Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరురూరల్
కేంద్ర ప్రభుత్వం రూర్బన్ పథకం ద్వారా రూ. 18 కోట్ల మంజూరైన పనులను మరో రెండు నెలలో పూర్తి చేయాలని జిల్లా డీఆర్డీఏ పీడీ కృష్ణన్ అన్నారు. బుధవారం తాండూరు మండలం బెల్కటూరు, సంఘంకాలన్, గుండ్లమడుగు తండా గ్రామాల్లో రూర్బన్ పథకం ద్వారా మంజూరైన పంచాయతీ భవనాల నిర్మాణానికి స్థలాన్ని, నర్సరీలను పరిశీలించారు. అనంతరం తాండూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు నెలల్లోపు పనులు అన్నీ పూర్తి చేయాలన్నారు. ఈ పథకం ద్వారా మొదటి విడతలో రూ. 18కోట్లు మంజూరు కాగా ఇప్పటివరకు రూ. 12కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయని వీటిలో 104 పనులు ఇంకా మొదలు పెట్టలేదని వాటిని కూడా త్వరగా మొదలు పెట్టి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా మీసేవ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, బస్ షెల్టర్లు, సీసీ రోడ్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, పురోగతిలో ఉన్న పనులన్నీ పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పనులన్నీ పూర్తి కాగానే రెండో విడతలో మరో రూ. 12 కోట్ల నిధులు మంజూరవుతాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే పనులను కొత్త వ్యక్తులకు అప్పగించాల్సి వస్తుందన్నారు. త్వరలో రైతుల కోసం తాండూరు ప్రాంగణంలో వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇందులో ట్రాక్టర్‌తో పాటు వ్యవసాయానికి సంబంధించిన ప్రతి వస్తువు అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలో 3600కళ్లాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 354మంది రైతులు మాత్రమే కళ్లాలు పూర్తి చేసుకున్నారని, మిగతావారు కూడా పూర్తి చేసుకోవాలన్నారు. గిరిజన రైతుల కోసం గిరి వికాస్ అనే పథకం ద్వారా ఇద్దరికీ రైతులకు కలిపి రెండున్నర ఎకరాలు భూమి ఉన్నట్లయితే ఉచితంగా బోరువేసి కరెంటుతోపాటు రైతులకు ప్రభుత్వమే నిధులిచ్చి కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ పథకం కోసం కోటి అరవై లక్షల నిధులు మంజూరు అయ్యాయని అర్హులైన గిరిజన రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా జిల్లాలో 647 వివిధ సంఘాలు ఉండగా బ్యాంకు లింకేజీ ద్వారా 304 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ఆరు సంవత్సరాల నుండి చేయనటువంటి టార్గెట్‌ను ఈసారి పూర్తి చేయడం జరిగిందన్నారు. స్త్రీ నిధి ద్వారా మహిళలకు అనేక రకాలైన వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే కావాల్సినటువంటి పరికరాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. కనీసం ఒక్కొక్క గ్రామ సంఘంలో ఒక వీఏవో 5 మంది సభ్యులను ఖచ్చితంగా ఎన్నిక చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే జిల్లాలో 1844 దరఖాస్తులు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇంకా మిగిలిన వారు కూడా త్వరలో దరఖాస్తులు అందేటట్లు వీవోయేలు చూసుకోవాలన్నారు. జిల్లాలో నూతనంగా 2,400 సంఘాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారికి కూడా రుణాలు త్వరలో మంజూరు కానున్నాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ అడిషనల్ పీడీ శెట్టి రవికుమార్ , పెద్దేముల్ ఎంపీడీవో లక్ష్మప్ప, తాండూరు ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, తాండూరు మండల పంచాయతీ అధికారి రతన్ సింగ్, యాలాల సూపరిండెంట్ జర్నప్ప , పెద్దేముల్ ఏపీవో నర్సింలు, తాండూరు ఏపీవో నరోత్తంరెడ్డి, యాలాల ఈసీ కృష్ణ, తాండూరు ఈసీ మధుసూదన్ రెడ్డి, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, దౌల్తాబాద్ మండలాలకు చెందిన టెక్నికల్ అసిస్టెంట్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.