగింది. సబ్ సహారా ఆఫ్రికా(సహారా ఎడారికి దిగువన ఉన్న దేశాలన్నీ) ప్రాంతంలో జనాభాతో పాటు పేదరికమూ పెరిగింది. తీవ్రమైన పేదరికం, సామాజిక భద్రతా పథకాలు లేకపోవటం కారణంగా గత నాలుగేండ్లలో ఈ ప్రాంతంలో 1.66కోట్లమంది బాల కార్మికులుగా మారారు.
బాలలు బడికి పోవాల్సిందే..
ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గువే రైడర్ మాట్లాడుతూ..'' ఆర్థికంగా ఎన్ని సమస్యలున్నా..బాలలు బడికి పోవాల్సిందే. పనిలోకి కాదు. ఇందుకోసంగాను పేదలు, అణగారిన వర్గాల కుటుంబాలకు ప్రభుత్వాలు సామాజిక రక్షణ పథకాల్ని వర్తింపజేయాలి. గ్రామీణాభివృద్ధి సాధ్యం కావాలంటే వ్యవసాయం బాగుండాలి. ఈ రంగాల్లో ప్రభుత్వ వ్యయం పెరగాలి. బాల కార్మిక వ్యవస్థకు ప్రధాన కారణం పేదరికం. దీనిని అడ్డుకోవటమొక్కటే సమస్యకు పరిష్కార''మని ఆయన అన్నారు.
90లక్షల మంది
కోవిడ్-19 సంక్షోభం కారణంగా ఆసియా, పసిఫిక్, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల్లో బాల కార్మికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 90లక్షల మంది బాల కార్మికులుగా మారడానికి కరోనా సంక్షోభం కారణమైంది. సామాజిక రక్షణ, సంక్షేమ పథకాలు గనుక వర్తింపజేయకపోతే, ఆ సంఖ్య 4.6కోట్లకు పెరుగుతుంది. సుదీర్ఘకాలంగా పాఠశాలలు మూతపడటం, ఆర్థిక సమస్యలవల్ల.. బాలలు పెద్ద సంఖ్యలో పనికి వెళ్లాల్సి వస్తోంది. అంతేకాదు ఇంతకుముందు కంటే ఎక్కువ పని గంటలు వారితో పనిచేయించుకుంటున్నారు.
భయం కలుగుతోంది.
- హెన్రీట్టా ఫోరె, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యునిసెఫ్
ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే...బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం దెబ్బతింటుందేమో అన్న భయం కలుగుతోంది. ముఖ్యంగా గత ఏడాది, ఈ ఏడాది అంతటా స్కూ ల్స్ మూసేశారు. ఆర్థిక సమస్యలు చుట్టిముట్టాయి. ఆయా దేశాల బడ్జెట్ వ్యయం తగ్గిపోయింది. ఈనేపథ్యంలో ప్రభుత్వాలన్నీ బాల కార్మిక వ్యవస్థను అడ్డుకునే చర్యలపై దృష్టిసారించాలి. అభివృద్ధి బ్యాంకులు సైతం ఇందుకు అనుగుణంగాపని చేయా లని మేం కోరుతున్నాం. బాలలుబడిలోకి పంపేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలుండాలని భావిస్తున్నాం. ఇందుకోసం సామాజిక, సంక్షేమ రంగాల్లో వ్యయం చేయాలని సూచిస్తున్నాం.
బాలలు బడిలోకి కాకుండా, పనిలోకి వెళితే..వారి మానసిక, శారీరక ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. బాలల హక్కులు, వారి భవిష్యత్తును బాల కార్మిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో బాల కార్మికులు 5శాతం ముంటే, గ్రామాల్లో 14శాతం నమోదైంది.
ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మేం జరిపిన అధ్యయనంలో నమోదైన గణాంకాలు ప్రపంచానికి ఒక హెచ్చరిక. దీనిపై ప్రపంచ దేశాలు మేల్కోవాలని కోరుతున్నా. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలి. వారి హక్కులు, భవిష్యత్తు, అవకాశాల్ని పరిరక్షించాలి. ఇందుకోసం మనమంతా ఒక్కటవ్వాలి.
- గువే రైడర్, డైరెక్టర్ జనరల్,
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్