నిత్యం ఒకే సమయానికి ఒకే పనిని చేస్తూ పోతూ ఉంటే ఆ సమయానికి మన మెదడు కండీషనింగ్ అవుతుంది. ఉదయాన్నే కాఫీ తాగేవారికి ఆ సమయానికి మెదడు కాఫీ కావాలనే కండీషనింగ్ పంపిస్తుంది. నిత్యం రాత్రి 9 గంటలకు నిద్రపోయే అలవాటు ఉన్నవాళ్లకు అదే సమయానికి మెదడు ఇచ్చే కండీషనింగ్ వలన కళ్ళు మూతలు పడిపోతాయి. అలాగే వ్యసనాలు విషయంలో కూడా మెదడు ఆ సమయానికి ఆ వ్యసనం కావాలనే కండీషనింగ్ చేస్తుంది. సరదాతో మొదలైన ఒక అలవాటు వ్యసనానికి దారి తీసినపుడు ఆ వ్యసన ప్రభావం ఆ సమయానికి మెదడుకు అందకపోతే మెదడులో కలిగే అలజడి అంతా ఇంతా కాదు. అంటే వ్యసనం అనేది మెదడుకు కండీషనింగ్ అవ్వడం వలన దాని ఉచ్చులోంచి బయట పడటం అనేది కష్టమవుతుంది. అటువంటి వ్యసనాలలో సిగరెట్టు మద్యం వంటివి సాధారణమైనవి కాగా మాదక ద్రవ్యాలును మాత్రం అత్యంత ప్రమాదకరమైనవిగా చెప్పవచ్చు.
మనకు ఆసక్తి ఉన్న పని చేసినప్పుడు కానీ లేదా మనకు నచ్చిన వ్యక్తులు తారసిల్లినపుడు కానీ, నచ్చిన సంగీతాన్ని ఆస్వాదించినపుడు కానీ అనిర్వచనీయ ఆనందం మన స్వంతం అవుతుంది. మన మెదడులో విడుదలయ్యే రసాయనాలే ఈ స్ధితికి కారణం. వీటినే ఎండార్ఫిన్స్ అని అంటారు. మత్తుకు అలవాటు పడని వారికి ఇవి సహజమైన ఆహ్లాద పరిసరాలలో ఆహ్లదకర సంఘటనలలో ఇవి సహజంగా విడుదల అవుతాయి. అదే మత్తు కోసం మాదక ద్రవ్యాలుకు అలవాటు పడే వారికి మాత్రం వీటి విడుదల చాలా భిన్నంగా ఉంటుంది. వీరికి ఎండార్ఫిన్ విడుదల కావాలి అంటే ఖచ్చితంగా మత్తు కావాలి. అంటే ఈ స్ధితిలో మెదడు పూర్తిగా మత్తుచేత హైజాక్ చేయబడుతుంది. మత్తు కోసం మాదక ద్రవ్యాలకు బానిస అయిపోతారు. ఈ క్రమంలో వీళ్ళు గెలిచినా ఓడినా దానిని మత్తులోనే పంచుకోవాలి అనే భావం వీరిలో క్రమేపీ బలపడిపోతుంది.
బలహీనత
సహజంగా మనల్ని ఏ పనిని చేయొద్దు, దేనిని తాకవద్దు, దేనిని చూడొద్దు, దేనిని తినొద్దు అంటూ నియంత్రణ విధిస్తారో మన మనసు అదే పనిని చేయాలని తహతహ లాడుతుంది. నియంత్రణ మాత్రమే విధించి దాని ప్రభావాలు గురించి సంపూర్ణ సమాచారాన్ని, వాటి వినియోగం వలన కలిగే ఫలితాలను స్పష్టంగా తెలియ చేయని సందర్భంలో ఏదో విధంగా దానిలో ఉన్న మజాని ఒక్కసారి ఆస్వాదించాలనే వాంఛ మదికి బలంగా చేరుతుంది. ఇదే రీతిలో మాదక ద్రవ్యాలకు మనం నిషేధం అనే ముసుగు వేశాం. కానీ ఆ నిషేధం వెనుక అద్భుతమైన ఆనందం దాగి వుందని జీవితంలో ఒక్కసారైనా దానిని ఆస్వాదించాల్సిందేనని యువత భావిస్తారు.
