Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమస్త జీవకోటి భారాన్ని మోస్తూ.. సప్తసముద్రాలను నదులను తన తనువులో దాచుకొని విశ్వ మానవాళికి, సకల జీవరాశులకు నిలయంగా నిలచింది నేలతల్లి. ఈ నేలను నమ్ముకొని.. నేలను ఆధారంగా చేసుకొని.. చెట్లూ చేమలు.. జీవులు..జీవరాశులు.. మనుషులు.. చివరకు సూక్ష్మక్రిములు కూడా మనుగడ సాగిస్తున్నాయి. ఇలా కొన్ని కోట్ల జాతుల జీవనానికి మట్టి ఆధారమై నిలచింది. తల్లి మనకు జన్మనిస్తే.. ఆ తల్లితో పాటు నేల తల్లి మనకు బతుకునిస్తుంది. మనల్ని పోషిస్తూ మన ఉనికికి ఆధారభూతమైన, చైతన్యవంతమైన ఒక మాత స్వరూపంగా నిలచింది నేల తల్లి. ఈ నేల తల్లి సంరక్షణ ఎలా కొరవడిందో.. పరిస్థితులు ఎలా ఉన్నాయో... నేల తల్లిని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరి బాధ్యతగా ఏం చేయాలో తెలుసుకుందాం...!!
భూమి అన్నది ఒక అద్భుతం. చనిపోతే నేలలోనే పాతిపెడతారు. అక్కడే ప్రాణం కూడా మొలకెత్తుతుంది. ''మనం భూమి నుంచే ఉద్భవిస్తాం. భూమిపై ఉన్న దానినే తింటాం. చనిపోతే తిరిగి అదే భూమిలోకి చేరతాం''. అయితే మట్టి అనే దానిని మనలో చాలా మంది ప్రాణం లేని జడ పదార్థంగా భావిస్తాం. కానీ ఎన్నో జీవాలకు మనుగడ ఇచ్చే ఈ మట్టికి జీవం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మట్టి ఓ సజీవ పర్యావరణ వ్యవస్థ. ఒక చెంచా మట్టిలో వందల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ గ్రహం మీద జీవిస్తున్న మానవుల కంటే ఎక్కువ జీవులు పిడికెడు మట్టి (8 నుంచి10 బిలియన్లు)లో నివసిస్తున్నాయి. ఈ భూమిలో 36-39 అంగుళాలు 87శాతం జీవరాశుల ఆవాసాలకు నిలయంగా ఉంది. 95శాతం ఆహారం మనకు భూమి ద్వారానే అందుతున్నది. ఎన్నో కోట్ల జీవరాశులు మట్టిలో ఆవాసం ఉండటం వల్లనే మనకు భూమి నుండి ఆహరం పండుతుంది. మనం తినగలుగుతున్నాం, అన్ని జంతువులు బతుకుతున్నాయి. అంతేకాదు మట్టి వర్షపు నీటిని తనలో ఇముడ్చుకుని వడకట్టి శుద్ధి చేసి భూగర్భంలో నిలువ చేస్తుంది. ఇవన్నీ కూడా నేల సారవంతంగా అంటే జీవం ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది.
