Sun 07 Aug 00:39:59.544299 2022
Authorization
నేస్తమా.....
నా ఆధరాలపై ఒలికిన చిరునవ్వు
కావ్యమై నిన్ను తలపిస్తున్నది ...
హృదయమంతా పరుచుకున్న నీ ఆరాధన
ధన్యమై నన్ను ఆలరిస్తున్నది..
మనోహరం మది నిండుతుంటే
ఇంతకన్నా కావాల్సింది ఏముంది?
నా మనసు నిండిన ఓ మధుబాలా....
ఈ మృదుభావాల ఊసుల్ని నేనెలా చెప్పాలి?
చిరుగాలితో కబురపంపనా ?
చందమామతో లేఖనందించనా?
స్వప్నసందేశం పంపనా?
ప్రాణ వాయువులా
నువ్వు నాలో లీనమౌతుంటే..
హృదయ స్పందనవై
నువ్వు నన్ను బతికిస్తుంటే..
ప్రియా...
నేను నిన్ను ఎలా చేరుకోగలను
నీకై నేను ఏ బంధాన్నై కదిలి రాగలను?
ఆర్తిని నింపావు..
నన్ను నీ శరణార్థిని చేసావు
పదమెరుగని నాఎద వీణపై
కొత్తరాగాలేవో పలికించావు....
నీ శృతి లయల శ్రోతనై.. నీకై జోతనై
నీవనే వాకిట పూదోటనై..
నీకై నేను దగ్గరౌతున్నాను
నీవు మాత్రం దూరమౌతున్నావు....
ఇది నీకు తగునా?
నాలో నీ అస్తిత్వం ప్రకటితమయ్యింది
నీకై నా అమృతత్వం అనివార్యమైంది
కానీ.....
నీకు నాకు మద్య ఓ సముద్రం
వారధి కోసం
ఎన్నాళ్ళీ ఘర్షణ ?
ఎందాక ఈ సంఘర్షణ?
నువ్వెక్కడో... నేనెక్కడో...
ఈ నిశ్శబ్ద నిశీధిలో..
నీకై దారి వెదుకుతున్నా
అంతలోనే నిర్లిప్తంగా నిలబడిపోతున్నా
బహుషా... నేను నిన్ను చేరుకోలేననా ?
నీవు నాకై రాలేవనా ?
ఏమి ప్రియా ఇది?
ఏ శిఖరాల అంచున దాగివున్నావో
ఏ స్వర్గం మాటున నిలిచివున్నావో
నీ నిరీక్షణలో నేను
ప్రతి నిత్యం సమిధనౌతున్నా...
ప్రతీ క్షణం సముద్రమౌతున్నా...
సఖీ.....
నా అనుభూతికి అర్థం నువ్వే
నా ఆలోచనకు ఆకారం నువ్వే
నా భావాల భాష్యం నువ్వే
నా ఊపిరి శబ్దం నువ్వే
నా ప్రతి అనుభూతి నువ్వు
నువ్వే... నువ్వే... అంతా నువ్వే...
- పొన్నం రవిచంద్ర,
9440077499