Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లాం క్యాలెండర్ ప్రకారంగా 9వ నెల పేరు రంజాన్. ఈ నెలలోనే 'దివ్య ఖురాన్' అవతరణ ప్రారంభమైంది. మానవులందరికి రుజుమార్గాన్ని చూపే ఉపదేశాలు ఈ గ్రంథంలో పొందుపర్చబడ్డాయి. ఈ నెలలో ముస్లింలందరూ తప్పక ఖురాన్ గ్రంథాన్ని పఠించి తమ కృతజ్ఞతను ఉపవాస రూపంలో తెలియజేసుకుంటారు.
రంజాన్ నెలలో ముస్లింలందరూ ఉపవాస దీక్షను చంద్రమాన కాల ప్రకారం 29 లేదా 30 రోజులు ఆచరిస్తారు. 7 సం|| వయస్సు పైబడిన ప్రతి ముస్లిం ఉపవాస దీక్షను ఆచరించాలని ఆదేశింపబడింది.
రంజాన్ నెలలో ఆచరించే ప్రత్యేకతలు
1. రంజాన్ నెల మొత్తం ఉపవాసముండటము
2. 'జకాత్' ఇవ్వడము
3. 'తరావి' నమాజ్ చదవడం
4. 'ఇతైకాఫ్' వుండటము
ఇక ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాము
ఉపవాసం
ఉపవాస ప్రారంభ, విరమణ సమయాలను 'సహర్', 'ఇఫ్తార్' అని అంటారు. సహర్ అంటే ప్రాత:కాల వేళ సూర్యోదయానికి ముందు ఇప్పటి కాలమాన ప్రకారం 4:45 గంటలలోపు (ప్రదేశాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది) భోజనం చేయడం ముగించేయాలి. తరువాత ప్రాత:కాల (ఫజర్‌కి నమాజ్) ప్రార్థన చేసుకుని కొంత సేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ తరువాత రోజువారీ కార్యకలాపాల్లో ఎప్పటిలాగే పని వేళల్లో పాల్గొనాలి. అలాగే రోజువారీ నమాజులు ఆచరించాలి. ఈ రంజాన్‌లో ఈ నమాజులు, ప్రార్థనల ప్రాముఖ్యత ఎక్కువ.
తరువాత సంధ్యావేళ ఉపవాస ముగింపు సమయాన్ని 'ఇఫ్తార్' అంటారు. ఈ ఇఫ్తార్ ఇప్పటి కాలమాన ప్రకారం సాయంత్రం 6:36 గంటలకు ముగుస్తుంది. ఒక వ్యక్తి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఉపవాసం ఉండలేకపోతే ఒక ఉపవాస దినానికి పరిహారంగా ఒక పేదవాడికి మూడుపూటలా భోజనం పెట్టాలి.
ఉపవాస సమయంలో కోపతాపాల ప్రలోభాలకి లోను కాకూడదు. పరుష వాక్యాలు పలక కూడదు. చెడు కార్యాలు చేయకూడదు.
జకాత్ ఇవ్వడం
రంజాన్ నెలలో ప్రతి ముస్లిం పాటించవలసిన ముఖ్యమైన విధుల్లో 'జకాత్' ఒకటి. ఇది అందరూ తప్పకుండా చెల్లించాల్సిన దానం. ఇస్లాం ప్రకారం జకాత్ అంటే మనం దాచుకున్న మూల ధనాన్ని పరిశుద్ధ పరిచే ఒక ప్రక్రియ. జకాత్ అంటే ఎవరి దగ్గర ఏడున్నర తులాల బంగారం, యాభై రెండున్నర తులాల వెండి , అలాగే మన దగ్గర దాచుకున్న నగదు, ఒక సంవత్సరం వరకు మన దగ్గర ఉన్నప్పుడు వాటిపై రెండున్నర శాతం 'జకాత్' చెల్లించాలి.
ఇక ఈ జకాత్ ఇవరికి ఇవ్వాలి అంటే, ముందుగా బీద స్థితిలో ఉన్న దగ్గరి బంధువులకు బీద మిత్రులకు, ఇతరుల ముందు చేయి చాపని (మిస్కిన్) నిరుపేద అవసరార్థులకు, అప్పు తీర్చలేని రుణగ్రస్తులకు, బాటసారులకు, ధర్మ సంస్థాపన కోసం ఈ జకత్ ఇవ్వాలి.