ఇసుకలో సేంద్రియ పదార్థం చేరితే మట్టి అవుతుంది. అప్పుడు మట్టిలో జీవం ఉన్నట్టు. అదే మట్టిలో సేంద్రియ పదార్ధం కోల్పోతే అది ఇసుక అవుతుంది అంటే మట్టి జీవం కోల్పోయినట్లు లెక్క.మట్టికి జీవం పోతే అది బీడు భూమి అవుతుంది. అటువంటి బీడు భూమిలో ఎన్ని రసాయనాలు వేసినా పంట పండదు. ఇప్పుడు అనేక భూములు ఈ స్థితికి చేరుకున్నాయి. అంటే జీవం ఉన్న మట్టి మన చర్యలు వలన అమ్మ లాంటి భూమి, అన్నం పెట్టే భూమి విషతుల్యం అయిపోతోంది. అంతరించిపోయే స్థితికి చేరుకుంది. సష్టిలో పుట్టిన ప్రతీ జీవి ప్రాణం కోల్పోయినట్లే నేల కూడా తన జీవం కోల్పోతుంది. అయితే నేల జీవం కోల్పోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ మాత్రం కాదు. ఈ భూమి జీవాన్ని కోల్పోవడానికి ప్రధాన కారకులం మనమే. మన చర్యలు వల్లనే భూమి కోత, భూ క్షయం, భూ కాలుష్యం అనేవి సంభవించి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలుగా నిలిచాయి. అధిక దిగుబడి కోసం రసాయనాలు వాడకం పెరిగి పోయింది. భూ గర్భంలో ఉన్న నీరు, ఖనిజాలు, చమురు సహజ వాయువులను విచ్చలవిడిగా తోడేస్తున్నాం. హానికర ప్లాస్టిక్ వ్యర్థాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు భూమిపై పడవేస్తున్నాం. దీని వలన నేల తల్లి తీవ్ర క్షోభకు గురి అవుతుంది.దాని కారణంగా భూమి జవసత్వాలు కోల్పోతుంది. ఒక పక్క మన చర్యలు వలన వనాలు మోడులు అవుతూ ఉండగా మరొక పక్క పొలాలు బీడులు అయిపోతున్నాయి. ఇదే విధానం మరొక 100 సంవత్సరాలు కొనసాగితే మన మనుగడకు వేరొక గ్రహం చూసుకోవాల్సిందే అంటూ ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు కూడా. అయినా మనలో మార్పు కనిపించడం లేదు. ఒక అంగుళం ఎత్తు మట్టి కొత్తగా ఏర్పడాలంటే 250 ఏళ్లు పడుతుంది. అటువంటిది మన అజాగ్రత్త వల్ల, స్వార్థం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల సారవంతమైన పై మట్టి కొట్టుకుపోతోంది. ప్రతీ 5 సెకన్లకు దాదాపు ఫుట్‌బాల్ మైదానానికి సమానమైన మట్టి జీవం కోల్పోయేలా మనం చేస్తున్నాం. నేల సారవంతంగా ఉండాలి అంటే దానిలో సేంద్రియ కంటెంట్ 3 నుంచి 5 శాతంగా ఉండాలి. కానీ ప్రస్తుతం మన దేశంలో 62శాతం భూమిలో ఈ కంటెంట్ 0.5శాతం అంత కన్నా ఉన్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి.అమెరికాలో భూమి ఉపరితలంపై 12 అంగుళాల వరకు... ఎరువులు, పురుగుమందుల ప్రభావం ఉంది. 80-83 శాతం సారం కోల్పోయింది. ఈ దుస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఉంది.'' అంటే ప్రపంచం యావత్తు ఇప్పటికే చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు అర్థం అవుతూ ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మట్టే కదా! అని మనం తేలికగా తీసుకోవడమే ఈ దుస్థితికి కారణం.
