Sun 31 Jul 23:45:27.200911 2022
Authorization
ఆకాశ మైదానమంతా చంద్రుడొక్కడే
ఆడుకొంటున్నడు
ఏవో ఏవో బాణాలు విడుస్తూ
ఎవరి కెవరికో గాయాలు మండిస్తూ
ఊష్ణ గోళాలని రగిలిస్తూ
ఒక్కోసారి-
శీతల మండలాలని విసిరేస్తూ
మరొకసారి-
విచిత్రంగా...
వినూత్నంగా...
విచ్చలవిడిగా...
మబ్బుల కందేల్లు ఆ ధాటికి మాయం
చుక్కల సీతాకోకలు ఆ వరవడికి దూరం
పహరా ఫెన్సింగ్ వున్నదనీ,
మరో దురుసు పురుగైనా దూరలేదనే ధీమా నేమో
ఇష్టారాజ్యానికి చక్రవర్తిగా చెలరేగిపోతున్నడు
చీమ చిటుక్కుమంటే
పిక్కటిల్లే దిక్కులు కూడా
మూతి బిగించి, సుమతీ పద్యాలు మననం
చేసుకొంటున్నయి
గగనానికి రాజులుంటరా
ఏకఛత్రాధిపత్యాలుంటయా
మనో సీమల ఆహ్లాదపరిచే వెన్నెల
స్టెన్ గన్లా నిలువరించటం
చారిత్రాత్మక విచిత్రమేమో
కాల మార్పుల విజృంభణమేమో
ప్రేయసీ ప్రియుల మధ్య దూరి
చక్కిలి గింతలకు చంద్రకాంతుల పన్నీరు లేదే
డాబామీద కొత్తజంట విహారాలకు
వసంతాల వెన్నెల పవనాలు లేవే
అడవిలో పూచే గోగుపూల పరిమళాలకు
వెన్నెల వాకలు లేవే
ఉయ్యాల్లో పాప నోటినిండా నవ్వుకు
చెంపలు ముద్దాడే లేత శశి కిరణం లేదే
విల్లంబులు ధరించిన కోయపిల్ల పోరాటానికి వెన్నెల శంఖారావం లేదే
వేకువా, వెలుగూ, మిరుమిట్ల బాణసంచా బాగానే
అరివీర భయంకరాలూ, హుంకారాలు,
బతుకుపై కత్తి వాదరలు బాగానే
చలనాలు, చైతన్యాలు నుయ్యిలోకో, గొయ్యిలోకో
తెలియడం లేదు
మనిషితనం తల వంచుకొని ఎక్కడికి వెళ్ళిపోయిందో
జాడ జవాబు దొరకదు
కరెంట్ స్తంభమేదో పచ్చని వేపగున్న యేదో
కనిపెట్టడానికి మస్తిష్కం మాయకు గురౌతున్నది
చేతిరాతల పద్యానికి అలవాటు పడ్డ వాళ్ళం
లాషిగా పిల్చుకొని, బడబడా నవ్వుకున్న వాళ్ళం
జందెం పోగుల్ని అగ్గి పొగలకు ఆహుతిచ్చిన వాళ్ళం
కడప దాటి సోంచాయించిన వాళ్ళం
కడుపాకలి తెలిసి, నడుం బిగించినం, గజ్జె గట్టినం
చంద్రుడంటే వెన్నెల
వెన్నెలంటే చంద్రుడు
గుర్తుకు రావాలె
వెన్నెల జలపాతంలో లోకం పాపాయిలా చెంగలించాలె
చిన్నప్పటి ఆట
అప్పుడు వేసిన వేషం
మళ్ళా వేద్దాం
తలపై రుమాలు
జబ్బ పై గొంగడి పేగు
చేతిలో ఎన్నీల పుల్ల
జుట్టు విరబోసుకున్న నిశికాయంపై
పుల్లాడిస్తూ....
- దాసరాజు రామారావు