Sun 01 May 00:03:01.82324 2022
Authorization
ఇద్దరిదీ
ఒకే వీధి
శాస్త్రవేత్త ఇంటి నుండి
రెండడుగులు ముందుకు వేస్తే
కవి ఇల్లు
కవి ఇంటి నుండి
రెండడుగులు వెనక్కి నడిస్తే
శాస్త్రవేత్త ఇల్లు
నూకలు వేసి
పిట్టల్ని పిలుస్తూ
కవి ఎప్పుడూ గుమ్మంలోనే ఎదురవుతాడు
కొలతల తలుపులేసుకుని
లోపలి గదుల్లో
ఏ తర్కంసాలీడు గూటికో
వేలాడుతూ శాస్త్రవేత్త
ఎపుడన్నా
ఇద్దరూ ఒకే సారి ఎదురైతే
నా తొలి పలకరింపు పువ్వును
కవి వైపే విసురుతాను
ప్రవహించే గుండెనదిని
ఎప్పుడో ఒకప్పుడు
ఎవరో ఒకరు గుర్తించీ బొమ్మ గీస్తారు
ఖాళీ దేహంలో
గుండెను మొలకెత్తించి
పటం కట్టి చూపించేది మాత్రం
కవే కదా
అవసరాల వాలుతలం మీద
కాళ్ళకు చక్రాలు తగిలించుకుని
దొర్లిపోయే ప్రపంచాన్ని
ఆపి.. నిలబెట్టి
మనిషి వైపు మళ్ళించేది
కవి కాకుంటే ఇంకెవరు?
పనీ తీరుబడీ లేని
నది నడకలకు అడ్డం పడి
బీళ్ళ నోళ్లకు మిఠాయిలు పంచే
కాళ్ళు గొప్పవే కానీ
నదులకు అక్షరాభ్యాసం చేయించే
చేతులు
కవివే.. కాదంటారా?
పదార్థం లోంచి
శక్తిని తోడే సమీకరణం గడ్డపార
విధ్వంసాన్ని తవ్విపోస్తున్నప్పుడు
ఆ గుండెనూ ఈ గుండెనూ
కలిపి కుట్టి
శాంతికి గూడు కట్టిందీ అతడే
లోకం ఆమె నొక
కొత్త అద్దె ఇల్లును చేసినపుడు
ఒట్టిపోయిన గర్భసంచిని
తడిమి
ఓదార్చిన చూపుడు వేలెవరిది?
కవిదే కదా
శాస్త్రవేత్త తలగోక్కుంటూ..
చేతులు నులుపుకుంటూ
నిలబడిపోయిన చోటు నుండే
కవి ఒక
నడక దారిని నిర్మిస్తాడు
శాస్త్రం
పదే పదే కళ్ళద్దాలు తుడుచుకుంటున్న
చీకటి రాత్రులలో
అతడొక
చూపుల వంతెనై ఎదురొస్తాడు
ఎంతో నిష్ఠతో దీక్షతో
ఒక అంతర్గత సత్యాన్ని ఆవిష్కరించే
ప్రతి అక్షరమూ శాస్త్రమే కానీ
సవాలక్ష పరిమితుల మధ్య
సమీప ప్రపంచాన్నో
సుదూర విశ్వాలనో చూస్తూ లెక్కలుగట్టే
శోధనంతా
కవిత్వం అవుతుందా?
- సాంబమూర్తి లండ, 96427 32008