సహచర మిత్రుల ప్రోత్సాహం చేత దీనిలో లభించే ఆనందాన్ని ఒకసారి చవి చూడాలనే సరదా క్రమేపీ బానిసగా లొంగిపోయే స్ధితికి తీసుకు వెడుతుందని మానసిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
చరిత్ర
మత్తు కోసం మత్తు కలిగించే పదార్ధాలను వాడటం ఈ మధ్య కాలంలో మొదలయ్యింది మాత్రం కాదు. చారిత్రిక కాలం నుంచి ఈ తరహా వ్యసనాలు మనకు అనేకం కనిపిస్తాయి. అయితే అప్పట్లో వాటికి వినియోగించిన పదార్ధాలు మాత్రం వేరు. మత్తు కోసం ఆనాడు ప్రకతి సిద్ధంగా లభ్యమయ్యే మద్యం, గంజాయి, పొగాకు, నల్లమందు, మత్తునిచ్చే పుట్ట గొడుగులు వంటి పదార్థాలను విరివిగా వాడుతూ ఉండేవారు. అయితే గత శతాబ్ద కాలం నుంచి పరిశీలిస్తే సాంప్రదాయ మత్తు పదార్ధాలను తలదన్నే రీతిలో సింథటిక్ మత్తు పదార్థాలు ఎక్కువగా వాడుకలోనికి వచ్చేసాయి.
గడచిన ఆరేడు దశాబ్దాల్లో వీటి తయారీ, సరఫరా, విక్రయాల విషయంలో మాఫియా ముఠాలు పని చేయడం ప్రభుత్వ నియంత్రణలు సత్ఫలితాలు ఇవ్వలేక పోవడం వలన ఈ మాదక ద్రవ్యాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి.
నేటి యువత సిగరెట్టు మద్యం తీసుకోవడంతో పాటు నేడు ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు అయిన గంజాయి, ఎపిడ్రిన్, కొకైన్, ఓపియమ్ (నల్లమందు), హెరాయిన్, బ్రౌన్‌షుగర్, కెటామైన్... పేరేదైతేనేం.. ఈ మత్తు పదార్థాల వినియోగానికి క్రమేపీ బానిసలవడం ఆందోళన కరంగా మారిపోయింది.
డ్రగ్స్ బానిసత్వం
కిక్కు కోసమని థ్రిల్ కోసమని స్నేహితుల ప్రోత్సాహంతో యువత మొదట్లో సరదాగా పొగ త్రాగడం, మద్యం సేవించడం వంటివి ప్రారంభిస్తారు. అయితే కాలక్రమంలో అవి వ్యసనాలుగా మారిపోతాయి. అయితే వాటితో సరిపెట్టకుండా మరింత కిక్కు అందించే మాదక ద్రవ్యాలు వైపు వీరు ప్రయాణం చేస్తున్నారు. వారికి తెలుసు ఇది ఎంత హానికరమై నదో అయినా కూడా మాదక ద్రవ్యాల దిశగా ఎందుకు ఆసక్తి చూపుతున్నారంటే జీవితంలో ఊహించని ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం కోసమని, నిస్సత్తువగా మారిన బతుకులో కొంత ఉత్తేజం పొందాలని ప్రేమలో విఫలమై ఆ బాధకు ఉపశమనం పొందాలనే ప్రయత్నంలో మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తున్నారు.
ఈనాటి ఆధునిక కుటుంబాల్లో దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం కారణంగా పిల్లలపై సరైన పర్యవేక్షణ ఉండడం లేదు. దీంతో తమను గమనించే వారు, ప్రశ్నించే వారే లేరన్న అవకాశాన్ని సరదా కోసం, ఫ్యాషన్, మోజు, స్నేహితుల ఒత్తిడి కారణాలతో మత్తుమందులు వినియోగానికి కొందరు అలవాటు పడుతున్నారు. సరదాగా ఒక్కసారి అన్న భావనతో మత్తుమందుల వినియోగం ప్రారంభించినప్పటికీ వాటిని వినియోగించినప్పుడు కలిగే తాత్కాలిక ఆనందం తరచూ పొందాలి అని కోరికతో క్రమేపీ అది బానిసలుగా మార్చేస్తోంది. చివరకు మత్తుమందు తీసుకోకుంటే తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. వాటిని సమకూర్చుకోవడానికి ఎంతకైనా తెగించేస్తున్నారు. ఈ విధంగా సరదాగా అలవాటు చేసుకుంటున్న ప్రతి 10 మందిలో ఇద్దరు దానికి పూర్తిగా బానిసలై పోతున్నట్లు ఈ మధ్యనే భారత గ్రామీణ చైతన్య వేదిక చేసిన తన సర్వేలో తేల్చి చెప్పింది.