అభివద్ధి పేరిట పారిశ్రామికీకరణ, అధిక దిగుబడుల సాధనకు రసాయనాలు, హానికరమైన పురుగుమందులతో పునరుత్పాదక సహజ వనరైన నేలపై మనం దశాబ్దాలుగా దాడి చేస్తూనే ఉన్నాం. ఫలితంగా వేల సంవత్సరాలలో పాడు చేయలేని భూసారాన్ని మనం కేవలం నాలుగైదు దశాబ్దాలలో నాశనం చేసేశాం. మనం మట్టికి చేసిన ద్రోహం వల్లనే మన తర్వాత తరాలకు తీరని నష్టం జరుగుతుంది. మన ముందు తరాల వారు మట్టిని కాపాడి మనకు ఇవ్వడం వల్లనే ఈ రోజు మనం ఆ మట్టిపై పంట పండించుకుని మనుగడ సాగిస్తున్నాం. దానిని గమనించకుండా మనం సాగిస్తున్న ఈ మట్టి వినాశనానికి అడ్డుకట్ట వేయకపోతే మరో 40-50 ఏళ్లకు ఈ భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పాడై ఎడారిగా మారిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతే కాదు ఒక సెకనుకు 1 ఎకరం భూమి సారం కోల్పోతుంది. ప్రతీ సంవత్సరం 3 కోట్ల ఎకరాలు సారవంతమైన భూమి తన పై పొరను కోల్పోతుంది. పరిమాణంలో ఇది గ్రీస్ దేశంతో సమానం. 2050 నాటికి 90 శాతానికి పైగా నేల క్షీణించవచ్చని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ (ఖచీజజణ) వెల్లడించింది. ఇదే జరిగితే ఆహారం, నీటి కొరతతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలకు దారి తీస్తుంది. 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 9 బిలియన్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆనాటికి పంట పండించడానికి ఇప్పటి కంటే 1.5 రెట్లు ఎక్కువ మట్టి అవసరం అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న మట్టిలోనే వేగంగా సారం తగ్గిపోతూ ఉంటే అదనపు మట్టి సాధ్యపడే అవకాశమే లేదు. ఈ లెక్కలు బట్టి 2050 నాటికి మనకు అవసరమైన ఆహారంలో 30 శాతం మాత్రమే పండుతుంది. దీని వలన ప్రతీ పది మందిలో ముగ్గురు ఆకలితో చనిపోయే అవకాశం ఉందని వివిధ అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఐక్య రాజ్య సమితి నివేదిక ప్రకారం చూస్తే.. 80 నుండి100 పంటలు పండించడానికి మాత్రమే ఈ భూమిపై అవకాశం ఉంది. అంటే కేవలం 40-50 ఏళ్ళ మాత్రమే మనకు సారవంతమైన నేల మిగిలి ఉంటుంది. (మూడొంతులు ఇప్పటికే క్షీణించింది) 30 ఏళ్లలో సేంద్రియ పదార్థాన్ని 80 శాతం కోల్పోయాం. ఒక హెక్టార్ భూమిలో 60 లక్షల వరకూ సూక్ష్మ జీవులు ఉంటాయి కానీ చాలా వరకూ ఇవి అంతరించి పోయాయి.. ఒక గ్రాము సారవంతమైన భూమిలో 10 వేల నుండి 50 వేల రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. కానీ ఇవి కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. కారణం భూమి జీవం కోల్పోవడమే. భూసార క్షీణత వలన కలిగే ప్రభావాలు విభిన్న విధాలుగా ఉంటాయి.అవి
జీవ వైవిధ్యం...
మట్టిలో జీవం కోల్పోవడం వలన జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్నాం. ఎందుకంటే నేల సారం కోల్పోయి జీవం లేకపోవడం వలన నేలలో సూక్ష్మజీవులు ఆవాసాలను కోల్పోతున్నాయి. దీని వలన ప్రతి సంవత్సరం దాదాపు 27000 రకాల జీవులు అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 80 శాతం పురుగులలో జీవపదార్ధం పోయే స్థాయికి సంక్షోభం చేరుకుంది. ఈ విధంగా జీవవైవిధ్యం కోల్పోవడం వల్ల నేల ఆవాసాలకు అంతరాయం ఏర్పడుతుంది
వాతావరణ మార్పు
