Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి
- 29న హైదరాబాద్‌లో జరిగే ధర్నాను జయప్రదం చేయాలి
- ఐలూ జిల్లా కమిటీ పిలుపు
నవతెలంగాణ-కొత్తగూడెం
2019 నుండి న్యాయవాద వృత్తిలోకి వచ్చిన వారందరికీ కూడా హెల్త్ కార్డులు జారీ చేయాలని, ప్రస్తుతం చెల్లిస్తున్న భీమా పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచాలని, ప్రసూతి ఖర్చులను హెల్త్ కార్డులో చేర్చాలని, వయోపరిమితితో నిమిత్తం లేకుండా న్యాయవాదులందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని, హెల్త్ స్కీమ్ న్యాయవాదుల తల్లిదండ్రులకు కూడా వర్తింపజేయాలని, అన్ని జిల్లా కేంద్రాలలో ఉన్న ప్రధాన ఆసుపత్రులను నెట్వర్క్ లిస్ట్‌లో చేర్చాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29న ఇందిరా పార్కు వద్ద జరుగనున్న ధర్నాను జయప్రదం చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పిలుపు నిచ్చింది. సోమవారం యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.ప్రసాదరావు అధ్యక్షతన, సీనియర్ న్యాయవాది జె. శివరాం ప్రసాద్ కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వివిధ తీర్మానాలు ఆమోదించారు. న్యాయవాదులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, జూన్ నెల మూడవ వారంలో భువనగిరిలో జరగనున్న ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తృతీయ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని తీర్మానించారు.
హైదరాబాద్‌లో జరిగే ధర్నా సందర్బంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర బాధ్యులు ప్రభుత్వ అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించి, చర్చలు జరుపుతారని తెలిపారు. జిలా కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్ ఎజెండా ప్రతిపాదించగా, జిల్లా కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కిలారు పురుషోత్తం, పి.కిషన్ రావు, కె.పుల్లయ్య, సాదిక్ పాషా, గడిదేశి కాంతయ్య, జి.కె.అన్నపూర్ణ, రావిలాల రామారావు, దూదిపాల రవి కుమార్, అరకల కరుణాకర్, అరికాల రవి కుమార్, మేదరమెట్ల శ్రీనివాస రావు, పోశం భాస్కర్ రావు, పాయం రవి వర్మ, ఉప్పుతోళ్ల గౌతమ్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.