Sun 29 Jan 02:53:25.770743 2023
Authorization
కొందరు మానవత్వపు చెట్టుకు కాసిన
మనుషులై పుడతారు.
పచ్చని పత్రాలై హరితవణంలా విస్తరిస్తారు.
తడారిపోతున్న గొంతుకు...నాలుగు చినుకులై
కురిసి దాహాన్ని తీరుస్తారు.
అమీబాలా నిమిషానికో రూపం మార్చే..
మనుషుల మధ్య... కొంతమంది..
ఇచ్చిన మాటకోసం నిలబడే..
మంచి మనసున్న ఆత్మీయ మనుషులున్నారు.
రెక్కలిరిగి ఎగరలేని పక్షులను..
తమ భుజాలపై మోసే స్నేహపు పక్షులున్నారు.
బుక్కెడు బువ్వకోసం బాధపడుతున్న..
ఒంటరి జీవులను అక్కునచేర్చుకొని..
నాలుగు మెతుకులను ముక్కున కర్చుకొని..
ఆకలిని తీర్చే తల్లి పక్షులున్నారు.
మట్టిలోంచి మోలుస్తున్న మొక్కల్లా..
రెండాకుల సవ్వడై గుండె బరువును దించే..
మంచి మనసున్న నేస్తాలున్నారు.
ఎండిపోయిన జీవితపు కొమ్మలపై..
కోకిలమ్మ పాటలై కమ్మని గొంతును వినిపించే..
కమ్మనైన మాటలుపంచేవాళ్ళున్నారు.
నిశీధినిండిన హృదయంలో..
ధైర్యపు కాగడాలను వెలిగించి..
చందమామలాంటి వెలుగులు పంచే నరులున్నారు.
కులమతాల సంకెళ్లతో బందించబడ్డ బతుకుని..
సమానత్వపు పద్యాన్ని పూరిస్తూ..
ఖడ్గాలై మతతత్వ శక్తులను తెగనరికేవారున్నారు.
మంటలురేపే మనుషులమధ్య చల్లని
హిమపర్వతాలై కురిసే శాంతి కపోతాలున్నారు.
అవును...ఇపుడు అలాంటి వారే కావాలి.
దహించుకుపోతున్న దేశాన్ని చల్లార్చే..
చల్లని నీరులాంటి వారు కావాలి.
నీదొక జెండా...నాదొక జెండా అని..
మనుషుల మధ్య సరిహద్దులు గీస్తున్న..వారికి
శాంతి సందేశమై సమానత్వపు...
పాఠాన్ని బోధించే వారుకావాలి.
జనమంతా ఒకటేనని ఘనంగా చెప్పే..
జాతిజనులను ఒక్కటిచేసే నాయకత్వం కావాలి.
- అశోక్ గోనె, 9441317361