'తేరావి నమాజ్'
రంజాన్ నెలలో జరిగే రోజువారీ ప్రార్థనలతో పాటుగా రాత్రిపూట ఆచరించే 'ఇషా' నమాజ్‌తో పాటుగా 'తరావీ' అనే ప్రత్యేక నమాజ్ ఉంటుంది. ఈ నమాజ్‌లో ఖురాన్ గ్రంథాన్ని మౌఖికంగా వల్లె వేస్తూ ప్రార్థనం చేస్తుంటారు.
మొదట ప్రవక్త మహమ్మద్ సలల్లాహు వల్లసం ఖురాన్‌ను మౌఖికంగా వల్ల వేస్తూ గ్రంథస్తం చేయబడిన ఈ ఖురాన్ ఈ రంజాన్ నెలలో ప్రత్యేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మసీదులో పఠనం చేస్తూ ప్రార్థనలు చేస్తారు. అందుకే ఖురాన్ గ్రంథం 1400 సంవత్సరాలుగా ఎటువంటి మార్పులు చేర్పులు చేయబడని ఏకైక గ్రంథం.
రంజాన్ ఉపవాసాలు - ప్రాముఖ్యత - ప్రయోజనాలు
'ఇఫ్తార్' సమయాన సాధారణంగా ఖర్జూరంతో ఉపవాస దీక్ష విరమించడం ప్రవక్త మహమ్మద్ ఇష్టంగా భావించే వీరు ఆరోగ్య పరంగా కూడా ఖర్జూరంలోని ఐరన్లు మనకెంతో శక్తినిస్తుంది. ఉపవాసాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఉపవాసాలు 'ఖురాన్' గ్రంథంలో చెప్పబడిన విధంగా, దైవ ప్రవక్త ఆదేశాలను శిరసావహించడానికే ముస్లింలు ఉపవాస దీక్షలు చేస్తారు. కానీ, కేవలం ఆరోగ్య ఫలితాలు కలుగజేయాలని మాత్రం కాదు.
ఇఫ్తార్ సమయాన సాధారణంగా కుటుంబ సభ్యులందరూ ఒక చోట కూర్చుని, ప్రార్థన చేస్తూ మగవారందరూ దగ్గరి మసీదులో చేరి ప్రార్థన చేసి అల్పాహారం తీసుకోవడం జరుగుతుంది. ఈ అల్పాహారంలో ఎక్కువగా ఖర్జూరాలు, అన్ని రకాల పండ్లు, హలీమ్ లాంటి సులువుగా తినగలిగే పదార్థాలను వుపయోగిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ముస్లింలు ఇతర మత స్నేహితులతో కలిసి ఇఫ్తార్ విందులను కూడా ఏర్పాటు చేసుకుంటారు. దీనితో సమాజంలో మానవ సంబంధాలు పెరుగుతాయి. ప్రవక్త చేసి చూపిన బాట కూడా ఇదే.
'సహరి'లో గాని 'ఇఫ్తార్'లో గాని ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు 'సమయ పాలన'. 'సహరి' లో భోజనం ముగించాల్సిన సమయంలో గాని, ఇఫ్తార్‌లో భోజనం తినాల్సిన సమయంలో గాని కొన్ని నిమిషాలు ఆలస్యమైనా ఆ రోజు అది ఉపవాసంగా పరిగణింపబడదు. ఇది అల్లా ఆదేశం కూడా. దీనితో అల్లా ఆదేశాన్ని అనుసరించడం ముఖ్య విధి. దీనితో పాటు ప్రవక్త ఆదేశానుసారంగా ప్రజలకు 'సమయపాలన' ప్రాముఖ్యత కూడా తెలియజేస్తోంది.
కాబట్టి ఉపవాసం ఉండే ప్రయాణికులు కూడా 'ఖర్జూరం' గాని, మంచినీరు కాని తమ వెంట ఉంచుకుని అది తిని, ప్రయాణ సమయంలో ఉపవాస దీక్ష ముగిస్తారు.
