Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నైజీరియా
నైజీరియాకు చెందిన మహిళా చెఫ్ హిల్దా బాసి ఏకంగా 100 గంటలపాటు వంట చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతకుముందు భారత చెఫ్ లతా ఠాండన్ 2019లో నమోదుచేసిన 87 గంటల 45 నిమిషాల రికార్డును ఈమె బద్దలుకొట్టింది. గత గురువారం ప్రారంభించిన వంట లండన్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.45కు పూర్తయింది. వాణిజ్య నగరమైన లాగోస్‌లోని లెక్కి ప్రాంతంలో బాసి ఈ సాహసం చేసింది. నైజీరియా ప్రత్యేక వంటకాలైన సూప్‌లు, టొమాటో రైస్ వంటి పలు డిష్‌లను తయారు చేసింది. 12 గంటలు నాన్‌స్టాప్ వంట చేసి.. గంటసేపు విశ్రాంతి తీసుకునేది. ఆ గంట సమయంలోనే స్నానం, వైద్య పరీక్షలు పూర్తి చేసుకునేది. ఈమె ప్రయత్నాన్ని చూసేందుకు వేలాదిమంది లెక్కి ప్రాంతానికి తరలివచ్చారు. పాటలు పాడుతూ ప్రోత్సహించారు. ఆన్లైన్లో ఆమె వంటల కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేశారు. రికార్డు నెలకొల్పగానే నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ సైతం బాసిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. సంబంధిత ఆధారాలను పరిశీలించాక అధికారికంగా హిల్దా బాసి రికార్డును ప్రకటిస్తామని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తెలిపింది. ఆఫ్రికన్ మహిళలకు సంఘీభావంగా ఈ పని చేసినట్లు బాసి వివరించారు.