మొన్న కొన్ని పడవలను చూసాను సముద్ర కెరటాల కత్తుల దాడిని ఎదుర్కుంటూ ఒడుపుగా తల్లక్రిందులవకుండా తప్పించుకుంటూ...
పొట్ట కూటికై నీటిగర్భాన్ని తెడ్లతో పొడిచి అదుపు చేస్తూ
తెరలు తెరలుగా తుళ్ళిపడుతున్న గాలి కండలపై స్వేదాన్ని పీల్చుకుని మరింత ఉప్పుబారుతోంది
సముద్రం ఏమిచ్చిందో వీళ్ళేం తీసుకున్నారో ఆకాశమే సాక్షి
పడవల్లోని మూటలు ఆకలి మారకానికి తరలి వెళ్ళాయి
ఒడ్డునున్న ముడతలు పడ్డ చర్మం వణుకుతూ గొణుక్కుంటోంది ''సముద్రాలను జయించానో ఓడానో తెలీదు కానీ ఎన్నో అనుభవాల చేపలను అందరికీ పంచి జీవితాన్ని ఒరుసుకుని ముక్కలైన ఒంటరి పడవై ఇలా మిగిలాను''