Sat 29 May 21:49:11.935697 2021
Authorization
సింహపురి రాజు సభ కొలువు తీరి ఉంది. మహామంత్రి రాచకార్యం మీద పొరుగు దేశం వెళ్ళాడు. గురుకులంలో చదువుకునే మహారాజు కుమారుడు, మహామంత్రి కుమారుడు వేసవి సెలవులకని గురుకులం నుండి వచ్చారు. వారిరువురు సభలో కూర్చున్నారు.
అప్పుడే ఒక జంట పోట్లాడుకుంటూ సభలోకి ప్రవేశించారు.
''ఏంటీ మీ గొడవ?'' అన్నాడు మహారాజు.
''చూడండి మహారాజా! భార్యభర్తలలో భార్యే గొప్పదని నేనంటే... కాదు భర్తే గొప్పని ఈయన అంటున్నాడు'' అంది భార్య.
''కాదు మహారాజా! ముమ్మాటికి భర్తే గొప్పవాడు అని నేనంటే... కాదు నేను గొప్ప అని వాదనకు దిగుతోంది.. మీరే తీర్పు చెప్పాలి?'' అన్నాడు భర్త.
సమయానికి మంత్రి గారు కూడా లేరు అని ఆలోచించి మంత్రి కుమారుణ్ణి పిలిచి ఈ సమస్యను నువ్వే పరిష్కరించాలి అని చెప్పాడు.
''చూడండి ఈ నాణానికి బొమ్మాబొరుసు ఉన్నాయి చూశారా? ఈ రెండు ఉంటేనే నాణానికి విలువ అలాగే భార్యభర్త ఇద్దరూ సమానులే... ఒకరు గొప్ప ఒకరు తక్కువని ఉండదు'' అన్నాడు మంత్రి కుమారుడు.
''నువ్వు చెప్పిన దానికి మేము ఒప్పుకోము'' అన్నారు భార్యభర్త ఒక్కసారే.
''సరే నేను మీ ఇద్దరికీ ఒక పందెం పెడతాను... అందులో ఎవరు గెలిస్తే వారే గొప్పవారు సరేనా'' అన్నాడు మంత్రి కుమారుడు.
అందుకు సరే నన్నారు వాళ్ళు.
''మహారాజా! ఇప్పుడే వస్తాను'' అని మంత్రి కుమారుడు వెళ్ళి కాసేపటికి బాగా కాలుతున్న ఇనుప కడ్డీని తీసుకువచ్చాడు, అది పొగలు కక్కుతోంది.
''ఈ ఇనుప కడ్డీతో నేను మీ ఇద్దరి చేతుల మీద వాతలు పెడతాను... ఎవరు ఎక్కువ వాతలను ఓర్చుకుంటే, వారే నెగ్గినట్లు'' అని వారి చేతులను పట్టు కోబోయాడు.
''అయ్యా! బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడూ గొడవపడము... మా ఆయనే గొప్పవాడు'' అంది భార్య.
''కాదు మా ఆడదే గొప్పది'' అన్నాడు భర్త.
''సంసారమనే బండికి భార్య, భర్త రెండు చక్రాల లాంటి వారు అవి రెండూ సమానంగా కదిలితేనే గమ్యాన్ని సులభంగా చేరుకుంటాము. ఎత్తు, పల్లాలు కష్టాలకు, సుఖాలకు చిహ్నాలు!'' అన్నాడు మంత్రి కుమారుడు.
సభలోని వారంతా కరతాలధ్వనులు చేశారు.
''అయినా ప్రజా సమస్యలపైన రాజుగారు చర్చించే విలువైన సభకు అంతరాయం కలిగించిన మీకు, ఒక శిక్షను రాజు గారు అమలు చేయాలని సూచిస్తున్నాను. మీరు ఉండే గ్రామంలో మీ భార్యాభర్తలు వారం రోజుల పాటు వీధులను శుభ్రపరచాలి'' అన్నాడు మంత్రి కుమారుడు.
మహారాజు ఆ శిక్షను అమలు పరుస్తూ తీర్పునిచ్చాడు.
సమస్యను చక్కగా పరిష్కరించినందుకు మహారాజు మంత్రి కుమారుణ్ణి సత్కరించాడు. రాజకుమారుడు కూడా ఎంతో సంతోషించాడు.
- యు.విజయశేఖర రెడ్డి, 9959736475