Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
ఉపాధి హామీ చట్టం కింద అన్ని గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దుబ్బాక రామ్ చందర్ అన్నారు. బుధవారం యాచారం మండల పరిధిలోని నంది వనపర్తిలో ఉపాధి కూలీలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నుతోందన్నారు. నిత్యావసర సరుకుల రేట్లు ఆకాశాన్నంటిన ప్రభుత్వాలకు మాత్రం చీమకుట్టినట్లుగా కూడా లేదని దుయ్యబట్టారు. కరోనా నేపథ్యంలో ఉపాధి లేక, పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్రామాల్లో ఉపాధి పనిదినాలు పెంచి, కూలి రేట్లు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు అంజయ్య, జంగయ్య, ఉపాధిహామీ కూలీల పాల్గొన్నారు.
చేవెళ్ల: ఉపాధి హామీ కూలీలకు పనిదినాలను పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్ డిమాండ్ చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం లోని ఆలూరు గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశానికి వెళ్లి ఉపాధి కూలీలతో మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.600 లు పెంచాలని, అదేవిధంగా 200 రోజుల పనిదినాలు కల్పించాలని తెలిపారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలని అన్నారు. సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, ప్రతి వారం రోజులకోసారి డబ్బులు చెల్లించాలని కోరారు. పని చేసే ప్రదేశంలో కనీస వసతులు, తాగునీరు, కల్పించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ చేవెళ్ల మండల కన్వీనర్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.