పర్యావరణానికి హాని కలిగించే భూతాపాన్ని పెంచేది కర్బనం. అయితే ఈ కర్బనం భూమిలో ఉంటే మేలు జరుగుతుంది. భూమి ఎక్కువ కర్భనాన్ని తనలో ఉంచుకోగలదు. మట్టిలో ఉన్న కార్బన్, మొక్కల కంటే 3 రెట్లు, వాతావరణంలో కంటే 2 రెట్లు ఎక్కువగా నిల్వ ఉంటుంది. అంటే కార్బన్‌ను గ్రహించడానికి మట్టి ఎంతో కీలకం. అప్పుడే కోట్లాది సూక్ష్మజీవులు భూమిలో మనగలుగుతాయి. మట్టికి సమద్ధిగా జీవం లభిస్తుంది. అయితే మట్టిలో ఉన్న జీవం తగ్గే కొలది కార్బన్ వాతావరణంలోనికి చొచ్చుకు వస్తుంది. ఇది గ్లోబల్ వార్మింగ్‌ను ఉదతం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మట్టిలో జీవాన్ని పునరుజ్జీవింపజేయకపోతే, అది వాతావరణ మార్పులకు దోహదపడే 850 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఇది గత 30 సంవత్సరాలలో మానవాళి మొత్తం విడుదల చేసిన ఉద్గారాల కంటే ఎక్కువని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
పోషకాహార లోపం
పోషకాహార లోపం అనేది నేడు పేదవారిలోనే కాదు భాగ్యవంతులకు కూడా ప్రధాన సమస్యగా పరిణమించింది. కారణం ఏమిటంటే భూమి నుండి పండే పంటలలోనే పోషకాహారం ఉండటం లేదు. ఒక అధ్యయనం ప్రకారం మన తండ్రులు తాతలు ఒక నారింజతో పొందిన విటమిన్ సీ మొత్తాన్ని ఇప్పుడు మనం పొందాలి అంటే ఈనాడు దాదాపు ఎనిమిది నారింజలు తీసుకోవాలి. మనం రసాయనాలు ఉపయోగించి పంటల దిగుబడి పెంచాం కానీ దానిలో పోషకాలు పడిపోయాయి అన్న సంగతి పట్టించుకోవడం మానేసాం. ప్రస్తుతం మనం పండిస్తున్న పండ్లు కూరగాయలు ఇప్పటికే తక్కువ పోషకాలను కలిగి ఉన్నాయి. అమెరికాలో కూరగాయల ఖనిజాలలో పోషకాలు 80శాతం తగ్గిపోయాయి. భారతదేశంలో కూరగాయలలో ప్రొటీన్ల శాతం 60శాతం వరకూ తగ్గిపోయాయి. దీని కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 బిలియన్ల మంది ప్రజలు పోషకాహార లోపాలతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది.
ఆహార సంక్షోభం..వలసలు
రాబోయే 20 సంవత్సరాలలో, 930 కోట్ల మంది ప్రజలు ఉండగా ఆహారం మాత్రం 40 శాతం తక్కువ ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తల అంచనా వేశారు. వ్యవసాయం చేయడం అంటే వ్యవసాయ విశ్వ విద్యాలయాల్లో శిక్షణ పొంది గ్రంధాలు చదివి చేసేది కాదు. దానికి సాంప్రదాయ వారసత్వ నైపుణ్యం కావాలి అయితే ఆ నైపుణ్యాన్ని ఒడిసి పట్టి సేద్యం చేసే తరం వారిలో చాలామంది ప్రస్తుతం లేకుండా పోయారు. కొత్త తరం వారు వ్యవసాయాన్ని వత్తిగా ఎంచుకోవడం లేదు. ఈ స్థితిలో భూమి సేద్యంలో ఉన్న సాంప్రదాయ మెలుకువలు వారసత్వంగా వచ్చే ప్రక్రియ నిలచి పోతుంది. ఇంకొక పక్క భూమిలో సారం అంతరించి పోతూ ఉంది. మట్టిలో జీవం పోతే ఎన్ని రసాయనాలు వాడినా పంట దిగుబడి అనేది సాధ్యం కాదు ఈ స్థితిలో రైతులు పంట నష్టం వలన రుణాలు ఉబిలో కూరుకు పోయి నిత్యం ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరొక ప్రమాదకర పరిణామం ఏమిటంటే వ్యవసాయం గిట్టు బాటు కాక పట్టణ ప్రాంతాలకు వలస పోయే సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇది పట్టణాలలో నగరాలలో పర్యావరణ పరంగా కొత్త సమస్యలను సష్టిస్తుంది. జనాభా పెరుగుదల ఇంకా ఆహార, నీటి కొరత కారణంగా 2050 నాటికి 100 కోట్ల మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు దేశాలకు వలస వెళ్ళవచ్చునని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
మరొక ప్రమాదకర సంకేతం ఏమిటంటే రాబోయే తరాలలో వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు మొత్తం జనాభాలో 2 శాతం కన్నా తక్కువే ఉంటారని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వలన ఏర్పడే ఆహార సంక్షోభం ఊహించుకుంటేనే భయం వేస్తుంది.ఈ స్థితిలో ఖచ్చితంగా అంతర్యుద్దాలు మొదలవుతాయి.
