Sat 08 May 23:44:29.595534 2021
Authorization
చివరి అంకం మొదలు కాగానే
రంగస్థలం కుప్పకూలింది
నరుని నాటకానికి తెర పడింది
పాత్రలన్నీ చెల్లాచెదురై
వెంటిలేటర్ల పై గంటలు లెక్కిస్తున్నాయి
అందరూ ఒకరి దుఃఖాన్ని ఒకరు తుడుచుకుంటున్నారు
పాత్రధారులు కొందరు పారిపోయి
ఇటుక డబ్బాలలో దాక్కున్నారు
భీతిల్లిన ప్రేక్షకులు లాక్ డౌన్ ను
కిటికీ సందుల్లోంచి
గట్టిగా అమలు చేస్తున్నారు
ఇప్పుడిప్పుడే రెప్పలు తెరచి
ఒక్కసారి తన పురాకతిని చూసుకొని
పొంగి పోయింది ప్రకతి
ఆకాశ సరోవరంలో కొత్తస్నానం చేసిన గాలి
కొమ్మల చేతులతో ఆనందతాండవంచేసింది
కోకిలలు చిలుకలు మైనాలు
సూర్యచంద్రుల వెలుగుల్లో
అలసట లేని నాట్యం చేస్తున్నాయి
ఏనుగులు జింకలు కుందేళ్ళు
ఎన్నో రోజులకు నీటి అద్దంలో
తమ ముఖాలను చూసుకొని తెగసంబరపడ్డాయి
పులులు సింహాలు రోడ్లమీదనెమరేస్తున్నాయి
చెత్తాచెదారం కళేబరాలు లేని
నదులు వాగులు చెరువులు
తమ ముఖాలు చూసుకుని ఆశ్చర్యపడ్డాయి
ఓజోన్ రంధ్రం లో చిక్కుకున్న
పక్షుల్ని చూసి తల్లడిల్లింది తల్లి
విషపు మబ్బులకు కళ్ళు పోయిన
పావురాలను చూసి కుమిలిపోయింది
దుర్గంధాలైన ముక్కు రంధ్రాలను
పచ్చని పైటతో శుభ్రం చేసింది
వాహనాలు యంత్రాల హౌరుకు
పుండు పుండై న చెవులకు
నిశబ్దపు పసరు పూసింది
ఏమీలేని, ఏది అంటని, దేనికీ లొంగని
వజ్ర ఖడ్గం లాంటి ఒక కొత్త మనిషి
ముందు తరాల కోసం కొత్తకథనుఅల్లుతున్నాడు
స్వార్థం, ద్వేషం, కులం, మతం, ఆదిపత్యంలేని
వేషధారుల కోసం పోటీలు ప్రకటించాడు.
(తొలి కిరణాలు సంకలనంలో ప్రచురితం, ఏప్రిల్ 2021)
- డా. ఉదారి నారాయణ, 9441413666