మనిషికి వరుస ఉప్పెనలతో ఇప్పుడు ఊపిరాడడం లేదు బ్రతుకు తెరువుకు దారులు అస్సలు కనపడడం లేదు ఈ మనిషి మనసుకు ఏమైందో దుఃఖపు గీతాలు ఆలపిస్తూ కాలం కంటిపై కునుకును మరచింది
ఏ తప్పిదాలు మనిషి తలకు చుట్టుకొన్నాయో ఏ నరుడి నడక వక్రపు దారి పట్టాయో బ్రతుకు పట్టాలు తప్పి దుర్భరపు దరిని చేరాయి
మునుపటిలా కలల్ని కంటిపై మోస్తూ స్వేచ్ఛా జీవిలా ఎగిరడానికి ఎన్ని యాతనల్ని చవి,చూడాలో మోయలేని ఈ దుఃఖపు తడులు ఆరడానికి ఇంకా ఎన్ని గుండెలు అలసి ఆరిపోవాలో ఊపిరాడక సొమ్మసిల్లిన నా దేశాన్ని ఎన్ని ఊపిర్లు ఊది గాడిన పెట్టాలో ?
ప్రతి ఉపద్రవానికి ఒక్క విరుగుడన్నది ఉంటుంది భయపెడుతున్న గాలి బంధమై గుండె దిగుల్ని తీర్చుతుంది మనిషికి,మనిషికీ మధ్య దూరాలు సమసి స్నేహ సమీరాలు అల్లుకొని భూమిపై మనిషి ఎప్పటిలా ఆశాజీవిగా నిలిచి సరిక్రొత్తగా చిగురించాలి...!! - మహబూబ్ బాషా చిల్లెం 9502000415