నీటి సమస్య..
వ్యవసాయానికి నీరు ప్రధాన వనరు.అయితే భూమిలో సేంద్రీయ పదార్థం తగ్గిపోతే నీటిని శోషణ చేసే సామర్ధ్యం కూడా నేల కోల్పోతుంది. మట్టిలోని సేంద్రీయ పదార్థం దాని బరువులో 90 శాతం వరకు నీటిని పట్టి ఉంచగలదు. ఈ స్థితి ఉన్నప్పుడు అది నీటిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. కరువు పీడిత ప్రాంతాలకు ఇది చాలా సహాయకరంగా ఉంటుంది. అదే మట్టిలో సేంద్రీయ పదార్థం క్షీణిస్తే అది నీటిని గ్రహించలేదు అంతే కాకుండా ప్రవాహాన్ని కూడా నియంత్రించలేదు.దీనివలన నీటి కొరత, కరువులు ఇంకా వరదలకు దారితీస్తుంది. దీని వలన నేలలో తేమ లేకుండా పోతుంది. భూగర్భంలో నీటి నిల్వలు తగ్గిపోతే తాగు నీరు లభించడం కూడా కష్టం అయిపోతుంది. ఒక పక్క సాగు నీరు మరొక పక్క తాగు నీరు సమస్యలకు భూమిలో సేంద్రీయ పదార్థం లేకపోవడమే అని గ్రహించి జాగ్రత్తపడే సమయానికి జరగాల్సిన నష్టం జరిగి పోతుంది. ఈ సమస్య తగ్గించాలి అంటే నేలలో సేంద్రీయ పదార్థాన్ని పెంచాలి. ఒక అంచనా ప్రకారం భూమిలో సేంద్రీయ పదార్థం 5 నుండి 10 శాతంగా ఉన్నప్పుడు దానికి మనం ఇప్పుడు వినియోగించే నీటిలో కేవలం 30 నుండి 40 శాతం నీరు సరిపోతుంది. దీని వలన నీటిని కూడా పొదుపు చేసిన వాళ్ళం అవుతాం. అంతే కాకుండా భూగర్భ జలాలు కూడా సమద్ధిగా లభిస్తాయి. ఎప్పటికి నీటి కొరత అనేది సంభవించదు. అడవిలో నేలపై సేంద్రీయ పదార్థం పుష్కలంగా ఉండబట్టే అక్కడ భూమిలో తేమ అధికంగా ఉండి అక్కడ వక్షాలు ఏపుగా పెరుగుతు ఉన్నాయి.కాబట్టి నీటి సమస్యకు పరిష్కారం కూడా భూమిలో ఉండే సేంద్రీయ పదార్థం తోనే ముడి పడి ఉంది.
జీవనోపాధి సమస్య
ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భూమి క్షీణత వల్ల 74 శాతం మంది పేదలు ప్రత్యక్షంగ ప్రభావిత మవుతున్నారు. పరోక్షంగా కూడా లక్షలాది మంది తమ జీవనోపాధిని కోల్పోవడం జరుగుతుంది. ఈ భూ క్షీణత వలన ప్రపంచానికి ప్రతి ఏటా ఖూవి 10.6 ట్రిలియన్ల వరకు ఖర్చవుతుందని అంచనా.
పంటల తీరులో మార్పు..
