మీ కలం ధ్యాన ముద్రలో అలా ఎదురుచూస్తూ ఉంటుంది. అక్షరాలు మీ చుట్టూ అలా ప్రదక్షణం చేస్తూంటాయి మీ కవితలో వొదిగిపోయిన భావుకతగా మిగిలిపోవాలని ఆకాంక్ష.
మీ కలం, కవిత్వం తీరని దాహంతో... నిరీక్షిస్తూంది మీ చేతి స్పర్శ లయాత్మకంగా తగలగానే అక్షరకెరటమై ఎగసిపడిన సంరంభంతో వాక్యాలు వాక్యాలుగా భావ పరిమళాలను చిత్రిస్తుంది.
మీరు గజల్లో వెలిగించిన ఆత్మదీపాలు కర్పూర వసంతరాయలు వలే పరిమళాలు మీ పాటలో గుభాళించిన గులేబకావళి మీ మాటలో తెలుగుదనం నిండిన తలకట్టు మాత్ర చందస్సు మార్మిక దశ్యాలు మీ భావ సంపద తెలుగు వారికి సూక్తి ముక్తావళి
మీ ప్రేరణతో కలం అడుగులు వేసే కొత్త తరానికి... మీ అభినందన పత్రం అందక దిగాలుగా వెనక బెంచిలో విద్యార్ధులుగా మిగిలిపోతారనే జంకు ఏది ఏమైనా మీరు మా అక్షరమాల, ప్రతి అక్షరంలో మీ నిత్యదర్శనం.
ఈ సాయంత్రాలు మీరు లేని సాహితీ సమావేశాలు ఉక్కపోతగా పల్లవిస్తున్నాయి ఐనా - మీరు లేరని తెలిసినా మా మనసులు దిగులుపాటయి గొంతు పెగలనప్పుడు మీ కవితలు మమ్మల్ని బుజ్జగించి మాలో సినారే ఆత్మను చూడమంటాయి.
మీకు కవిత్వం వ్రాయని రోజు మీకు వెలితిగా ఉంటుంది. మేము మిమ్మల్ని స్మరించని రోజు గుండె బరువుగా ఉంటుంది. - బొల్లిముంత వెంకట రమణారావు