Sun 31 Jul 00:05:08.620335 2022
Authorization
ఇక ఇప్పటికి
నాకు నగరమంతా తెలిసిపోయింది అనుకుంటాను!
దశాబ్దాల కాలంగా ఇక్కడే సంచరిస్తున్నాను కదా
ప్రతి రోజూ కళ్ళతో పలకరిస్తూ
చేతులతో స్పర్శిస్తూ
నగరం అణువణువునూ ఆసాంతం
అవిశ్రాంతంగా ఆస్వాదిస్తూ ఉన్నాను కదా
బగీచాలను -భవనాలను
ఇరానీ చారును- పాయను
ముత్యాలను - మనుషులను
సరస్సులను - సదర్ ను - సందడులను
పందిళ్లను- పండుగలను
ఊరేగింపులను - ఉత్సవాలను నిత్యం చూస్తూ
నేను అందులో లీనం అవుతూ
వాటితో పాటే సహచరిస్తున్నాను కదా
ఆ అతిశయపు ఆత్మవిశ్వాసంతోనే
ఈ నగరం గల్లీ గల్లీ
నాకు తెలుసు అని అనుకున్నాను
కానీ ఫ్లైఓవర్ ఎక్కాక
నాకు తెలుసు అనుకున్నది
తెలియని ఎంతోలో కొంత మాత్రమే అని
ఇంకా తెలుసుకోవలసినది
ఎంతో మిగిలే ఉందని తెలిసిపోయింది !
గాలిలోకి నిలువుగా ఎదిగిన ''ు'' పిల్లర్ ల మీద
వాయువేగంతో దూసుకెళ్తున్న మెట్రో రైలును చూశాక
ఉస్మానియా గుండె మీద చెవిని ఆన్చి
ఎదురుగా ఉన్న చెట్టు వంక చూశాక
నగరం పొరల్లో దాగి ఉన్న వేళ్ళు
ఇంకా ఎంతో లోతుల్లోకి విస్తరించాయని
దుర్గం చెరువుపై నుండి
సైబర్ హర్మ్యాల నీడలో పరిగెత్తుతున్నప్పుడు
వాటి పునాదులు ఏ పాతాళంలోకో
చొచ్చుకుపోయి ఉన్నాయని
ఈ నగరం నాకు ఇంకా అపరిచితయే అని అర్థమయింది
ఈనాటికి నడిచిన తొవ్వను- నవ్విన చేనును చూసి
తవ్విన నేలను - తడిమిన తొడిమను
రాల్చిన నీటిని - ఎగసిన మంటలను
పూసిన పుప్పొడిని - పీల్చిన గాలిని గమనించి
ఈ నగరం ఇక ఇంతే అనుకుంటాను
విప్పారిన పూవులోని తేనెను నాలుకతో చుంబించి
విరగకాసిన పండ్లపై చెంపలను ఆనించి
కమ్మేసిన కారుమబ్బులను తలపై పరచుకుని
రహదారులలోని ఎత్తుపల్లాలను
పాము మెలికల సందులను ముని వ్రేళ్ళతో తాడించి
బిస్కెట్ - బిర్యానీ- కుమానీ క మీఠాలను
పెదాలతో లాలించి
ఖర్జూర- అల్ల నేరేడు - నారింజ పండ్లను
పదాలతో బుజ్జగించి
ఇక ఇంతటితో నా యాత్ర పూర్తి అయిందని
నా గమ్యాన్ని చేరానని
నగరం మొత్తాన్ని అణువణువునా
సంచరించానని గర్వపడతాను
అర్ధరాత్రి అనంతర ఘడియలలోని ఏ నిమిషాన్నో
సంతప్తిగా నిద్రపోతాను
కొత్త ఉదయం
వెండి కిరణాలతో
నా కనురెప్పలపై సన్నగా గుచ్చాక
నగరం మళ్లీ కొత్త అవతారంలో దర్శనం ఇస్తుంది
ఈ క్షణం దాకా సంపూర్ణం అనుకున్నది
సంపూర్ణత లోని అసంపూర్ణత మాత్రమే అనీ
సంపూర్ణత సాధనకు
ఇంకా ఎంతో దూరం పయనించాలని
జ్ఞానోదయం అవుతుంది..
నగరం ఎప్పటికీ ఓ నిత్యాపరిచిత ...
అచ్చంగా నీ లాగానే....!
- మామిడి హరికష్ణ, 8008005231