భూమి సేద్యం విషయంలో గతానికి ప్రస్తుతానికి పంట సాగు చేసే తీరులో చాలా మార్పులు సంభవించాయి. పూర్వం రైతులు భూమి సేద్యంలో పంట భ్రమణ పద్ధతిని ఉపయోగించే వారు. ఇది నేల తిరిగి పోషకాలను పొందేందుకు, గత నష్టం నుంచి కోలుకోవడానికి దోహదపదేది. ఇందుకోసం రైతులు రెండు వేర్వేరు పంటలను ఎంచుకునేవారు. తద్వారా నేల ఒకే సమయంలో క్షీణించకపోగా అదనంగా దాని పోషకాలను తిరిగి స్వీకరించేందుకు విశ్రాంతి కాలం పొందేది. అయితే ప్రస్తుతం రైతులు మంచి ధర కలిగిన ఏక పంట సాగుకు మొగ్గు చూపడం, దాని అధిక దిగుబడికి విపరీత రసాయనాలు వాడటంతో నేలసారం కోల్పోతుంది.
హరిత విప్లవం ప్రభావం
దీని ప్రభావం వలన భూమి సాగులో మానవ శక్తికి పశు శక్తికి బదులుగా యాంత్రిక శక్తి ప్రాధాన్యత పెరిగి పోయింది. దీనివలన పశువుల వథాలుకు బదులుగా రసాయనాలు క్రిమి సంహారక మందులు వాడకం బాగా పెరిగి పోయింది. ఫలితంగా భూమిపైకి చేరే సేంద్రీయ పదార్థం తగ్గిపోయింది. అంతకన్నా ముఖ్యంగా భూమిని విచక్షణా రహితంగా దున్నడం అనేది కూడా భూ క్షయానికి కారణం అయ్యింది. భూమిని సూర్య తాపం నుండి రక్షించే విధంగా కవర్ క్రాప్ ఉండాలి అది గడ్డి కావచ్చు మరొకటి కావచ్చు. కానీ దున్నిన భూమిపై సూర్య కిరణాలు నేరుగా తాకడం వలన కూడా భూమిలో ఉన్న విలువైన సూక్ష్మ జీవులు అంతరించి పోతున్నాయి.
నేలకు జరుగుతున్న హాని గురించి ఈ రోజే తెరపైకి రాలేదు ఎప్పటి నుండో ఈ విపత్తు గురించి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు ఈ విషయంపై ఎందుకు ఎక్కువ శ్రద్ధ పెట్టడం లేదు అంటే ప్రజల నుండి గట్టి డిమాండ్ లేకపోవడమేనని చెప్పవచ్చు. సాధారణంగా ప్రభుత్వాలు 5 నుండి 6 సంవత్సరాలు పాటు అధికారంలో ఉంటాయి. ఈ సమయంలో ప్రజలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాలను కోరుతాయి తప్ప పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టాలని నేలకు జరిగే హానిని ఆపాలని డిమాండ్ చేయవు. ఒక వేళ పర్యావరణ సంబంధిత డిమాండ్స్ మేరకు ప్రభుత్వాలు పని చేయాలి అంటే ఫలితాలు కోసం దాదాపు 15 నుండి 20 సంవత్సరాలు వేచి చూడాలి. అయితే ప్రజలు కోరిన నిరుద్యోగం మరియు సంక్షేమ పథకాల కల్పన అనే డిమాండ్స్ మాత్రం ఈ 5 లేదా 6 సంవత్సరాలలో పూర్తి చేసి తిరిగి అధికారంలోకి రావడానికి రాజకీయ పక్షాలు ప్రయత్నం చేస్తాయి.దీని కారణంగా ఒక పక్క ప్రజలలో చైతన్యం లేకపోవడం మరొక పక్క స్వల్పకాలిక లక్ష్యాలు పరమవిధిగా ప్రభుత్వాలు పని చేయడం వలన కీలక సమస్య మరుగునపడి పోతుంది. విపత్తు మాత్రం తరుముకు వస్తూనే ఉంది.
