Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీ- 7 దేశాలకు చైనా హెచ్చరిక
ఇంగ్లండ్ : జీ7 దేశాల నేతలకు చైనా ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత రోజుల్లో చిన్న కూటములతో ప్రపంచాన్ని శాసించలేరనీ, ఆకాలం ఎప్పుడో చెల్లిపోయిందని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యవహారాల క్రమాన్ని జీ7 దేశాలే నిర్దేశించ గలవన్న భావనను తోసిపుచ్చిన చైనా, చిన్న కూటములు నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల నుంచి బయటపడి, ఆ స్థానాన్ని నిజమైన బహుపాక్షికత భర్తీ చేసిందని పేర్కొంది. నైరుతి లండన్ ప్రాంతంలోని కార్న్‌వాల్‌లో గత మూడు రోజుల నుంచి జీ7 దేశాల సదస్సు జరిగింది. నియమాల అధారిత అంతర్జాతీయ వ్యవస్థను తిరిగి అమల్లోకి తీసుకువచ్చేందుకు ఈ కూటమి సమావేశం అవకాశం కల్పిస్తుందని అమెరికా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశంపై లండన్‌లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. 'చిన్న-పెద్ద, బలమైన-బలహీనమైన, ధనిక-పేద.. ఇలా అన్ని దేశాలను తాము సమానంగానే భావిస్తాం' అని పేర్కొన్నారు. అందుకే ప్రపంచానికి సంబంధించి అన్ని నిర్ణయాలను ప్రపంచంలోని అన్ని దేశాలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రపంచ నిర్ణయాలను చిన్న కూటముల దేశాలు శాసించే ఆ రోజులు పోయాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చట్టాల ఆధారంగానే చట్టబద్ధమైన ప్రపంచ క్రమం ఆధారపడి ఉన్నదనీ, అంతేతప్ప కొన్ని హానికరమైన దేశాలు ఆదేశించే వ్యవస్థ క్రమంపై కాదని చైనా ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సమానత్వం, పరస్పర సహకారంతో కూడిన నిజమైన బహుపాక్షికత వ్యవస్థకు చైనా ఎల్లప్పుడు మద్దతుగా ఉంటుందని, నకిలీ బహుపాక్షితకను వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ నకిలీ బహుపాక్షికత కొన్ని దేశాలకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న చైనాను లక్ష్యంగా చేసుకునేందుకు జీ7 సంపన్న దేశాలు (అమెరికా, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా) ఈ సదస్సును వినియోగించుకుంటున్నాయి. అదేవిధంగా చైనాపై ఆర్థికపరంగా ఆధారపడడాన్ని ఎలా తగ్గించుకోవాలన్న దానిపై కూడా చర్చలు జరిపాయి.