Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాస్కు, భౌతిక దూరం పాటిస్తేనే రక్షణ
- రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
- కరోనా కట్టడి చర్యలకు సీఎస్ ఆదేశం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రెండో దశ కరోనా స్పీడ్‌కు జనం బెంబేలెత్తిపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలను అంటకాగుతూ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. కొద్ది రోజులుగా జిల్లాలో నమోదవుతున్న పాజిటివ్ కేసులను పరిశీలిస్తే ఆందోళన కలుగుతోంది. మొదటి దశ వైరస్ వ్యాప్తి అనంతరం అక్టోబర్ నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఐదు నెలలుగా జిల్లాలో పెద్దగా చెప్పుకోదగ్గ కేసులేవీ నమోదు కాలేదు. జలుబు, ఇతరవ్యాధి లక్షణాలేవీ లేకపోవడంతో ప్రజలు సైతం పరీక్షలు చేయించుకోవడం మానేసారు. కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యం వెయ్యికి పైగా పరీక్షలు నిర్వహించగా రోజుకు సరాసరి 250 నుంచి 350 పాజిటివ్ కేసులు నమోదు అయ్యేవి. కొద్ది నెలలుగా వ్యాధి తగ్గు ముఖం పట్టడంతో టెస్టుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గి పోయింది. వైరస్ ప్రభావం తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అంచెలంచెలుగా లాక్డౌన్ సడలింపులు ఇచ్చింది. దీంతో హౌటళ్లు, బార్లు, సినిమాహాళ్లు తెరిచేందుకు సైతం గ్రీన్ సిగల్ లభించింది. దాంతో జనవరి నుంచి ఒక్కొకటిగా కేసులు నమోదవుతున్నాయి. ఇక మార్చి మొదటి వారం నుంచి కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో వైద్యాధికారులు పరీక్షలు సంఖ్యను సైతం పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నియంత్రణపై జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జీవో 68, 69 నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.
విద్యాసంస్థల్లో ప్రారంభమై...
రాష్ట్రంలోనూ వైరస్ ఉధతి తగ్గడంతో ప్రభుత్వం విద్యాసంస్థలను ప్రారంభించింది. ఈ క్రమంలో హయత్‌నగర్, పాలమాకుల ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైరస్ సోకింది. దాంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు,హాస్టళ్లలో కోవిడ్ పరీక్షలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో విద్యార్థులకు పాజిటీవ్ కేసుల సఖ్య పెరుగుతూ వచ్చింది. దాంతో విద్యార్థుల నుంచి క్రమంగా కుటుంబ సభ్యులకు కూడా విస్తరించే
అవకాశాలుండటంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో విద్యార్థులకు పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి. దాంతో ప్రభుత్వం గతనెలాఖరులోనే విద్యాసంస్థలకు తాళం వేసింది.
జాగ్రత్తలు పాటించకనే....
కొవిడ్ వైరస్ వేగంగా విస్తరించడానికి అజాగ్రత్తనే ప్రధాన కారణం. తొలిదశ కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రజలు క్రమంగా నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మొదటి దశలో వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వాలు లాక్డౌన్ నుంచి సడలింపులిచ్చింది. దీంతో మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించడలో నిర్లక్ష్యం వహించారు. ప్రారంభంలో వివిధ వ్యాపార సంస్థలు, కూరగాయల దుకాణాలు, కిరాణాలు, రేషన్ దుకానాల ఎదుట కనీసం మూడు అడుగుల దూరం పాటించేలా బాక్సులు, సర్కిళ్లు ఏర్పాటు చేసే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు గుంపులు గుంపులుగా మెలగడం వైరస్ వ్యాప్తికి దోహదపడుతోంది.
భౌతిక దూరంతోనే రక్షణ...
కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజల్ని కాపాడేందుకు అత్యంత ముఖ్యమైన ఆయుధం భౌతిక దూరం. అలాగే తలుపులు మూసి ఉంచిన ప్రదేశాలతో పాటు గాలి, వెలుతురు రాని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు భౌతిక దూరం పాటిస్తేనే రక్షణ ఉంటుందని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లే క్రమంలో తప్పకుండా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.
జిల్లాలో కేసుల వివరాలిలా....
గడిచిన వారం రోజుల వరకు జిల్లాలో 1600 వరకు కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా నగర శివారుల్లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా గ్రామీణ ప్రాంతాల్లోకి కేసులు విస్తరించే అవకాశం ఉందని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో గత ఆరు రోజులుగా కరోనా కేసుల సంఖ్య ఇలా ఉంది. మార్చి 20 నుంచి 30వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లాలో 1430 కేసులు నమోదు అయ్యాయి. 23వ తేదీ వరకు 616 కేసులు వెలుగు చూస్తే 26 నుంచి 30వ తేదీ వరకు 814 కేసులు నమోదు అయ్యాయి. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతండటంతో సర్వత్రా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.