మట్టికి జరుగుతున్న ఈ తరహా వాస్తవాలు ఎన్నో మరుగున పడిపోయి ఉన్నవాటిని వెలుగులోనికి తీసుకు వచ్చి బాధ్యత గల ఒక పౌరునిగా తన వంతు బాధ్యతను నిర్వర్తించే ఉద్దేశ్యంతో ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సద్గురు ప్రారంభించిన ప్రపంచ ఉద్యమమే 'సేవ్ సాయిల్'. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ఈ ఉద్యమాన్ని మార్గ దర్శనం చేస్తున్నారు. మొన్నటి వరకు నదుల పునరుజ్జీవనం కోసం పోరాడిన ఆయన 65 సంవత్సరాల వయసులో కూడా బైక్‌పై 100 రోజులు పాటు విభిన్న భౌగోళిక పరిస్థితులు శీతోష్ణ పరిస్థితులు గల 24 దేశాలు కవర్ చేస్తూ మార్చి 21 లండన్ నుండి మట్టిని రక్షించు పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అయితే సద్గురు ఈ ఉద్యమాన్ని రాత్రికి రాత్రి పట్టాలు ఎక్కించలేదు. గత 20 సంవత్సరాలు పైబడి మట్టిలో వస్తున్న మార్పులు దాని విషయంలో శాస్త్రవేత్తలతో చర్చలు, అంతర్జాతీయ పరిశోధనా సంస్థల అభిప్రాయాలు, క్షేత్ర స్థాయిలో భూ క్షీణత ఏర్పడి పంటల దిగుబడిలో వస్తున్న మార్పు, భూ క్షీణత వలన అంతరించి పోతున్న సూక్ష్మ జీవులు. భావితరాలు వారు ఎదుర్కొనే సమస్యలు. ఆహార సమస్య. జీవ వైవిధ్యంలో ఏర్పడే అసమతౌల్యం. ఇవన్నీ సద్గురును ఎక్కువ ఆలోచింప చేశాయి. సమస్య చెప్పడం సులభమే కానీ ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపడం చెప్పినంత సులభం కాదు. అందుకే సద్గురు ఈ సమస్య అనేది ఒక ప్రాంతం ఒక దేశానిది కాదంటూ ప్రతీ ఒక్కరూ ప్రతీ దేశం ఈ ఉద్యమంలో కలసి పాల్గొనాల్సిన ఆవశ్యకత వివరించి కార్యాచరణ అమలులోకి తీసుకు వచ్చారు. మట్టి క్షీణత వలన ఏర్పడబోయే ప్రపంచ విపత్తుపై పోరాటానికి ఒక అద్భుత ప్రపంచ ఉద్యమాన్ని రూప కల్పన చేశారు. 192 దేశాల్లో భూమి దెబ్బతినకుండా అవసరమై విధానాలను రూపొందించడానికి ఈ ఉద్యమం ఒత్తిడి తీసుకు రావాలని, ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మందిలో ఈ ఉద్యమం మార్పు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని బైక్ యాత్ర కొనసాగిస్తున్నారు.
