Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరాటౌన్
స్థానిక మధు విద్యాలయంలో వార్షిక బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యా ప్రగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైరా మండల తాహసీల్దార్ అరుణ కుమారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను, మధు విద్యాసంస్థల గొప్పతనాన్ని కొనియాడారు. మధు విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి వీరభద్రరావు మాట్లాడుతూ మధు విద్యాలయం 40 సంవత్సరాల ప్రస్థానంలో సాధించిన విజయాలను, ప్రగతిని, ఆశయాలను వివరించారు. కరస్పాండెంట్ మల్లెంపాటి రంజిత్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మధు విద్యాలయంలో తీసుకువచ్చిన ఆధునిక పద్ధతులు, మార్పులు, నూతన విద్యా ప్రణాళికను విద్యార్థినీ, విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధు విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి వీరభద్రరావు, ఉపాధ్యక్షులు మల్లెంపాటి ప్రసాదరావు, కరస్పాండెంట్ మల్లెంపాటి రంజిత్, కోశాధికారి మల్లెంపాటి నర్మదా, అధ్యాపకులు వెంకట రమణాచారి, రాంబాబు, రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.