ప్రపంచ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలు
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు మాదక ద్రవ్యాలపై నిషేధం విధించినా కూడా వీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేక పోవడానికి ప్రధాన కారణం ఇంటర్నెట్. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలు మాత్రం వాయువేగంతో అత్యంత సునాయాసంగా దేశాంతరాలను, ఖండాంతరాలను దాటి మన దేశం చేరుకుంటున్నాయి. ప్రధానంగా అమెరికా తదితర విదేశాల నుంచి అతిపెద్ద 'డార్క్ నెట్వర్క్'తో, ఇంటిదొంగల సహకారంతో మత్తు పదార్థాలు సినిమా, ఐ.టి. సహా అనేక రంగాలతో పాటు పబ్లిక్ స్కూల్లో చదువుతున్న పిల్లల చేతుల్లోకి కూడా ఇవి చేరిపోతున్నాయి. పోలీస్, ఎన్ఫోర్స్ మెంట్ తదితర నిఘా వ్యవస్థల కళ్లు గప్పి యథేచ్ఛగా దిగుమతి కావడం, వాటి సరఫరా వెనుక సాదాసీదా నేరగాళ్లతో పాటు అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉండటం ప్రభుత్వాలకు ఇది పెనుసవాలుగా మారింది. అందుకే ఐక్యరాజ్య సమితి ప్రస్తుతం మానవాళిని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం తరువాతి స్థానం మాదక ద్రవ్యాలదేనని స్పష్టీకరించింది.
ప్రపంచ జనాభాలో సుమారు పదిశాతం మంది మాదక ద్రవ్యాలకు బానిసలై ఉన్నారన్న ఐక్యరాజ్యసమితి అంచనాలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రతీ యేటా రూ.300 కోట్ల మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతోందన్న గణాంకాలు డ్రగ్స్ విస్తతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రపంచంలో పెట్రోల్, ఆయుధాల వ్యాపారం తర్వాత రూ.500 మిలియన్ డాలర్ల టర్నోవర్‌తో మాదక ద్రవ్యాల మార్కెట్ మూడో స్థానంలో ఉండడం చూస్తే వీటికి ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు ఒక అంచనా.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ వెల్లడించించిన వివరాలు ప్రకారం.... ప్రపంచంలో 15 ఏళ్ల నుండి 70 ఏళ్ల వయసుగల వారిలో 30కోట్ల మంది ఒక్క సారైనా మాదక ద్రవ్యాలను ఉపయో గించారని తేల్చింది. మాదక ద్రవ్యాల వ్యాపారం ద్వారా ఆర్జించిన డబ్బును ఆఫ్రికా, ఆసియా దేశాల్లో తిరుగుబాట్లకు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నట్లు ఈ సంస్ధ తన నివేదికలో హెచ్చరించింది.
ప్రపంచ మాదక ద్రవ్య నివేదిక-2020 లో మత్తుపదార్థాల వినియోగం ప్రత్యేకించి అభివద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతీ ఏటా పెరుగుతోందని తెలిపింది. తాజాగా వియన్నాలోని యూఎన్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన ప్రపంచ ఔషధ నివేదిక ప్రకారం.. గత ఏడాది ప్రపంచ వ్యాప్తం గా 275 మిలియన్ల మంది మాదకద్రవ్యాలను ఉపయో గించగా.. 36 మిలియన్లకు పైగా ప్రజలు మాదకద్రవ్యాల వినియోగ రుగ్మతలతో బాధపడుతున్నారని పేర్కొంది.
ఉడ్తా పంజాబ్
ఎక్కడో ఎందుకు ఒక్కసారి మన దేశంలోనే పంజాబ్ వైపు చూస్తే.. అక్కడ మాదక ద్రవ్యాలకు యువత అలవాటు పడిన తీరు చూస్తే మాదక ద్రవ్యాలు మన చుట్టూ ఏ విధంగా పెన వేసుకు పోయాయో తెలుస్తుంది. ఒక రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాలకు దాదాపు 73 శాతం యువత బలయ్యారు అనే భయానక విషయం మాత్రం ఉడ్తా పంజాబ్ అనే ఒక సినిమా ద్వారా మాత్రమే అందరికి తెలిసింది. ఆ సినిమాలో మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన పంజాబ్ యువత, దాని దుష్ఫలితాలను ఈ సినిమా ద్వారా దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమాని నిలుపుదల చేయడానికి బెదిరింపులతో పాటు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ న్యాయ స్ధానం అండతో విడుదలైన ఈ సినిమా పంజాబ్‌లో మాదక ద్రవ్యాల వినియోగంలో ఆశ్చర్యపోయే నిజాలను బయట పెట్టింది. వాస్తవంగా పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో హెరాయిన్ తీసుకునే 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య