సద్గురు ప్రకారం ఈ సమస్యకు పరిష్కారం కేవలం మనం ఒకటో రెండో మొక్కలు నాటితే సరిపోదు. దీనికి పూర్తి పరిష్కారం రైతుల చేతుల్లో ఉంది.అంటే ప్రతీ రైతు తాను సేద్యం చేస్తూ ఉన్న భూమిలో 10 శాతం భూమిలో మొక్కలు చెట్లు పెంచాలి అంటే మొత్తం భూమిలో 90 శాతం మాత్రమే సేద్యం చేయాలి .10 శాతం నీడ వలన భూమి జీవం వద్ది చెందతుంది. మొక్కల చెట్ల వథాలు భూమిపై పొరపై పడి సేంద్రియ పదార్థం ఏర్పడటానికి సహకరిస్తుంది. అయితే ఇది అందరు రైతులు పాటించాలి అంటే ప్రభుత్వం ఒక ఖచ్చితమైన ఒక పాలసీ రూపొందించాలి. అలా కానప్పుడు అది ఒక సిద్ధాంతంగా ఒక నినాదంగా మాత్రమే మిగిలి పోయి భూమి క్షీణత యధావిధిగా కొనసాగుతుంది. రైతులందరూ దీనిని పాటించాలి అంటే రైతులు కోల్పోయిన 10 శాతం భూమికి ప్రభుత్వం రైతులకు సబ్సిడీల ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకుర్చాలి.అంతే కాదు ప్రస్తుతం ప్రజలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్గానిక్ ఉత్పత్తులపై మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం రైతులకు సహకరిస్తే కాల క్రమేణా సేంద్రీయ వ్యవసాయం వద్ధి చెంది రైతుల ఉత్పత్తి వ్యయం తగ్గి అందరూ లాభదాయక సేంద్రీయ సాగు వైపు మొగ్గు చూపుతారు. అయితే ఈ పరిణామం రాత్రికి రాత్రి జరిగేది కాదు.ఎందుకంటే ప్రస్తుత రసాయనాల సేద్యం ఒక్కసారిగా నిలుపుదల చేయలేము సేంద్రీయ సేద్యం పెంచుతూ రసాయనాల సేద్యం తగ్గించుకుంటూ రావాలి. లేకపోతే శ్రీలంక వంటి పరిస్థితులు మనకు కూడా ఎదురవుతాయి. దీనికి ప్రభుత్వాలు విధాన పరంగా చిత్త శుద్ధితో ముందుకు రావాలి. దానికి ప్రజల వైపు నుంచి డిమాండ్ ఉండాలి అప్పుడే అది సాకారం అవుతుంది అని సద్గురు బలమైన నమ్మకం. ఇదే లక్ష్యంతో తన యాత్రలో విభిన్న దేశాధి పతులను శాస్త్రవేత్తలను కలుస్తూ తన ఉద్యమానికి సహకరించాలని కోరుతున్నారు. ప్రతీ దేశం ఈ యజ్ఞానికి సహకరిస్తామని అంగీకారం తెలుపుతూ ఉన్నాయి మనం ఎంత ఉన్నత విద్యావంతులం అయినప్పటికీ నేలను పునరుద్ధరించ లేకపోతే మన పిల్లలు మన భావి తరాలు మనుగడ సాధించలేరు అనే సత్యాన్ని గుర్తెరిగి ఈ ఉద్యమాన్ని విస్తతంగా చేసి నేల తల్లిని కాపాడుకుందాం అంటూ ప్రపంచ జనాభాకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి స్పందించి ఈ ఉద్యమానికి ప్రిమటాలాజిస్ట్ జేన్ గూడాల్, ఆధ్మాత్మికవేత్త దలైలామా, బిజినెస్ టైకూన్ మార్క్ బెనియోఫ్ వంటి ప్రపంచ ప్రముఖులతో పాటు యునైటెడ్ నేషన్స్, కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం, యునైటెడ్ నేషన్స్ ఫుడ్ డ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు మద్దతు ప్రకటించడం జరిగింది. భారత దేశంలో కూడా రాజకీయ నాయకులు, పర్యావరణ వేత్తలు సినీ ప్రముఖులు కూడా మద్దతు ఇస్తున్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తతంగా వ్యాప్తి చెందుతున్న నేటి కాలంలో దానిని ఉపయోగించుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ఈ మట్టి క్షీణతను అరికట్టే విషయంలో ప్రతీ ఒక్కరూ వాస్తవాలను ప్రచారం చేయాలని సద్గురు కోరుతున్నారు. మనం కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావడమే కాకుండా మనకు తెలిసిన వారిని కూడా భాగస్వాములను చేద్దాం. ఒక మంచి పని చేశాం అన్న ఆత్మ సంతప్తిని మూట కట్టుకుందాం. మన మనుగడకు మూలమైన నేల తల్లి ఋణం తీర్చుకుందాం.
- రుద్రరాజు శ్రీనివాసరాజు,
9441239578