Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పల్లె చెరువు, ఎర్రగుంట, అప్ప చెరువులను పూర్తిస్థాయిలో సుందరీకరణ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం తన చాంబర్లో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని చెరువులపైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇరిగేషన్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలో కురిసిన వర్షాలకు పల్లె చెరువు, అప్ప చెరువులు గండి పడటంతో ప్రాణనష్టం, భారీగా ఆస్తి నష్టం సంభవించిందని మంత్రి తెలిపారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చెరువు కట్టలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలన్నారు. అదేవిధంగా చెరువుల వద్ద అహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ చెరువులు కబ్జాలకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. సుందరీకరణ పనులను, వాకింగ్ ట్రాక్ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.