యువత 75శాతం మంది ఉన్నారని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాలు వాడుతున్నవారు 73 శాతం ఉన్నారని తెలిసింది. సోషల్ సెక్యూరిటీ డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్ వారు చెప్పినదాని ప్రకారం, పంజాబ్‌లో 67 శాతం కుటుంబాల్లో ఇంటికి కనీసం ఒకళ్లయినా డ్రగ్‌కి బానిస అయినవాళ్లుంటారట. ఆ ప్రాంతాల్లో వారానికి కనీసం ఒకరు మత్యువాత పడటం చాలా సాధారణమైన విషయంగా చెబుతున్నారు. పంజాబ్‌లో సామాన్యులు జరుపుకునే వేడుకలలో కూడా డ్రగ్స్‌ను చాక్లెట్ల రూపంలో అందజేస్తారని వార్తలు ఉన్నాయి. అక్కడ డ్రగ్స్ మాఫియా వ్యాపార సామ్రాజ్య విలువ రూ. 60,000 కోట్లు అని అంచనా! ఇంత తీవ్రత ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు దానిని కట్టడి చేయలేక పోవడం విచారించదగ్గ విషయం. నిఘా వర్గాల సమాచారం ప్రకారం పంజాబ్‌లో వంటి పరిస్ధితి త్వరలోనే తెలుగు రాష్ట్రాలలో కూడా ఎదురు కావచ్చు అనే హెచ్చరిక తెలుగు వారిని ఆందోళనకు గురి చేసే విషయం. ఈ జాఢ్యాన్ని ఇప్పటికైనా కట్టడి చేయలేక పోతే మున్ముందు దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా పంజాబ్ లాంటి పరిస్ధితులు ఎదుర్కో వలసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
భారత్‌లో మాదక ద్రవ్యాలు
డ్రగ్ విష సంస్కతి మన దేశంలోకి కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ వ్యాప్తి మాత్రం చాపకింద నీరులా సాగుతూ ఉంది. డ్రగ్స్ బానిసలు రోజు రోజుకు పెరిగిపోతున్న దేశాలలో భారత్ ఒకటి..! ఇటీవల కేంద్రం విస్తతంగా నిర్వహించిన సర్వే ప్రకారం గత పదేళ్లలో దేశంలోని యువత కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి మత్తుమందుల వాడకం ఐదింతలు పెరిగినట్లు తేలింది.
ఇండియా క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం... మన దేశంలో డ్రగ్స్ తీవ్రంగా వాడడం వలన 14 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పెద్దలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. దీని వలన 2017-18 మధ్యలో 2,300మంది మతి చెందారు. మరొక పక్క మన దేశంలో సుమారు 15 కోట్లమంది మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారని అంచనా. వీరిలో 80శాతం మంది 35 ఏళ్ల లోపు వారే. వీరందరికి ఇవి మొదట పబ్‌లు, క్లబ్‌లు, సినీ పరిశ్రమ ద్వారా సరఫరా అయితే... ఇప్పుడు ఇవి నేరుగా విద్యా సంస్ధల చెంతకే అందుబాటులోనికి వచ్చేసాయి. కెల్విన్ అనే డ్రగ్ సరఫరాదారుడిని అదుపులో తీసుకున్న సందర్భంలో అతని వద్ద ఉన్న సమాచారం చూస్తే దాదాపు 130 మంది పబ్లిక్ స్కూల్ చిన్నారులకు మద్యం అందిస్తున్నట్లు తెలిసింది. దీనిని బట్టి చిన్న వయసులో ఉన్న బాలలు కూడా ఈ ఉచ్చులో చిక్కుకు పోయారన్న చేదు నిజం బయట పడింది.
మన దేశంలో సామాజిక న్యాయమంత్రిత్వ శాఖ, మత్తు పదార్థాల బానిసల జాతీయ చికిత్స కేంద్రం, ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థలు కలిసి మొట్టమొదటిసారిగా నిర్వహించిన సమగ్ర అధ్యయనాన్ని ఈ సంవత్సరం విడుదల చేసిన తాజా నివేదికలో పదేళ్లనుంచి 17 ఏళ్లలోపు పిల్లలు మద్యం తాగుతున్నట్లు తేలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వినియోగం అధికంగా ఉందని కేంద్ర ప్రభుత్వ రిపోర్టులు ఉన్నాయి.
ఐక్యరాజ్యసమితి విభాగమైన డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు ఉపయోగించేవారు 0.71 శాతం ఉంటే, ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఇండియాలో 2.65 శాతం ఈ ప్రమాదకరమైన డ్రగ్స్ వాడుతున్నారని తెలిసింది.
భారత ప్రభుత్వం 1985లో నార్కోటిక్ - డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టాన్ని భారత ప్రభుత్వం అమలులోనికి తెచ్చింది. అప్పటి నుండి పరిస్ధితులకు అనుగుణంగా 1988, 2001, 2004లో ఈ చట్టానికి సవరణలు చేపట్టారు. అయినా డ్రగ్స్ ఇండియాలోకి రావడం మాత్రం తగ్గడం లేదు.
