Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దోషులకు కొమ్ము కాస్తున్నారు
- మానవ హక్కులకు భంగం కలుగుతోంది
- రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు
- నివేదికలో అమెరికా విదేశాంగ శాఖ ఆందోళన
న్యూఢిల్లీ : భారత్‌లో క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, హిందూ దళితులు సహా మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు 'అంతర్జాతీయ మత స్వేచ్ఛ'పై సోమవారం ఒక నివేదిక విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 22న అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో విడుదలైన ఈ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. నివేదికలో ప్రస్తావించిన విషయాలు తనను నిరాశకు గురి చేశాయని అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
భారత్‌లో మానవ హక్కుల పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని, అక్కడ పెద్ద ఎత్తున మైనారిటీలను హతమారుస్తున్నారని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆ అధికారి చెప్పారు. మైనారిటీలపై మూకుమ్మడి హత్యాకాండ జరుగుతున్న 162 దేశాలలో భారత్ ఎనిమిదో స్థానంలో ఉందని ఆయన వివరించారు. ముస్లింలను ఊచకోత కోయాలని, హింసించాలని బాహాటంగానే పిలుపు ఇస్తున్నారని, తద్వారా హింసను ప్రేరేపిస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రార్థనా స్థలాలపై దాడులు, నివాసాల కూల్చివేత వంటి ఘటనలను ప్రస్తావించింది. మైనారిటీలపై దాడులు చేసిన దుండగులను కాపాడుతున్నారని, కొన్ని సందర్భాలలో క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారని తెలిపింది.
2002లో బిల్కిస్ బానోపై జరిగిన లైంగిక దాడి కేసులో యావజ్జీవ శిక్ష పడిన 11 మంది ముద్దాయిలు పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును గుజరాత్ ప్రభుత్వం గత ఆగస్ట్ 15న ఆమోదించింది. జైలులో వారి ప్రవర్తన బాగా ఉందన్న కుంటిసాకు చూపి వారిని విడుదల చేశారు. ఇదే విషయాన్ని గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. లైంగిక దాడి చేసిన వారిలో ఒకరు పెరోల్‌పై బయటికి వచ్చి ప్రతీకార దాడికి పాల్పడ్డాడంటూ అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ ఘటనను అమెరికా విదేశాంగ శాఖ తన నివేదికలో ప్రస్తావించింది.
మతపరమైన వస్త్రధారణపై ఆంక్షలు విధించడాన్ని కూడా నివేదిక ఎత్తిచూపింది. కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం గత సంవత్సరం ఫిబ్రవరి ఐదున హిజాబ్ ధారణపై నిషేధం విధించడాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. హిజాబ్‌ను ధరించడం సమానత్వం, సమగ్రతలకు భంగకరమని ప్రభుత్వం వాదించింది. హిజాబ్ ధరించి విద్యా సంస్థలకు హాజరైన విద్యార్థులకు అనుమతి నిరాకరించారు. బీజేపీ మాజీ సభ్యులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ టీవీలో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత భారత్‌లోని పలు ప్రాంతాలలో చోటుచేసుకున్న హింసాత్మక నిరసన ప్రదర్శనలను కూడా నివేదికలో వివరించారు. బీజేపీ సభ్యుల వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్, ప్రభుత్వ అధికారులు ఖండించిన తర్వాత వారిని బీజేపీ బహిష్కరించింది.
చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వ అధికారులే గత సంవత్సరం పలు రాష్ట్రాలలో మైనారిటీలపై హింసకు పాల్పడ్డారని నివేదిక తెలిపింది. గత అక్టోబరులో జరిగిన పండుగ సందర్భంగా హిందూ భక్తులను గాయపరిచారని ఆరోపిస్తూ సివిల్ దుస్తులు ధరించిన గుజరాత్ పోలీసులు నలుగురు ముస్లింలను కొరడాలతో కొట్టారని పేర్కొంది. భారత్‌లో నెలకొన్న పరిస్థితిపై మానవ హక్కుల సంస్థలు సహా అంతర్జాతీయ సమాజం దృష్టి సారించిందని చెప్పింది.
'భారత్‌లో పరిస్థితిపై మేము మా సహచరులతో నేరుగా మాట్లాడాము. హింసను ఖండించాలని, హింసకు బాధ్యులైన దుండగులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పౌర సమాజ సహచరులతో కలిసి పని చేస్తున్నాము. హింసకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్న పాత్రికేయులతో కూడా మాట్లాడుతున్నాం' అని విదేశాంగ శాఖ అధికారి చెప్పారు. 2021లో కూడా భారత్‌లో మైనారిటీలపై జరుగుతున్న హింసపై అమెరికా విదేశాంగ శాఖనివేదిక విడుదల చేయటం గమనార్హం.