Sat 18 Dec 23:22:20.169894 2021
Authorization
హఠాత్తుగా అక్కున పెంచుకున్న చెట్టంత కొడుకు
అమ్మ పెట్టిన ముద్ద తప్ప
ఇంకేమీ రుచించని కొడుకు...
అమ్మ పోపు డబ్బాల్లో దాచుకున్న సొమ్ము నుంచి మొదలు పెట్టి
తాళి బొట్టులో కూడా వాటాల కోసం కాచుకునే కొడుకు
''అమ్మ మీద పాట'' ఎక్కడ విన్నా కళ్ళ నీళ్లు
కుక్కుకునే ఈ కొడుకు...
మరే అమ్మ కంటిలో నైనా
కనబడే కన్నీటికి గుండె ద్రవించే
ఈ కొడుకు...
ఎందుకు అమ్మని దూరం పెడుతున్నాడు?
నిన్నటిదాకా కొంగు వెనక నిలబడ్డ వీడేనా
వరండాలో గేటు చప్పుడు కోసం
రోజంతా నిరీక్షించే అమ్మని చూడకుండా ముంగిలా తలతిప్పుకు
వెళ్లిపోతున్నాడు?
నిన్నటిదాకా వంటింటి చుట్టూ కాలు గాలిన పిల్లిలా
నీడలా అమ్మని వెంటాడిన వీడేనా
వరండాలో కూచున్న అమ్మని దాటేసుకొని నేరుగా బెడ్రూం లో దూరిపోతున్నాడు?
చిన్న చిరునవ్వు కరువైంది...
చిన్న పలకరింపు దూరమై ఏళ్ళయింది...
అమ్మ చిన్న బుచ్చుకోవడం కూడా
మానేసి యుగాలైపోయింది....
నిరంతరం కొడుకు ఏం తిన్నాడో అనే ధ్యాస తప్ప మరేమీ ఆలోచించకుండా అరవైయేళ్ళు గడిపిన అమ్మకి
ఇవ్వాళ తన ఆకలి గుర్తుకొస్తుంది
హఠాత్తుగా!
''ఆకలి కాదురా నన్ను చంపేది
లేని ఒక చిన్న పలకరింపురా!''
అని మొన్నటి దాకా అడిగిన అమ్మ ఈ రోజు చేతులు జోడించి అడుగుతోంది ఇంకేదో...
గుండెలోంచి ఏనాడో పంపించేశావ్ గద నాన్నా!
హాలులో నుంచి వరండాలోకి
పంపించి ఏళ్ళై పోయింది!
గుబులు గుబులు గా ఉంటోంది నాన్నా!
రోజు రోజుకు దసిలి పోతున్న
ఈ దేహానికి ఏమివ్వక పోయినా పర్వాలేదు
ఏ మక్కర్లేదు...
చిరునవ్వు కూడా వద్దులే నాన్నా!
బాగున్నవా అని కూడా అడగొద్దులే!
అన్నం తిన్నవా అని అడక్క పోయినా పరవాలేదు!
నా వైపు కూడా చూడొద్దులే!
అంత పెద్ద కోరికలు ఏమీ కోరను గాక కోరను!!!
హాల్లోకో, బెడ్రూం లోకో,
ఆ ఖాళీగా వుండే గదుల్లోకో కూడా
నేను రాను కన్నా!!
ఎందుకో భీతిల్లుతోంది గుండె!
కొన్ని రోజులుగా ఏవో మాటలు
నన్ను చిత్రవధ చేస్తున్నాయి...
ఈ వాకిట్లో వందల మందికి
ఆకలి తీర్చిన చేతులు
నేడు నిస్సహాయతతో
నీ ముందు ప్రాధేయ పడుతున్నాయి...
కనీసం ఈ వాకిటి మాటున,
ఈ చీకటి వరండాలో
ఈ కొద్ది పాటి చోటును మాత్రం దూరం చెయ్యకు నాన్నా...
నిన్ను కని పెంచినందుకన్నా
కనీసం
ఈ వాకిట్లో చచ్చిపోయే
వరాన్ని ప్రసాదించు కొడుకా
ఇంకేమీ అడగను నిన్ను!!
- వి. విజయ్ కుమార్