ఒంటరితనం శాపమనుకుంటున్నావా ఆలింగనాలు, అనురాగం పంచేందుకు నీకోసం ఎవరు లేరనుకుంటున్నావా నీలోకి నువ్వు చూసుకునే మధురక్షణాలు ఇప్పుడు నీ ముందే ఉన్నాయి అన్ని ఆనందాలను ఒడిసి పట్టుకో నీ ఇంటిముందున్న సన్నజాజి పాదులో రోజు దోసెడు నీళ్ళు పోసి చూడు సాయంత్రానికి గుప్పెడు జాజుల గుబాళింపుతో రాత్రంతా నిన్ను స్పర్శిస్తూనే ఉంటుంది నువ్వు పెంచుకునే పిల్లి పిల్ల వేసే అల్లరి పిల్లిమొగ్గలు చూడు నీ మనసెంత ఆహ్లాదకరమౌతుందో నిన్నెప్పుడూ అది వీడిపోదు నీ అల్మారాలో ఇంతవరకు తెరిచిచూడని పుస్తకాన్ని పలకరించు నిన్ను కొత్త కొత్త లోకాల్లోకి తీసుకువెళుతుంది నీ చేతులతో ఎంతసేపు పట్టుకున్నా భయంతో పారిపోదు ఎంత రాత్రయినా నిద్రపోవాలని అక్షరాలు దుప్పటి ముసుగేసుకోవు నీలో నువ్వే నీతో నువ్వే ప్రేమలో పడిపో.. చిన్న చిన్న ఆనందాలతో గొప్ప గొప్ప మధురానుభూతులను నీ సొంతం చేసుకుంటే ఇక నీకు నీతో తప్ప బాహ్య ప్రపంచంతో ఏం పనని ఇన్ని ఆనందాలను వదిలి నా చుట్టూ సమూహం లేదని నేనో ఒంటరినని నీకు బెంగేలా నీ ఏకాంతమే నీ అక్షౌహిణి సైన్యం కనిపించని శత్రువుతో పోరాడడానికి నీ మనోధైర్యమే నీ వజ్రాయుధం - రోహిణి వంజరి, 9000594630