Sat 22 Apr 22:09:27.859848 2023
Authorization
అవును
ఒక్కసారి.. మరొక్కసారి
నువ్వూ - నేనూ
అపరిచితులం అవుదామా?
నేనెవ్వరో నీకస్సలు తెలీనట్టు
నాకేమో నీ పరిచయమే లేదన్నట్టు...
మనం
జతగానో జంటగానో
ఎన్ని ఊహల పల్లకీల్లో ఊరేగాం?
ఎన్ని ఆశల నిచ్చెనల్ని ఆకాశానికేసుకున్నాం?
ఎన్ని కూల్చలేని ఊహల మేడల్ని కట్టుకున్నాం?
ఎన్ని ఎన్నెన్ని ఉప్పెనల్ని ఆటుపోట్లని తట్టుకున్నాం...?
నిన్నలా మొన్నలా ఇప్పుడూనూ
నేనెప్పుడూ మొర పెడుతున్నట్టు..
కోరుకున్న గమ్యం ఒకవైపు కవ్విస్తుంటే
వెడుతున్న బ్రతుకుదారి మరోవైపు సోలుతుంటే
ఆశల సన్నిధి కోసం నీ పెన్నిధి కోసం
నేను నిరంతరం కాలంతో కలబడుతున్నట్టు.....
అవును.....
ఆ కాలం గాలానికి చిక్కిన చేపల్లె
నేను అల్లాడుతుంటే
శబ్దం.... నిశ్శబ్దం....!!!!
నీవు నను వలిచి వరించేవో లేదో
నేనంత ఆత్రంగా అప్పటిలా
మళ్ళీ నిను సాదరంగా ఆహ్వానించేనో లేనో..
ఏమో.....
ప్రేమసాగర సునామి.....
మునిగి తేలుతున్న నేనూ అనే ఒక
భావకుడు.... ప్రేమికుడు.....!
ఏమో?!
నా కలల వనానికి వసంతమెళ్ళిపోయిందేమో
పిందెలు మెక్కే కోర్కెల కొయిళ్ళకు తావులేదేమో
ఉవ్వెత్తున పొంగే నా ప్రేమ ఏరు ఎండిపోతోందేమో
నువ్వు నావై నాతో ఏ దరికి చేరలేవేమో..
నిరాశ నిలువెల్లా అలముకుంటుదేమో
యదలో నీకిక మునుపట్లా చోటు దొరకదేమో??
కల కాదేమో??
కరిగిన కల మాత్రమే నెమో??
కష్టమైనా సరే వీడ్కోలు పలుకవా ప్రియతమా?!
ఒక్కసారి మరొక్కసారి అపరిచితులమవుదాం..!!
- పొన్నం రవిచంద్ర,
9440077499