Sun 05 Jun 00:26:29.016594 2022
Authorization
పునాది పడ్డమంటే
దున్నీ చదును చేసిన పొలంలో
విత్తులు వేసినట్టే
గోడలు మొలుస్తుంటే
చినుకు కడుపులో
ఇంద్రధనుస్సు పడ్డట్టే
కాగితంలో గీసుకున్న గీతలు
నేల మీదకు వాలుతుంటే
ప్రసూతి గది బయట
పచార్లు చేసే భర్తనవుతాను
అంతా అనుకున్నట్టే జరుగుతోందా?
బిడ్డేమీ అడ్డం తిరగలేదు కదా
పైకప్పు కోసం
ఇంటిని సిద్ధం చేస్తుంటే
ఐదో నెలలో
అమ్మ లోపల
ప్రాణం కదలాడినంత సంబరం
వచ్చేదెంత
ఇఎంఐల్లో పోయేదెంత
బాబు చదువు పదిలమే కదా
పాప సందడి చేస్తే..
వర్షాకాలం కోసం దాచుకున్న
గింజలు సరిపోతాయా
అర్థరాత్రవుతున్నా
నిద్రపక్షి గూటికి చేరదు
రేపు ఈ నీడ కింద
పిట్టలు వాలతాయి
తూనీగలు ఎగురుతాయి
రంగు రంగుల గోడల్ని చూసి
పువ్వులనుకునిజి
సీతాకోకచిలుకలు అతుక్కుపోతాయి
గేటు తీసుకుని
ఇంట్లో కొస్తుంటే
నా చెమట పూల తోటలోకి
మీరు ప్రవేశిస్తున్నట్టే
ఏ తీగనూ సవరించకండి
ఏ పువ్వునూ
తణీకరించకండి
ఆ కొమ్మ అలా ఉందేమిటి
ఈ మొక్క ఇలా లేదేమిటనీ
అడిగడిగి దుంప తెంచకండి
నా రెక్కల కొద్దీ
నేన్నా ఆకాశాన్ని
ఇక్కడిలా నాటుకున్నాను
అతిథుల్లారా!
కొంచెం మెత్త మెత్తగా నడవండి
ఇంట్లో నేలంతా
నా గుండెను తాపడం చేసాను
కిటికీల్ని సున్నితంగా తెరవండి
నా కనురెప్పల్ని
కర్టెన్లుగా వేసుంచాను
కానుకల జంఝాటమేం వద్దు
కుదిరితే మట్టి గోలెంలో
ఓ పచ్చటి మొక్క నివ్వండి
లేకుంటే
చేతుల్లో ఒక
నవ్వుపూల బోకేతో రండి చాలు
- సాంబమూర్తి లండ, 96427 32008