Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాగ్రికి భద్రత కరువు
- ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఇబ్బందులు
- నిద్రలేమీతో అనారోగ్యాపాలు
- షాబాద్ బస్‌స్టాండ్‌లో విశ్రాంతి గదిలేక
- నైట్ హాల్ట్ సిబ్బందికి ఇబ్బందులు
నవతెలంగాణ-షాబాద్
ఆర్టీసీ సర్వీసులు గ్రామీణ ప్రాంతాల్లో నైట్‌హాల్ట్ చేసే సిబ్బంది పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. బస్‌స్టాండ్ ఒక బస్సు డిపో పరిధిలో ఉంటే, అక్కడి వచ్చే సర్వీసులు మరో డిపోకి చెందినవి ఉండటంతో రాత్రి సమయంలో బస చేయాల్సిన ప్రాంతంలో షెల్టర్లు లేక సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. షాబాద్ మండల కేంద్రంలో షాద్‌నగర్ డిపో పరిధిలోని బసుస్టాండ్ ఉంది. ఈ బస్సుస్టాండ్ నైట్హాల్డ్ చేసేందుకు రాజేంద్రనగర్ డిపోకు చెందిన మూడు సర్వీసుల సిబ్బంది, ఆరుగురు షాబాద్ బస్సు స్టేజీలో నైట్‌హాల్ట్ చేస్తారు. వారికి రెస్టు రూం లేక పోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. డ్రైవర్, కండకర్ల వద్ద సుమారు రూ.20 వేల వరకూ నగదు, టికెట్ మిషన్లు, ఫోన్ల ఇతర సామగ్రికి భద్రత లేకుండా పోతోందని వారు వాపోతున్నారు. ఈ మధ్య ఓ కార్మికుని రూ.23 వేల ఫోను దుండగలు ఎత్తుకెళ్లారు. రాత్రి బస చేయాలనుకున్నా, దోమలు, పందులతో బస్సుస్టాండ్‌లో రాత్రి మొత్తం జాగారం చేయాల్సి వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై పై అధికారులను అడిగితే ఉద్యోగం మానేస్తావా...? మరో రూటు వెళుతావా? అంటున్నారు కానీ, తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో నిద్ర లేకపోయినా, ఉదయం విధులు నిర్వహిస్తున్నామనీ, దీంతో ఆనారోగ్యానికి గురవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
అధికారికంగా మా దృష్టికి రాలేదు
అధికారికంగా తమ దృష్టికి ఎవ్వరూ తీసుకురాలేదు. షాద్‌నగర్ డిపోకు చెందిన బస్సులు ఏవీ షాబాద్‌లో నైట్ హాల్ట్ చేయడం లేదు. వేరే డిపోకు చెందిన సర్వీసులు నైట్ హాల్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫోన్లో చెప్పడం తప్పితే తమకు రాత పూర్వకంగా ఎవ్వరు ఇవ్వలేదు. ఏ డిపో సర్వీసులు నైట్‌హాల్ట్ చేస్తుంటే వారి సిబ్బందికి ఆయా డిపో అధికారులు ఉండడానికి ఏర్పాట్లు చేయాలి. తమకు ఫోన్ చేసి సంప్రదించినా, కంట్రోలర్ రూం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాను.
- షాద్‌నగర్ డిపో మేనేజర్