అంతర్జాతీయ చర్యలు
ప్రపంచ దేశాల అభివద్ధికి పెనుముప్పుగా వాటిల్లుతున్న మాదకద్రవ్యాల వినియోగానికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ఏటా జూన్ 26వ తేదీని ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా 1987ప్రకటించింది.అప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేక ధీమ్‌తో మాదక ద్రవ్యాల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కషి చేస్తోంది.
1989లో జరిగిన యూఎన్వో సదస్సు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాలని, ప్రజలకు వీటి వినియోగం వలన కలిగే దుష్ఫలితాలపై అవగాహన కలిగించాలని నిర్ణయించుకుని కార్యాచరణ ప్రణాళిక రచించినా, ఫలితం మాత్రం ఆశించిన రీతిలో లేదు. 1998లో యూఎన్వో జనరల్ అసెంబ్లీ 'గ్లోబల్ డ్రగ్స్' సమస్యపై ఒక తీర్మానం ఆమోదించింది. డ్రగ్స్ వినియోగించినా, ఉత్పత్తి నిల్వ వ్యాపారాలకు పాల్పడినా కంబోడియా, వియత్నాం, సింగపూర్, థారులాండ్ వంటివి మరణదండన విధిస్తున్నాయి. బానిసలైన వారిని కాపాడేందుకు కాంబోడియా, వియత్నాం, మెక్సికో, సింగపూర్, థారులాండ్ లాంటి దేశాల ప్రభుత్వాలు బాధితుల పునరావాసం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారోద్యమాలు చేపట్టినా వీటి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అంతర్జాతీయ సమాజానికి మార్గ నిర్దేశనం చేసినా, డ్రగ్స్ వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. ఉగ్రవాదంవల్ల మరణి స్తున్నవారి కంటే ప్రపంచంలో మత్తు మందుల వల్ల కన్ను మూస్తున్నవారే ఎక్కువ ఉన్నారనేది అనేక సర్వేల్లో వెల్లడైంది.
సమాజానికి ఇంత కీడు చేస్తున్నా ఈ మాదకద్రవ్యాల వ్యాపారం అంతకంతకు విస్తరిస్తూ మానవాళికి ముంచుకొస్తున్న ముప్పుగూర్చి హెచ్చరిస్తున్నా ఆస్థాయిలో నిరోధించేందుకు అడుగులు పడడం లేదనేది కాదనలేని వాస్తవం.
డ్రగ్స్.. సోషల్ మీడియా
విద్యార్థుల మొబైల్ ఫోన్లలోని వాట్సప్, స్నాప్‌చాట్, ఇన్స్టాగ్రామ్, టెలీగ్రామ్‌లాంటి యాప్ ద్వారా మాధమిక ద్రవ్యాల కొనుగోలు సాఫీగా జరుగుగుతున్నట్లు నిఘా వర్గాల భోగట్టా. వీటిలో డ్రగ్స్ కోసం చేసే చాటింగ్‌లలో వీడ్, స్కోర్, స్టఫ్, యాసిడ్ పేపర్, ఓసీబీ, కోక్, ఎండీ, జాయింట్, స్టాష్, మాల్, ఖాష్, స్టోన్ర్, పెడ్లర్, దమ్, పాట్, క్రిస్టర్, బూమ్, డీపీ వంటి పదాలతో రహస్య సంభాషణ సాగిస్తూ డ్రగ్స్‌ను సులభంగా పొందుతున్నారని సమాచారం.
మాదకద్రవ్యాలు తెచ్చే అనర్ధాలు
మాదకద్రవ్యాలకు ఒకసారి బానిసలైన తర్వాత వీటిని పొందటం కోసం ఎంతటి అకత్యాలు, అత్యాచారాలు, నేరాలు చేయడానికి యువత వెనుకాడటం లేదు. డ్రగ్స్ ప్రధానంగా నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయి. ఇది డ్రగ్స్ వల్ల తలెత్తే తక్షణ దుష్ప్రభావం. వీటిని వాడుతుండే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దారుణమైన దుష్ప్రభావాలు పెరిగిపోతాయి. చివరకు అకాల మరణాలకు కారణమవుతాయి. డ్రగ్స్ వల్ల శరీరానికి వాటిల్లే ప్రధానమైన అనర్థాలు చూస్తే..
- రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది.
- జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతిని, శరీరం శుష్కించి పోతుంది.
- లివర్‌పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి, చివరకు అది పూర్తిగా పనిచేయని స్థితి ఏర్పడుతుంది.
- ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది.
- రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి.
- జ్ఞాపకశక్తి క్షీణించడంతో పాటు ఏకాగ్రత లోపిస్తుంది.
- మెదడు దెబ్బతిని మూర్ఛ, పక్షవాతం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.