రంజాన్ మాసంలో ముప్పై రోజులు ఉపవాసాలు ఉంటూ కూడా అలుపుసొలుపు లేకుండా ఉత్సా హంగా ఉండటానికి కారణం నిష్టగా ఉపవాస సమయంలో ఆచరించే అన్నపానాదులు తీసుకునే విధానంలో సమయ పాలన ముఖ్యంగా ఆధ్యాత్మిక భావన, దైవ చింతన.
ఈ విధంగా ఉపవాసాలు అంటే దాదాపు 13 గంటలు భోజనం నీరు తీసుకో కుండా ఉండ టం వల్ల, మనిషిలో సహన శక్తి పెరుగుతుంది.. ఆకలికి అర్థం తెలుస్తుంది. కాబట్టి బీదవారి పట్ల దయ పెరుగుతుంది. 13 గంటలతరువాత నీరు తాగినపుడు నీరు ఎంత రుచిగా మధురంగా ఉంటుందో తెలుస్తుంది. ప్రపంచంలో ఏ ఇతర పానీయాలకు కూడా ఇలాంటి రుచి ప్రయో జనాలు లేవని అర్థమ వుతుంది. సంవత్సరంలో ఒక నెల ఈ విధంగా ఉపవాసాలు ఉండటం వల్ల శరీరం సహజంగా తయారయ్యే కొన్ని అనర్థ పర్థాలు నశించి శరీరం ఆరోగ్యకరంగా తయారవుతుంది.
2016లో జపనీస్ బయాలజిస్ట్, నోబుల్ బహుమతి గ్రహీత యషనోరి బసుమి ప్రకారం దాదాపు 12 నుండి 13 గంటలు మనిషి ఉపవాసం ఉండటం వల్ల మనిషి శరీరంలో అటోఫాజి (Autophogy) అనే ప్రక్రియ జరిగి కణాలలోని విషపూరిత వైరస్, బాక్టీరీయాలు విచ్ఛిన్నం అయిపోయి కొత్త ఆరోగ్య కణాలు ఏర్పడతాయని, శరీరం బరువు తగ్గుతుందని, మెదడు క్రీయాశీలత పెరుగుతుందని ఇవన్నీ ఉపవాసాల వల్ల శరీరంలో జరిగే ఆరోగ్యకర మార్పులనీ చెబుతారు. ఇవన్నీ 1400 సం||ల పూర్వమే ఖురాన్ గ్రంథంలో లిఖించిన మహా ప్రవక్త మహమ్మద్ సల్ల్లా హి వసలల్లవమ్ చేత చెప్పబడిన ఆరోగ్య సూత్రాలు.
ఈదుల్ ఫితర్ - రంజాన్ పండుగ
చంద్రమాన కాల క్యాలండర్ ప్రకారం 29 లేదా 30 రోజుల ఉపవాసంల తరువాత రోజున జరుపుకునే పండుగనే ఈదుల్ ఫితర్ లేదా రంజాన్ పండుగ అంటారు. ఈ పండుగ రోజు రోజువారీ సమాజ్‌లతో పాటు ఉదయం పూట ఒక నిర్ణీత సమయంలో మసీదులలో లేదా 'ఈద్గా' అనే ప్రత్యేక ప్రదేశాలలో 'ఈద్ కీ నమాజ్' అనే ప్రత్యేక నమాజ్ అందరూ కలిసి చదవడం జరుగుతుంది. నమాజ్ తరువాత ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని, పెద్దవాళ్ళు పిల్లలకు, 'ఈదీ' (కానుకలు) ఇస్తుంటారు. పండుగ రోజు తప్పకుండా సేమియా పాలతో కలిపి పాయసం, బిరియాని, హలీమ్ లాంటి పండుగ ప్రత్యేక డిషెస్ తయారు చేస్తారు. పండుగ రోజు తప్పకుండా స్నేహితులను ఇంటకి ఆహ్వానించడం, చుట్టుపక్కల ఇంటివారికి ప్రత్యేకంగా చేసుకున్న ఈ వంటకాలను పంపిస్తుంటారు. పండుగ రోజు లేదా మరుసటి రోజు ఇంటిలోని మహిళలు వారి పుట్టిండ్లలకు వెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు పొందుతుంటారు.
