Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలయ పాలనపై అ'టెన్షన్'
- ప్రక్షాళనకు పూనుకున్న నూతన ఈవో
- సత్ఫలితాలు ఇస్తున్న నూతన సంస్కరణలు
- దిద్దుబాటు చర్యలతో మింగుడు పడని కొందరి ఉద్యోగులు
- ఈవో మార్పు కోరుతూ పైరవీలు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణ అధికారిగా ఎల్.రమాదేవి బాధ్యతలు స్వీకరించాక ఆలయ ఆలనా పాలనలో పెను మార్పులు సంభవించాయి. దిద్దుబాటు చర్యలకు ఈవో పూనుకోవడంతో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చాలా ఏళ్లుగా దేవస్థానంలో సరైన ఆలనా పాలన కొరవడటంతో ఆలయానికి చెందిన కొందరు ఉద్యోగులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగిపోయింది. ఇటీవల నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఎల్.రమాదేవి పాలనపై పూర్తి దృష్టి సారించి ముందుకు దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు ఉద్యోగుల అలసత్వం, అక్రమాలు, ఆలయానికి జరుగుతున్న నష్టం తెరపైకి వస్తుండడంతో ఈవో దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నారు. ఇది నచ్చని కొందరు ఉద్యోగులకు ఈఓ ప్రక్షాళన చర్యలు మింగుడు పడటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆలయంలో ఇటీవల ఉద్యోగుల అంతర్గత బదిలీలు జరిగాయి. ఆలయంలోని ఏఈవోలు ఇప్పటివరకు చూస్తున్న వివిధ బాధ్యతలను పూర్తిగా మార్పు చేశారు. వారానికి ఒకసారి వివిధ పనులను, రికార్డుల మెయింటెనెన్స్, వివిధ రకాల వస్తువులు తనిఖీ చేయడానికి నూతన కమిటీలను కూడా నియమించారు. ఔట్సోర్సింగ్ ఎంప్లాయిల బాధ్యతలు కూడా 15 రోజులకు ఒకసారి మార్పు చేసేలా చర్యలు తీసుకున్నారు. కళ్యాణ కట్టపై పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కళ్యాణ కట్టలో కొందరు భక్తుల వద్ద నుంచి అధిక రేట్లు వసూలు చేస్తున్నట్లు ఈవో దృష్టికి వచ్చినట్లు సమాచారం. అందుకే అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. లడ్డూల తయారీలో కూడా నాణ్యత ఉండేలా చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. సీఆర్వో వ్యవస్థలో కూడా కొన్ని అవకతవకలు చోటు చేసుకున్నాయి అన్న అనేక విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. కాటేజీ నిర్వహణ లోప భూష్టంగా మారిందన్న విషయం ఈవో పసిగట్టినట్లు సమాచారం. అసలు ఇక్కడ మూడేళ్లుగా గుమస్తానే లేకుండా నిర్వహణ సాగిందన్న ప్రచారం ఉంది. ప్రచార శాఖలో కూడా కొన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న అంశం వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఇలా ఆలయ ఆలనా పాలన గాడి తప్పడంతో రాముని ఆదాయానికి భారీగా గండి పడుతున్నట్లు తెలుస్తోంది. అనేక అంశాలను ఈవో పరిశీలించిన తర్వాత దిద్దుబాటు చర్యకు ఉపక్రమించి తనదైన శైలిలో ఆలయ అభివృద్ధికి ఈవో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. తమ తమ వ్యక్తిగత ఆదాయాలకు గండి పడుతోందన్న ఆలోచనతో కొందరు తెగ మధన పడుతున్నట్లు సమాచారం. తమకున్న పలుకుబడితో కొందరి సహకారంతో ఎలాగైనా నూతన ఈవోని ఇక్కడి నుంచి పంపించేందుకు చాప కింద నీరులా తమ ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నూతన ఈవో ఆలయ ఆదాయంపై కూడా దృష్టి సారించి...పలు రకాల సేవలను కూడా తెరపైకి తీసుకువచ్చారు. వేద ఆశీర్వచనం, తలంబ్రాల సేవ ద్వారా ఆలయానికి ఆదాయం చేకూరుతోంది. ఏడు రకాల సేవ లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తద్వారా ఆలయానికి ఆదాయం సమకూరి భక్తులకు మరిన్ని సేవ లందించే అవకాశం ఉంది. ఏదేమైనా నూతన ఈవో ఆల యం ఉద్యోగుల దిద్దుబాటు చర్యలపై సర్వత్ర చర్చనీయా ంసంగా మారింది. ఇన్నాళ్లకైనా ఆలయ అభివృద్ధి గాడిలో పడుతుందన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.