Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ పురవీధుల్లో మహా ప్రదర్శన
- వేలాదిగా హాజరైన ఆదివాసీలు
- ఆదివాసి పదం మన చరిత్ర ఆనవాళ్లు
- ఆదివాసీ హక్కులపై దాడి : బృందా కారత్
- టిఏజిఎస్ భారీ బహిరంగ సభ సక్సెస్
నవతెలంగాణ - భద్రాచలం :
భద్రాద్రి పురవీధుల్లో 'ఆదివాసి దండు' కదం తొక్కింది. చీమల బారుల్లా ఆదివాసి మహా ప్రదర్శన సాగింది. కొమ్ము నృత్యాలు అబ్బురపరిచాయి. ఎక్కుపెట్టిన సాంప్రదాయ విల్లంబులు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల ఆదివాసీ సంస్కృతి ఉట్టి పడింది. అడవి అందాలు పుణ్య క్షేత్రంలో విరబూశాయా అన్న సందంగా స్థానికుల్లో సంబ్రమాశ్చర్యాలు వ్యక్తం అయ్యాయి. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టిఏజిఎస్) 3వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం భద్రాచలం పట్టణంలో నిర్వహించిన ఆదివాసి మహా ప్రదర్శన బ్రహ్మాండంగా సాగింది. రాష్ట్ర నలుమూలల వివిధ ఆదివాసి ప్రాంతాల నుంచి ఆదివాసీలు భద్రాచలం వచ్చి ఈ మహా ప్రదర్శనలో పాల్గొన్నారు. స్థానిక బ్రిడ్జి సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ మహా ప్రదర్శన భద్రాచలం పట్టణంలోని యూబీ సెంటర్, పాత ఎల్ఐసి సెంటర్ మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం వరకు సాగింది. ప్రదర్శన సందర్భంగా ఆదివాసీలు తమ సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేశారు. కొమ్ము, కోలాట నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విల్లు ఎక్కు పెట్టి సాంప్రదాయ బద్ధంగా సాగిన అడుగులు స్థానికులను అబ్బురపరిచాయి. పట్టణ పురవీధుల్లో ఆదివాసీల అపురూప జెండా రెపరెపలాడింది. జై ఆదివాసి అంటూ... భద్రాద్రి పురవీధులు మారు మ్రోగేలా నినాదాలు చేశారు. ఈ ఆదివాసీ మహా ప్రదర్శనలో ఆధ్యంతం ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకరాలు, మాజీ ఎంపీ బృందా కారత్ పాల్గొన్నారు.
ఆదివాసీ పదం మన చరిత్ర ఆనవాళ్లు... ఆదివాసి హక్కులపై దాడి : బృందా కారత్
ఆదివాసిపదం అంటనే మోడీకి భయం అని, ఆదివాసి హక్కులపై బీజేపీ దాడి చేస్తోందని ఆదివాసులను వనవాసిలు అని ఆర్.ఎస్.ఎస్, బీజేపీ ప్రచారం చేస్తోందని, ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకారత్ పేర్కొన్నారు. భద్రాచలంలో టిఏజిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మూడవ మహాసభలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఆదివాసులు వనవాసులు కాదు అని బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ గ్రహించాలన్నారు. ఆదివాసి అనే పదమే మన చరిత్రకు ఆనవాళ్లు ఉన్నారు. ఆర్.ఎస్. ఎస్ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదని, ఆర్ఎస్ఎస్ వారికి లొంగిపోయిందన్నారు. కానీ ఆనాడు ఆదివాసులు బ్రిటీస్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఆదివాసి చట్టాలపై బీజేపీ దాడిచేస్తుందని,అటవి సంరక్షణ చట్టానికి కేంద్ర బీజేపీ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. గ్రామసభల అనుమతి లేకుండా చట్టాన్ని మార్పు చేస్తోందని ఆరోపించారు. ఆదివాసులు సంస్కృతిని మనువాద హిందుత్వ సిద్దాంతం హైజాక్ చేస్తోందన్నారు. ఆదివాసీ పండుగలు, జీవన విధానంపై సైతం దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించి వేయటం పట్ల, బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్నారు. ఆదివాసీ హక్కులపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించే వారిమద్దతును ఆదివాసులు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంది మంచిది కానీ, రాష్ట్రంలో పోడుభూములకు హక్కులు కల్పించాలని కోరారు. ఆదివాసులకు చదువుకునే సౌకర్యాలు కల్పించాలని,ఆదివాసి అభివద్ధికి నిధులు ఇవ్వాలని,ఆదివాసి యువతీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఆంధ్రాలో కలిపిన భద్రాచలంకు చెందిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు పోడు పట్టాలు అందే వరకు పోరాటం ఆగదు అన్నారు. పొత్తు పొత్తే పోరాటం పోరాటమే అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాడుతున్నాడని అందుకే సమర్థిస్తున్నట్లు తెలిపారు. పోడు పట్టాల విషయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఎవరినైనా ఎదిరిస్తామన్నారు. సభాధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్ మీడియా బాబురావు మాట్లాడుతూ...తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభల్లో ఆదివాసీల అభివద్ధికి అనేక తీర్మానాలు చేసి...దశలవారీ పోరాటాలను రూపకల్పన చేస్తామని వెల్లడించారు. ఆదివాసీల అభివృద్ధికి శక్తివంచన మేర కృషి చేస్తామని తెలిపారు. టిఏజిఎస్ రాష్ట్ర నాయకులు కారం పుల్లయ్య మాట్లాడుతూ... భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధిలో మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి, సున్నం రాజయ్య, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు చేసిన సేవలను గుర్తు చేశారు. ఆదివాసీ హక్కులకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే పోరాటాలే శరణ్యమని గుర్తు చేశారు. టిఏజిఎస్ రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్ మాట్లాడుతూ... తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర మహాసభల ఉద్దేశాన్ని వివరించారు. గిరిజనుల పక్షాన పోరాడింది టిఏజిఎస్ అని గుర్తు చేశారు. ఆదివాసీల పక్షాన ఆది నుంచి టిఏజిఎస్ నిలబడిందని అన్నారు. టిఏజిఎస్ రాష్ట్ర కార్యదర్శి తోడసం భీంరావు, ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, టిఏజిఎస్ రాష్ట్ర నాయకులు పి సోమయ్య, ఆహ్వాన సంఘం అధ్యక్షులు పాయం రవివర్మ, టిఐజిఎస్ జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అన్నవరపు కనకయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.జే రమేష్, రైతు సంఘం నాయకులు ఎలమంచిలి రవికుమార్, టిఏజిఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి దుగ్గి కృష్ణ, దబ్బకట్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా టిఐజిఎస్ రాష్ట్ర మూడవ మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీలు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం నిండిపోయింది. ఈ సందర్భంగా ఆదివాసీల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.