ఎర్రబడ్డ మెహిందీ చేతులతో తెల్లని సేమియాలు తినడం ఈ రంజాన్ ప్రత్యేక ఆకర్షణ.
ఉపవాసం వల్ల శరీరంలో జరిగే ఆరోగ్యకర మార్పులు
P.E.Gs Analysis పోప్ ఇల్ఫ్ గల్ఫ్ ప్రకారం తన దగ్గరకు వచ్చే రోగగ్రస్త భక్తులకు ప్రతినెలా మూడు రోజులు ఉప వాసం ఉండమని సలహా చెప్పేవారు. దీని వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా Stomach Inflammationకూడా తగ్గుతుంది. డాక్టర్ లూథర్ జిమ్ కేంబ్రిడ్జి Phormocologist ప్రకారం ఉపవాసమున్న వ్యక్తి జీర్ణాశయంలో స్రవించు స్రవాలను పరీక్షించిన తర్వాత, ఆహార పదార్థాలలోని Food poising substances సాధారణంగా తయారయ్యేవి ఈ ఉపవాస సమయంలో నశించి పోతాయని తెలియజేశారు.
Medical Experts ప్రకారం ఉపవాసం వల్ల ముందుగా కేవలం జీర్ణాశయానికి సంబంధించి ఏదైనా పదార్థం జీర్ణం కావడానికి అనేక శరీకర భాగాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. అవి ముందుగా నోరు, రుచి చూసే నాలుక స్రవించే లాలాజల గ్రంథులు, ఆహారాన్ని నమిలే దంతాలు, మింగే గొంతు కండరాలు, జీర్ణవాహిక, తర్వాత జీర్ణాశయం, స్రావాలను స్రవించే పిత్తాశయం, పెంక్రియాన్, జీర్ణమైన ఆహారం ప్రయాణించే చిన్న పేగు, పెద్ద పేగు, ఇవన్నీ కూడా ఒక దానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఏదైనా చిన్న పదార్థం తినడం మొదలు పెట్టగానే పైన చెప్పిన భాగాలన్నీ ఒక వలయంలా పనిచేయడం ప్రారంభించాలి. తినే ఒక గ్రాము పదార్థంలో పదో వంతు కూడా జీర్ణాశయం చేరితే కూడా జీర్ణక్రియ ప్రక్రియ మొదలైపోతుంది. కాబట్టి ఎప్పుడూ నములుతూ ఉంటే వాళ్ళు, కొద్దిసేపటికొకసారి ఏదైనా తింటూ ఉంటే వీళ్ళల్లో పై చెప్పిన భాగాలన్నీ అవిరామంగా పని చేస్తూ పోతూనే ఉండాలి. దీని వల్ల మెలమెల్లగా జీర్ణక్రియ శక్తి తగ్గిపోతుంది. ఉపవాసం వల్ల కనీసం ఈ భాగాలన్నింటికి 4 - 6 గంటల విరామం దొరుకుతుంది. ఈ విరామం వల్ల ప్రతి కణం యాక్టివేట్ అయి నూతన శక్తితో పని చేయడం ప్రారంభిస్తుంది.
ఉపవాసం వల్ల రక్తంలో నిలువ వున్న కొవ్వు పదార్థాలు కరిగి పోవడం వలన రక్తం సునాయాసంగా సూక్ష్మ నాశికల వకు ప్రవహిస్తూ పోతుంది. ఉపవాసాల వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ ముందుగా కరిగిపోతుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. అంతేకాకుండా మూత్ర పిండాలలో కూడా రక్త ప్రసరణ బాగా జరిగి యూరినరీ సమస్యలు కూడా లేకుండా పోతాయి. అని సెలవిస్తున్నారు.
ఇవన్నీ విశ్లేషించుకున్నప్పటికీ ఇక క్రమశిక్షణ, నిబద్ధత, నిమగత అలవడే క్రమం రంజాన్ పండుగలో ఉండటం విశేషం.
- జరీనా బేగం,
9989615903
విశ్రాంత వృక్షశాస్త్ర అధ్యపకురాలు