Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్చార్జి తహసీల్దార్ వెంకట్రాంరెడ్డి
నవతెలంగాణ-కొత్తూరు
కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కొత్తూరు ఇన్చార్జి తహసీల్దార్ డీ వెంకట్రాంరెడ్డి, కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్‌లు అన్నారు. బుధవారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ నియంత్రణపై డాక్టర్ కవిత ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశంలో వారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ విధిగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మాస్కులు ధరించని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్‌తో గాని సబ్బుతో గాని ఎప్పటికప్పుడూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు. దుకాణాలు, హౌటల్స్, బార్బర్‌షాప్‌లు, బ్యాంకులు, అన్ని వాణిజ్య సముదాయాల ఎదుట శానిటైజర్ స్టాండ్స్‌ను ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు సూచించారు. కరోనా టీకాతో అపాయం లేదన్నారు. ఆటోకు మైక్‌లను ఏర్పాటు చేసి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజల్లో కోవిడ్ పట్ల అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతి, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.