- ఎదురుగా ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేని గందరగోళం ఏర్పడుతుంది. పరిస్థితులను గ్రహించి వాటికి అనుగుణంగా స్పందించే శక్తి నశిస్తుంది. వీటి ఫలితంగా ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత, జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా మానసికంగా నిర్వీర్యమవుతుంది.
ఈ విధంగా డ్రగ్స్ మత్తులో పడి యువత నిర్వీర్యమై పోయిన దేశాలు మన కళ్ల ముందే ఉన్నాయి. కుల మత ప్రాంతాలకు అతీతంగా జడలు విరబోసుకుంటున్న ఈ మాదక మహమ్మారి విష వ్యాపారం తల్లిదండ్రుల కలలనే కాదు మన దేశ భవిష్యత్తునే కాల రాస్తోందని చెప్పవచ్చు.
పిల్లలపై అతి నమ్మకం
తల్లి తండ్రులలో ఎక్కువ మంది తమ పిల్లలు బుద్ది మంతులని ఇల్లు బడి తప్ప మరొక ప్రపంచం తెలియదు అంటూ పిల్లలపై ఎక్కువ నమ్మకం చూపిస్తారు. పిల్లలపై నమ్మకం ప్రేమ చూపించడంలో తప్పు లేదు. అయితే ఆ నమ్మకం అతి కాకూడదు. డ్రగ్ వ్యవహారం మనకు చెందినది కాదు మన పిల్లలు ఆ దరిదాపుకు కూడా వెళ్ళరు అనే నమ్మకం నిజంగా ఆ డ్రగ్ మహమ్మారి మన ఇంట్లోనే మన పిల్లల చెంత కొలువై ఉన్నప్పటికీ దానిని గమనించే అవకాశాన్ని ఇవ్వదు. ఈ స్ధితిలో పరిస్ధితి చేయి దాటిపోయిన తరువాత బాధపడి ప్రయోజనం ఉండదు. అందుచేత ప్రతీ తల్లిదండ్రులు తమ బిడ్డపై నమ్మకంతో పాటు బిడ్డ వ్యవహార శైలి బట్టి అనుమానం కూడా కలగాలి. అప్పుడే పెను ప్రమాదం నుండి బిడ్డను బయట పడేసే అవకాశం మనకు చిక్కుతుంది. ఈ విషయమై ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాలు ద్వారా డ్రగ్స్ బారిన పడిన పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి అనే దానిపై విస్తత ప్రచారం చేపట్టాలి. దీని ద్వారా చాలా మందిని ఈ విపత్తు నుండి కాపాడిన వాళ్ళం అవుతాం.
కౌన్సిలింగే కీలకం
మాదకద్రవ్యాలకు బానిస కావడం అనేది ఒక జబ్బు. వాటికి అలవాటు పడిన వాళ్ళను మనం ఒక రోగిలా మాత్రమే చూడాలి తప్ప నేరగాడిలా చూడకూడదు. పిల్లవాడిని నిర్బంధిస్తే ఆ మహమ్మారి నుంచి బయట పడేయవచ్చు అని భావించే తల్లిదండ్రులు లేకపోలేదు. ఈ తరహా అభిప్రాయం సమస్యను మరింత జఠిలం చేస్తుంది తప్ప పరిష్కారం మాత్రం లభించదు. డ్రగ్స్ ఊబి నుంచి బయట పడాలి అంటే వైద్య సహాయం ఎంత అవసరమో కుటుంబ సభ్యుల సహకారం అంత కన్నా ఎక్కువ అవసరం. అందుచేత వైద్యులు రోగి కన్నా ముందు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తారు. ఇది వీరు పాటించ గలిగితే తప్పక మంచి ఫలితాలు లభిస్తాయి. పిల్ల వాడిని నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పకుండా కౌన్సిలింగ్ ద్వారా తాను చేస్తున్నది తప్పు ఈ ఉచ్చు నుంచి నేను బయట పడాలి అనే సంకల్పం ప్రారంభం అయ్యే విధంగా చూడాలి. ఇది కనుక పిల్ల వాడిలో మనం రప్పించగలిగితే సగం విజయం సాధించినట్లే. దీనిని బట్టి ఔషధం కన్నా కౌన్సిలింగ్ కీలకం అని వైద్యుల చేపట్టిన అనేక కేసుల ద్వారా స్పష్టమయ్యింది.
