Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కసారిగా పెరిగిన ధరలు
- గుడ్ల ధరలు తక్కువగా ఉండటంతో కాస్తా ఉపశమనం
చికెన్ కోసం ఇంటి నుంచి వెళ్లి ధర చూసి అవ్వాకవుతున్నారు. దీంతో చికెన్‌కు బదులు గుడ్లు కొనుగోలు చేస్తున్నారు. కరోనాతో పడిపోయిన చికెన్ ధరలు ఇప్పుడు రోజురోజుకు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆదివారం వచ్చిందంటే వామ్మో అనే పరిస్థితి ఏర్పడింది. గతేడాది లాక్డౌన్ ప్రకటించిన మొదట్లో చికెన్ కేజీ ధర రూ. 50కి పడిపోగా, అది పెరిగి పెరిగి రూ. 100కి వచ్చింది. ఇప్పుడు ఏకంగా రూ. 270 వరకు పలుకుతుండటంతో సామాన్య ప్రజలు చికెన్ కొనాలంటే భయపడిపోతున్నారు.
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ఆదివారం వచ్చిదంటే..చికెన్, మటన్, గుడ్లు, చేపలు ఇలా ఏదో ఒక్కటి ఉండాల్సిందే. మటన్ ధర ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలు చికెన్ అయిన తీసుకుందామంటే ఇప్పుడు కోడి కొండెక్కి కూర్చుంది. గతేడాది మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత చికెన్ ధరలు ఒక్కసారిగా పూర్తిగా పడిపోయాయి. చికెన్ తింటే కరోనా వస్తోందని ద్రూష్పచరంతో ధరలపై పూర్తి ప్రభావం పడింది. దీంతో చికెన్ ధర అప్పుడు ఒక్కసారిగా రూ. 50కి పడిపోయింది. వికారాబాద్ జిల్లాలో కొన్ని మండలాల్లో కోళ్ల ఫారంలోనే పెద్ద ఎత్తున్న కోళ్లుమృత్యువాత పడటంతో పొలాలు, గుట్టల్లో పూడ్చిపెట్టారు. దీంతో వ్యాపారులు, కోళ్ల ఫారం యజమానులు తీవ్రంగా నష్టాలపాలయ్యారు. కొన్ని చోట్ల విక్రయాలు లేకపోవడంతో గ్రామాల్లో ఉచితంగా కోళ్లను పంపిణీ చేశారు. రాను రాను పలు అవగాహన కార్యక్రమాలతో చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదే అని నిపుణులు సూచించడంతో చికెన్ కోసం పరుగులు పెట్టారు. అప్పుడు కాస్తా చికెన్ రూ. 100కి చేరుకుంది. నెల క్రితం రూ. 210లోపు ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ. 270వరకు ధర పలుకుతుంది. మరోవైపు మటన్ ధరలు సైతం రూ. 800పైగా పలుకుతుంది. అయితే చికెన్ ధరలు ఇంకాస్తా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. చికెన్ ధరలు ఎక్కువగా పెరగడంతో ప్రజల నుంచి స్పందన తక్కువగా ఉందని దుకాణాదారులు చెబుతున్నారు.
ఊరటనిస్తున్న గుడ్ల ధరలు
కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో చికెన్, గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్ల ధరలు పెరగకపోవడంతో ప్రజలు ఊపిరి పిల్చుకుంటున్నారు. నెల కింద డజన్ రూ. 60 ఉండగా..ఇప్పుడు సైతం అంతే ఉంది.
పడిపోయిన ఉత్పత్తి
కరోనా ప్రభావంతో చికెన్ ధరలు పడిపోవడంతో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఆ ప్రభావం ఇప్పుడు ధరలు పడిందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే చికెన్ ధరలు ఇంకాస్తా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.