Sun 10 Jul 07:08:55.024438 2022
Authorization
జానెడు చొక్కా, లొడాసు లాగేసుకుని,
చేసిన బాల్యపు అల్లరిని తల్లిలా సహిస్తూ,
కంటికి రెప్పలా సాకిందా బడి,
నూనూగు మీసాల,
కౌమార చేష్టలను తండ్రిలా భరిస్తూ,
సున్నితంగా దండించిందా బడి,
ఆ బడి ప్రాంగణపు వేపచెట్లు చిగురించిన లేలేత ఆకులతో
నిత్య వసంతమై విలసిల్లుతుండేవి,
వేల శిశిరాల మూకుమ్మడి దాడిలో
ఆకులు రాలిన తరువులై మోడుబారాయిప్పుడు...
ఆ బడి మైదానం ఆడిపాడే పిల్లల పాదముద్రలను
ఎదపై మోస్తూ, మైమరుస్తుండేది,
తడిమే కాళ్ళకై తపిస్తూ, ఒంటిపై
ముళ్ల కంపల గాయాలను భరిస్తూ మౌనంగా పడుందిప్పుడు....
ఆ బడి ఎందరి భవిష్యత్తుకో భరోసానిచ్చి,
నేడు వర్తమానం ప్రశ్నార్ధకమై
తడికళ్ళతో గతాన్ని తడుముకుంటోంది....
ఆ దశ్యం మీకు కనపడట్లేదు కదూ....?!
వయసుడిగిన వద్ధురాలివంటూ వివక్ష చూపితే,
నిరాదరణకు గురై ఆర్థ్రంగా విలపిస్తోంది,
ఆ ఆక్రందన మీకు వినపడట్లేదు కదూ....?!
మున్నూరు పిల్లల,
చిలిపితనాన్ని తలచుకుని లోలోపలే మురిసిపోయేది,
ఇప్పుడు మూడు పదులైనా నిండని గదులను చూస్తూ
బాహాటంగానే గుండెలవిసేలా రోధిస్తోంది...
ఆ ఆర్తనాదం మీదాకా చేరట్లేదు కదూ.....?!
ఒకప్పుడు మనకు జ్ఞానాన్ని ప్రసాదించిన బోధి వక్షం,
మన పిల్లలకు మాత్రం పనికిరాని తుమ్మ చెట్టా...??
''స్టడీ ఫర్ సేల్'' రెక్కలపై లిఖించుకుని,
బహుళజాతి రాబందులు నగరంపై ఎగురుతున్నాయి,
పేదోడి మాంసాన్ని పీక్కుతింటున్నాయి.
కానీ ఆ బీదోడే రాబందులకు దేహాన్ని అర్పిస్తున్న వైనం,
చదువును తూకమేసే తరాజుతో,
ఊళ్లపై గద్దలు వాలాయి,
పొదిగిన పిల్లల్ని కన్న కోడే, గద్దలకు అప్పగిస్తున్న చోద్యం,
అదిగో...
మనల్ని ఎత్తుకుని పెంచినట్టే,
వేలు పట్టి నడిపించినట్టే,
మన పిల్లలకై ఎదురుచూస్తోంది.
ఆ సర్కారు బడి.
అది లాలించే కన్న తల్లి ఒడి....
- జాబేర్.పాషా, 00968 78531638
మస్కట్ (ఒమన్)