లాక్డౌన్ చేసిన మేలు
మానసిక వైద్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం కోవిడ్ మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ వలన మాదక మహమ్మారిని పసిగట్టి నియంత్రించే అవకాశం తల్లిదండ్రులకు చిక్కింది. చాలా మంది తల్లిదండ్రులకు తమ బిడ్డ డ్రగ్‌కు ఎడిక్ట్ అయ్యాడనే విషయం తెలియదు. ఎందుకంటే పిల్లలు హాస్టల్ లో ఉండటం లేదా నిత్యం కాలేజీకి వెళ్లి పోతుంటారు. లాక్డౌన్ వలన ఇంటి వద్దే ఉన్న పిల్లలకు డ్రగ్స్ దొరక్క వారిలో వచ్చిన మార్పును గమనించి వెంటనే వైద్యులను సంప్రదించి మాదక మహమ్మారి నుండి బయట పడినవాళ్ళు ఎందరో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే లాక్డౌన్ సడలించిన తరువాత మరలా ఈ మహమ్మారి తిరిగి పడగలు విప్పింది అన్నది కొస మెరుపు.
'నశా ముక్త భారత్ అభియాన్'
చాలా మంది తల్లిదండ్రులకు తమ బిడ్డ డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలియగానే చెప్పలేని వేదనకు గురి అవుతారు. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్ధితి. ఇటువంటి స్ధితిలో ఉన్నవారికి కేంద్రప్రభుత్వం 'నశా ముక్త్ భారత్' లేదా, 'మాదక ద్రవ్య రహిత భారత్' అనే ప్రజాచైతన్య కార్యక్రమాన్ని చేపట్టింది. దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా రూపు దిద్దడమే ఈ పధకం ప్రధాన లక్ష్యం. దేశవ్యాప్తంగా సమస్య తీవ్రంగా ఉన్న 272 జిల్లాల మీద దష్టి పెట్టి ఒక హెల్ప్‌లైన్‌ని నిర్వహిస్తోంది. ఈ హెల్ప్‌లైన్‌లో ఎప్పుడూ కౌన్సెలర్లు అందుబాటులో ఉంటారు. ఈ మహమ్మారి నుండి ఎలాగైనా బయట పడాలి అని తలంచే వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సంప్రదిస్తే కేసు తీవ్రత బట్టి సలహా ఇస్తారు. లేదా కౌన్సిలింగ్ ఇస్తారు. దగ్గరలో ఉండే వైద్యుడిని సంప్రదించమని సలహా ఇవ్వడంతో పాటు మనో ధైర్యాన్ని అందిస్తారు.
బాధ్యులెవరు?
సాధారణంగా ఒక దేశ అభివద్ధి కుంటు పడటానికి కానీ వినాశనం దిశగా పయనించడానికి కానీ ఆ దేశం జరిపే యుద్ధాలు, అణ్వాయుధాలు, దాడులు, అక్కడ సంభవించిన ప్రకతి వైపరీత్యాలు, ఆ ప్రభుత్వాల ప్రణాళికా వైఫల్యాలు ప్రధాన కారణంగా చెబుతారు. అయితే ఇంతకన్నా బలీయమైన వ్యవస్థీకత లోపమేమిటంటే అక్కడ నెలకొన్న విద్యాసంస్ధల పనితీరు. సమకాలీన సమాజంలో నేడు తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి తమ పిల్లలకు కార్పొరేట్ విద్యా సంస్ధలలో ఖరీదైన విద్యను అందిస్తున్నారు. కరెన్సీ కట్టల ఆర్జనే ధ్యేయంగా పిల్లలకు లక్ష్యాలు పెడుతున్నారు. ఏ విధమైన పర్యవేక్షణ లేకుండా పాకెట్ మనీ అందిస్తున్నారు. ఇదే పంథాలో మార్కులు ర్యాంకులు పరమావిధిగా తీరిక లేకుండా పిల్లలకు విద్యను అభ్యసించమని విద్యా సంస్థలకు లక్షలకు లక్షలు ఫీజులు రూపంలో గుమ్మరిస్తున్నారు. తల్లి తండ్రి ప్రేమలు పొందాల్సిన వయసులోనే హాస్టల్లో పడేస్తున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు కానీ విద్యా సంస్థలు కానీ వారి మానసిక వత్తిడిని అసలు పరిగణలోనికి తీసుకోవడం లేదు. ఏది మంచి ఏది చెడు అనే నైతికత గురించి తెలియచేసే పాట్యాంశాలు లేవు. చెప్పే గురువులు కరువయ్యారు. ఒకవేళ చెప్పే గురువులు ఉన్నా చెప్పే అవకాశం ఇవ్వరు. ఇటువంటి గుహలో బంధింపబడిన పిల్లలు సుఖం కోసం మత్తు వైపు పయనించడానికి ఉత్సాహం చూపడం అనేది పెద్ద ఆశ్చర్య పడవలసిన విషయం కూడా కాదేమో. ఒక పక్క అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుతున్న అంతర్జాలం, తల్లిదండ్రులు తమ పిల్లలతో గడపకపోవడం, మరొక పక్క విద్యావ్యవస్థలో లోపాలు, విద్యార్థులపై ఒత్తిడి, క్షీణిస్తున్న సామాజిక విలువల ఫలితంగానే యువతరం దారి తప్పుతూ ఉంది. పంజరం లాంటి ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసుకుని స్వేచ్ఛా విహంగం లాంటి ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశించే సరికి ప్రతీ విశ్వ విద్యాలయం కూడా పిల్లలను మాదక ద్రవ్యాలతో స్వాగతం పలుకుతున్నాయి. ఈ దశలోనే చాలా మంది విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. వ్యసనాలు మనిషిని ఒక్కసారిగా లొంగదీసుకోలేవు. అయితే అవి పిల్లలను తాకే సమయంలో వాళ్లలో వచ్చే మార్పులను గమనించి అలర్ట్ అయినట్లయితే మాత్రం మహమ్మారి బారి నుంచి వారిని బయటపడేయడం చాలా సులభం అవుతుంది. నేడు వైద్య విధానంలో అనేక ఆధునిక ప్రక్రియలు కూడా వచ్చాయి.ఇక్కడ డ్రగ్స్ బారినుంచి పిల్లలను బయట పడేయడానికి ఔషధాలు కన్నా కౌన్సిలింగ్ చాలా బలమైన ప్రభావం చూపిస్తుంది.ఈ వ్యసనాలు బారిన పడుతున్న వారిలో పేదరికం లో ఉన్న యువత కూడా లేకపోలేదు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారి నుండి బయట పడేయాలి అంటే ముందుగా వాళ్ళను దోషిగా చూడటం మానుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మానసిక వైద్యులు సూచన మేరకు వారిలో ఏ విధమైన ఆందోళన కనిపించకుండా ప్రేమతో వాళ్ళను జయించాలి. ఇది అసాధ్యం మాత్రం కాదు. ఇది చేస్తూనే డ్రగ్స్ సేవించే పాత స్నేహితులకు వాళ్ళను దూరంగా ఉంచగలగాలి. లేకపోతే మనం చేసిన ప్రయత్నం అంతా వధా అవుతుంది. అంత కన్నా ముఖ్యంగా డ్రగ్స్ బారిన పడిన పిల్లలను ఇరుగు పొరుగు వాళ్ళు చూపే జాలి చూపులు దోషిగా చూసే విధానం పిల్లలకు మరింత ఎక్కువ హాని చేస్తుంది. ఇటువంటి వ్యక్తులను సాధ్యం అయినంత వరకూ దూరంగా ఉంచాలి. డ్రగ్స్‌కు దగ్గరవుతున్న మొదటి దశలోనే గుర్తించి చర్యలు చేపడితే నూరు శాతం మహమ్మారి బారి నుండి కాపాడవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఈ విషయంలో చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే మాత్రం ఎప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాదు. ఎన్ని నిషేధాలు పెట్టినా దేశంలోకి స్వేచ్ఛగా డ్రగ్స్ వచ్చేస్తున్నాయి అంటే పూర్తిగా అది ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు చేపడుతున్న ప్రతీ సర్వేలోను వీటి వినియోగం పెరిగినట్లు గణాంకాలు వస్తున్నాయి తప్ప అదుపులోకి వస్తున్న జాడ ఏ మాత్రం కనిపించడం లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందుగా వ్యవస్ధ పునాదులును బలోపేతం చేయాలి.ఒకవైపు కఠిన చట్టాలను అమలు చేస్తూనే పిల్లలను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించుకొనేందుకు ప్రజాచైతన్య కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టాలి. ఈ విషయమై ప్రభుత్వం చేపట్టే కార్యాచరణలో చిత్తశుద్ధి ఉండాలి. అదే సమయంలో విద్యా వ్యవస్ధలో సమూల మార్పులు చేయాలి అంటే విద్యా బోధనలో నైతిక విద్యకు అగ్ర తాంబూలం ఇవ్వాలి. విలువలు లేని విద్యా విధానం ఎన్ని చట్టాలు చేసినా ఇటువంటి విష సంస్కతలకు ఎప్పటికి చరమ గీతం పాడలేము.. యువశక్తిని నిర్వీర్వ్యం చేస్తూ, సకల అనర్ధాలకు, అరాచకాలకు అమానుష ధోరణులుకు కారణమై కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలి గొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం అనేది జాతి భవితకే తీరని చేటని గుర్తించి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, సమాజం.. ఇలా అంతా కలసికట్టుగా దీనిపై పోరు సాగిస్తే తప్పక మాదక మహమ్మారిని తరిమి వేయడం సాధ్యం అవుతుంది.ఆనాడే వివేకవంతమైన సమాజం మన కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది.
- రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578
Mon 27 Jun 00:09:14.40672 2022