Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాండూరు మండలంలో 300 ఎకరాల్లో సాగు
- రూ 3. వేల నుంచి రూ. 700.వందలకు పడిపోయిన ధర
- పంట కోసినా విక్రయానికి నిరాకరణ
- పెట్టుబడి సైతం వచ్చేటట్టు లేదని ఆందోళన చెందుతున్న రైతులు
నవతెలంగాణ-తాండూరు రూరల్
తాండూరు మండలం గుంత బాసుపల్లి, మిట్ట బాసుపల్లి, ఐనెల్లి, కోటబాస్పల్లిలో తదితర గ్రామాలో సుమారు 300 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. అయితే ఈసారి ఉల్లి దిగుబడి బాగానే వచ్చినప్పటికీ మార్కెట్లో ఒక్కసారిగా రేటు పడిపోయింది. ఇప్పటి వరకు సుమారు 150 ఎకరాల్లో పంట కోశారు. గతవారం క్విం టాల్ రూ. మూడు వేలు పలికిన ఉల్లి ప్రస్తుతం ఏడు వందలకు పడిపోయింది. ఎకరా ఉల్లి సాగు చేయడానికి సుమారు రూ. పది వేల నుంచి రూ. 15వేల వరకు ఖర్చు అవుతోంది. అప్పు చేసి మరీ పంట సాగు చేసిన రైతులకు ఇప్పుడు ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. చేనుల్లో ఉల్లిని కోసినప్పటికి గిట్టుబాటు ధర లేకపోవడంతో విక్రయించడానికి రైతులు విముఖత చూపుతున్నారు. దీంతో కోసిన ఉల్లి మొత్తం పంట చేనులోనే ఉంది. అయితే మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎక్కువ మొత్తంలో మార్కెట్కు రావడంతోనే ఉల్లి ధర పడిపోయిందని పలువురు రైతులు చెబుతున్నారు. ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించి తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ఉల్లి రైతులు కోతున్నారు.
రెండెకరాల్లో ఉల్లిసాగు చేశా
రెండెకరాల్లో ఉల్లి పంట సాగు చేశా. రూ. 30వేల పెట్టుబడి అయింది. పంట దిగుబడి వచ్చేసారికి ధర మొత్తం పడిపోయింది. క్వింటాల్ మూడు వేల రూపాయాలు పలికితేనే గిట్టుబాటు వస్తుంది. అలాంటిది రూ. 700లకు పడిపోయింది. ఇప్పుడు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే మమ్మల్నీ ఆదుకోవాలి.
- రైతు మారుతి