ఏదో ఒకరోజు .. అడవిలో పోరు ముగిసిపోవచ్చు బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లుల గర్భశోకం ఎడతెగని ఊటగెడ్డలా పారుతూంటుంది నుదుట పొద్దులు రాలిపోయాక - బతుకుపొడుగునా రుతువులు కన్నీటిపూలు పూస్తుంటాయి ఓ నాలుగు పసికళ్లు .. యింటికి రాని తండ్రి కోసం మునివాకిట యింకా ఎదురుజూస్తూనే ఉంటాయి!
ఏదో ఒక రోజు .. అడవిలో పోరు ముగిసిపోవచ్చు అప్పటికే కొన్ని కలలు రాలిపోతాయి యింకొన్ని ఆశలు భళ్లున పగిలిపోతాయి వేనవేల నెత్తుటిపక్షులు నేల కూలిపోతాయి జీమూతంగా ముసురుకున్న గాలివానకు పచ్చనిగూళ్లు చెదిరిపోతాయి ఎండుటాకులాంటొక పాట రాలిపోయి ఎర్రని ధూళిలో కలగలసిపోతుంది !
ఏదో ఒక రోజు.. అడవిలో పోరు ముగిసిపోవచ్చు అప్పటికే అడవి అమ్మతనాన్ని కోల్పోయీ అంగడై పోతుంది గూడు కోల్పోయిన పక్షొకటి వలసరాగమెత్తుకొనీ దిక్కలకేసెగిరిపోతుంది !!